https://oktelugu.com/

Medigadda Barrage: మేడిగడ్డ మేడిపండని తెలంగాణకు తెలిసింది ఆరోజే

లక్ష్మీ బ్యారేజీ గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది వారిని ఇబ్బంది పెట్టారు. లోపలికి వెళ్ళనీయకుండా బయటికి నెట్టేశారు. వారు అక్కడికి వెళ్లి ఫోటోలు తీసి బయటికి ప్రపంచాన్ని చూపిస్తే ఇబ్బంది అవుతుందని భావించి ఆ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది అలా చేశారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 15, 2024 / 02:20 PM IST
    Follow us on

    Medigadda Barrage: అది 2023.. జూలై నెల.. ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా వర్షం కురుస్తోంది. ఊర్లు ఏర్లయ్యాయి.. పట్టణాలు చెరువులయ్యాయి. ఎటు చూసినా నీళ్ళు.. వర్షం కురుస్తూనే ఉంది. వాగులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించాయి. చెరువులు తెగి పోయాయి. నదులు పోటెత్తాయి. వాస్తవానికి అప్పుడు అందరి దృష్టి వర్షం మీదే ఉంది. కానీ చాలామంది ఓ విషయాన్ని విస్మరించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. నిధులు, నీళ్ళు, నియామకాల కోసం తెలంగాణలో కొట్లాట జరిగితే.. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ల కోసం ఖర్చు చేసిన నిధులు నిష్ఫలమయ్యాయి. అప్పటి ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం కథలు కాస్త కల్లలయ్యాయి. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడిగడ్డ కుంగుబాటు గురించి శాసనసభలో పదేపదే ప్రస్తావిస్తున్నది. అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలనలు చేయిస్తోంది. ఎమ్మెల్యేలను తీసుకెళ్లి దగ్గరుండి చూపిస్తోంది. కానీ వారందరి కంటే ముందు ఓ పత్రికలో ఫోటో జర్నలిస్ట్ మేడిగడ్డ మేడిపండు అని బయట పెట్టాడు.జర్నలిస్ట్ టెంపర్ మెంట్ ఎంత బలంగా ఉంటే.. వాస్తవాలు ప్రజలకు అంత బాగా తెలుస్తాయి. అలాంటిదే ఈ ఘటన కూడా..

    జూలై మాసంలో తెలంగాణలో విపరీతంగా వర్షాలు కురిసాయి. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా పరిధిలో కనివిని ఎరుగని స్థాయిలో వర్షపాతం నమోదయింది. కాటారం, మహదేవ్ పూర్, భూపాలపల్లి, కాళేశ్వరం ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరికి విపరీతంగా వరద వచ్చింది. సమయంలో ఓ పత్రికా యాజమాన్యం సదరు ఫోటో జర్నలిస్టుకు ఫోన్ చేసి ఆ ఫోటోలు తీసుకురావాలని సూచించింది. హనుమకొండ నుంచి బయలుదేరిన అతడు ఆ ప్రాంతానికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. అతడు చేరుకున్న తర్వాత కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్ వద్ద విధుల్లో ఉన్న పోలీసులు, అధికారులు, అక్కడ సిబ్బంది భారీ వరదల్లో చిక్కుకున్నారని అతనికి తెలిసింది. దీంతో ధైర్యం తెచ్చుకున్న ఆ ఫోటో జర్నలిస్టు తోటి విలేకరితో కలిసి ద్విచక్ర వాహనం మీద మేడిగడ్డకు బయలుదేరారు.. చివరికి లక్ష్మీ బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు.

    లక్ష్మీ బ్యారేజీ గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది వారిని ఇబ్బంది పెట్టారు. లోపలికి వెళ్ళనీయకుండా బయటికి నెట్టేశారు. వారు అక్కడికి వెళ్లి ఫోటోలు తీసి బయటికి ప్రపంచాన్ని చూపిస్తే ఇబ్బంది అవుతుందని భావించి ఆ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది అలా చేశారు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి కాళేశ్వరం వంతెన పైకి వెళ్లారు. వరద నీటి ప్రవాహానికి వంతెన చివర మొత్తం కొట్టుకుపోయింది. గోదావరి ఉగ్రరూపం వల్ల పెద్ద పెద్ద చెట్లు విరిగిపోయి వంతెన కింద ఉన్న నీటి ప్రవాహానికి అడ్డం పడుతున్నాయి. ఆ నీరు సమీప గ్రామాన్ని ముంచేయడంతో జనజీవనం మొత్తం అస్తవ్యస్తమైంది.

    ఈ లోగానే వరద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఆ విలేకరి, ఫోటో జర్నలిస్ట్ ఇద్దరూ కలిసి లక్ష్మి బ్యారేజ్ వద్దకు వెళ్లారు. అక్కడ గోదావరి వరద తీవ్రంగా రావడంతో బ్యారేజీ సిబ్బంది లో ఆందోళన నెలకొంది. మెల్లిగా విలేఖరి, ఫోటో జర్నలిస్టు చిన్న గేటు ద్వారా లోపలికి వెళ్లారు. ఆ లోపల చూస్తే భారీగా నీటి ప్రవాహం.. అదే దారిలో వారు లక్ష్మీ బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. లక్ష్మీ బ్యారేజీ కి ఉన్న ఇనుప షట్టర్లు కొంచెం మాత్రమే తెరిచి ఉన్నాయి. ఆ షట్టర్ నుంచి ఫోటో జర్నలిస్టు బలంగా దూరాడు. లోపల చూస్తే ఆ దృశ్యం మొత్తం టైటానిక్ సినిమా లాగా కనిపించింది. లక్ష్మీ బ్యారేజీ గోడ మొత్తం కూలింది. లోపల ఉన్న డీజిల్ డ్రమ్ములు నీటిలో పైకి తేలుతున్నాయి. మ్యారేజ్ మొత్తం చెత్తతో నిండిపోయింది. రక్షణ గోడలు మొత్తం కూలిపోయాయి. ఈ ఫోటోలను సదరు ఫోటో జర్నలిస్టు వెంట వెంటనే తీశాడు. బ్యారేజీ లోకి వెళ్లారని గమనించిన అక్కడ సిబ్బంది గొడవ పెట్టుకున్నారు. కానీ ఆ ఫోటో జర్నలిస్టు, విలేఖరి దీటుగా సమాధానం చెప్పి బయటకు వచ్చారు. అంతే వారు ఫోటోలు పంపించడం.. ఆ పత్రికలో వార్తలు రావడంతో ఒక్కసారిగా మేడిగడ్డ బ్యారేజీ మేడిపండు అని తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది. ఆ ఘటన నుంచి అసెంబ్లీలో ఎన్నికల ఫలితాల వరకు భారత రాష్ట్ర సమితి అడుగడుగునా ప్రతికూల ఫలితాలనే చవిచూసింది.