Nizamabad: ‘బలగం’ సినిమాలో మూలుగ బొక్క కోసం బావ బామ్మర్దుల మధ్య జరిగే గొడవ జరిగే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాంటి సీనే జగిత్యాల జిల్లాలో రిపీట్ అయింది. అయితే సినిమా సీన్‌కు కాస్త భిన్నంగా ఇక్కడ జరిగింది. సినిమాలో పెళ్లి తర్వాత అత్తవారింటికి వచ్చిన అల్లుడికి మూలుగ బొక్క వేయకపోవడంతో బావ, బామ్మర్దుల మధ్య జరిగిన గొడవ.. ఆ కుటుంబంలో కలహాలకు దారి తీస్తుంది. అచ్చం అలాగే మూలుగ బొక్క కోసం జరిగిన గొడవ.. చిరవకు పెళ్లి సంబంధం రద్దు అయింది.
నిశ్చితార్థం తర్వాత..
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన అబ్బాయికి, నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబసభ్యులు కట్నకానుకలు మాట్లాడుకున్నారు. ఇక్కడివరకు అంతా సాఫీగానే సాగింది. ఇక నవంబరు మొదటి వారంలో వివాహ నిశ్చితార్ధం సందర్భంగా.. ఆడపెళ్లి వారి ఇంట మాంసాహారంతో భోజనాలు పెట్టారు. అబ్బాయి తరఫు బంధువులు మూలుగ బొక్క కావాలని అడిగారు. దాంతో ఇరువర్గాల మధ్య చిన్న గొడవ మొదలైంది. ఈ గొడవ చినికి చినికి గాలివానగా మారింది.
చివరకు ఠాణాకు చేరింది..
మూలుగ బొక్క గొడవ చివరికి పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడ ఇరువర్గాలు శాంతించినప్పటికీ.. పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. వివాహ సమయంలో ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవకు కారణం అవుతాయన్న విషయం తెలిసిందే.