Mohammed Shami: మహమ్మద్ షమీ.. ఒకే ఒక్క మ్యాచ్ తో ప్రపంచాన్ని ఒక్కసారిగా తన గురించి మాట్లాడేలా చేశాడు. ఓటమి అంచున ఉన్న భారత్ ను విజయతీరాల వైపు చేర్చాడు. యావత్ భారతావని ఆకర్షించాడు. ఆయన క్రీడా నైపుణ్యాన్ని దేశ ప్రజలు కొనియాడుతున్నారు. అభినందనలతో ముంచేత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసి ఆయన స్వగ్రామంలో మినీ గ్రౌండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం విశేషం.
ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ కాదు పెట్టిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ లో హోరాహోరి ఫైట్ నడిచింది. ఒకానొక దశలో భారత్ ఓటమి ప్రమాదం వైపు ఉండేది. కానీ బౌలర్ మహమ్మద్ షమీ ఏకంగా ఏడు వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. విజయ తీరాల వైపు నడిపించి.. భారత్ ను ఫైనల్లోకి అడుగు పెట్టేలా చేశాడు. ఆ యువ క్రికెటర్ నైపుణ్యానికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో అయితే సంబరాలు మిన్నంటాయి.
ఈ నేపథ్యంలో యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మద్ షమీ నైపుణ్యాన్ని అభినందిస్తూ ఆయన స్వగ్రామం సాహసపూర్ అలీ నగర్ లో మినీ స్టేడియం తో పాటు ఓపెన్ జిమ్ నిర్మించేందుకు నిర్ణయించింది. వెంటనే సన్నాహాలు ప్రారంభించింది. ఈ రెండు నిర్మాణాలు పూర్తి చేసేందుకు అనువైన స్థలాన్ని సైతం గుర్తించడం విశేషం.
దీనికి సంబంధించి అమ్రోహ జిల్లా కలెక్టర్ రాజేష్ త్యాగి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మహమ్మద్ షమీ సొంత గ్రామంలో మినీ స్టేడియం తో పాటు ఓపెన్ జిమ్ నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని గుర్తించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. షమీ స్వగ్రామంలో క్రీడా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రాజ్యసభ సభ్యుడు, ఆర్ ఎల్ డి నేత జయంత్ సింగ్ ముందుకొచ్చారు. తన సొంత ఎంపీ ల్యాండ్ నిధులను ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. ప్రభుత్వం ఒక్కసారిగా వరాలు జల్లు కురిపించడంతో సాహసపూర్ అలీ నగర్ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది మహమ్మద్ షమి ద్వారానే సాధ్యమైందని అభినందనలతో ముంచెత్తుతున్నారు.