
Rangastalam Vs Dasara : మాస్ లుక్ లో దసరా సినిమాలో ధరణిగా కనిపించిన నానీ దుమ్మురేపుతున్నాడు.. ఇన్నాళ్లు పక్కింటి అబ్బాయి పాత్రలు పోషించిన నాని మాస్ అవతార్ లో ప్రేక్షకులను సరికొత్తగా అలరిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాను చాలామంది రామ్ చరణ్ రంగస్థలంతో పోల్చుతున్నారు. 2018 నాడు రాంచరణ్ ఎలాంటి రికార్డులు బ్రేక్ చేశాడో.. నేడు నాని కూడా అలాంటి రికార్డులే సెట్ చేస్తాడని జోస్యం చెబుతున్నారు. కాకపోతే ఈ రెండు సినిమాలకి కొన్ని తేడాలు తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్. రంగస్థలం రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది.. ఫణింద్రభూపతి ఆరాచకాలను మొదట్లో చూపిన సుకుమార్.. తర్వాత క్లైమాక్స్ లో ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్ట్ ఇస్తాడు.. ఇది ఒక్కటి మినహా రంగస్థలం, దసరా సినిమాలు ఒకే లాగా కనిపిస్తున్నాయని ప్రేక్షకులు అంటున్నారు.
దసరా సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదెల సుకుమార్ దగ్గర పని చేశాడు. సుకుమార్ దగ్గర స్క్రిప్ట్ అసోసియేట్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన శ్రీకాంత్.. ఏకంగా అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. అంతేకాదు ఫస్ట్ సిట్టింగ్ లోనే నానికి కథ చెప్పి ఓకే చేయించాడు. అంతేకాదు చాలా తెలివిగా తమిళ్, మలయాళ, కర్ణాటక సినీ నటులకు ఈ సినిమాలో కీలకపాత్రలు ఇచ్చి.. తన తొలి సినిమాకే పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ పెంచుకున్నాడు. అంతేకాదు ప్రచారాన్ని కూడా ముమ్మరం చేయడంతో.. దసరా సినిమా వాల్తేరు వీరయ్య కు మించి ఓపెనింగ్స్ సాధించింది. ఒకరకంగా చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్లు లేక బాధపడుతున్న నానికి ఇది మంచి కం బ్యాక్ సినిమా అని సినీ పండితులు చెబుతున్నారు.
ఇక రంగస్థలం సినిమాలో హీరో చెవిటివాడిగా కనిపిస్తాడు. దసరా సినిమాలో పిరికివాడిగా కనిపిస్తాడు. సమంతకు వేరే పెళ్లి చేస్తున్నారని తెలిసి ఆమె తండ్రిని ఎదిరించేలాగా రామ్ చరణ్ పాత్రను రూపొందించారు. దసరా సినిమాలో మాత్రం కీర్తి సురేష్ ను నాని తన స్నేహితుడు సూరి కోసం త్యాగం చేస్తాడు. కానీ ఇక్కడ శ్రీకాంత్ తెలివిగా సూరి పాత్రను ముగించి.. కీర్తి సురేష్, నాని ఒకటయ్యేలా కథను మలిచాడు..

దసరా సినిమాకు ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్లు ప్రాణం పోశాయి. రంగస్థలం సినిమాను కూడా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్లు మరో స్థాయిలో నిలబెట్టాయి. స్థూలంగా చెప్పాలంటే సుకుమార్ దగ్గర పని చేసిన శ్రీకాంత్ దసరా సినిమాలో అక్కడక్కడ రంగస్థలాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు.. రంగస్థలంలో ఉత్తరాంధ్ర ఆచార వ్యవహారాలను సుకుమార్ చూపిస్తే.. దసరా సినిమాలో పూర్తి తెలంగాణ సంస్కృతిని శ్రీకాంత్ చూపించాడు. ఈ సినిమాలో నాని ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తోంది. తన గురువు తీసిన సినిమాను స్ఫూర్తిగా తీసుకొని.. దసరా సినిమాను రూపొందించి.. హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు.. ప్రస్తుతం ఈ ఆనందాన్ని శ్రీకాంత్ టన్నుల కొద్దీ అనుభవిస్తున్నాడు. అన్నట్టు ఈ రెండు సినిమాలు మార్చి 30న విడుదలయ్యాయి. రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రామ్ చరణ్ కెరియర్ లో ఆల్ టైం సూపర్ హిట్ గా నిలిచింది. దసరా కూడా నాని కెరియర్ లో హైయస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. పోటీలో మరో సినిమా లేకపోవడంతో ఖచ్చితంగా భారీ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.