Malla Reddy: పాలమ్మిన, పూలమ్మిన, కాయ కష్టం చేసిన.. అంటూ ఆ మధ్యన మీడియా ముఖంగా తన కష్టం గురించి మంత్రి మల్లారెడ్డి చెప్పిన మాటలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అప్పటినుంచి ఆయన సోషల్ మీడియా స్టార్ గా మారిపోయారు. మంత్రి కేటీఆర్ సైతం తరచూ తన ప్రసంగాల్లో మల్లారెడ్డి మాటలను గుర్తు చేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన స్టార్ కామెడీ పొలిటీషియన్ గా మారారు. స్టార్ సెలబ్రిటీగా మారిపోయారు. మొన్న ఈ మధ్యనే పాలమ్మిన పాత స్కూటర్ ను బయటకు తీశారు. ఆ స్కూటర్ పైనే ప్రజల్లోకి వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తన వయసుకు మించి చిలిపి చేష్టలతో నవ్వుల పాలవుతున్నారు. తన స్థాయిని తక్కువ చేసుకుంటున్నారు.
మల్లారెడ్డి అంటేనే మాస్ ప్రచారం. అది కాస్త తన చేష్టలతో పక్కకు తప్పుతోంది. ప్రచారానికి వెళ్తున్న ఆయన నేలపైనే ప్రజల మధ్య కూర్చుంటున్నారు. వారిలో తాను ఒకడినని చెబుతున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ముసలావిడను మంత్రి మల్లారెడ్డి ఒడిలో కూర్చోబెట్టుకున్నారు.దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పసిబిడ్డ అయినా.. పండు ముసలి అయిన అందరూ తనకు ఒకటేనని తరచూ మల్లారెడ్డి చెబుతుంటారు. లాలించడం తెలుసు.. పాలించటము తెలుసని సెటైరికల్ గా మాట్లాడుతుంటారు. ఈ క్రమంలోనే పండు ముదుసలిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే మంత్రి చర్యలను చూసి అక్కడ ఉన్న వారు పడి పడి నవ్వుకున్నారు. పెద్దావిడ ఆశీర్వాదం తీసుకొని దగ్గరకు తీసుకున్న తీరు అభినందనీయమే అయినా.. ఒడిలో పడుకోబెట్టుకోవడం కొద్దిగా అతిగా అనిపిస్తుంది. విమర్శలకు తావిస్తోంది. ఇటువంటి చర్యలతో మంత్రి మల్లారెడ్డి తన హుందాను తగ్గించుకుంటున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ సోషల్ మీడియా వేదికగా ఆయన స్టార్ పొలిటీషియన్ గా ఎదిగారో.. అదే సోషల్ మీడియాలో ఆయన దిగజారడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
— Anitha Reddy (@Anithareddyatp) November 7, 2023