Kumari Aunty Food Stall: కుమారి ఆంటీ కథ ఒక గుణపాఠమే

వీధి వ్యాపారస్తులకు ప్రభుత్వం అండగా నిలవడం మంచిదే అయినా.. ట్రాఫిక్ సమస్య ఎలా పరిష్కరిస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. భాగ్యనగరం అభివృద్ధిలో చిరు వ్యాపారుల పాత్ర కీలకం. మొత్తం గ్రేటర్ పరిధిలో 1.65 లక్షల మంది వీధి వ్యాపారులు ఉన్నట్టు గుర్తించారు.

Written By: Dharma, Updated On : February 2, 2024 2:05 pm

Kumari Aunty Food Stall

Follow us on

Kumari Aunty Food Stall: కుమారి ఆంటీ కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. ఐటీ కారిడార్ లో తోపుడు బండి పెట్టుకుని భోజనాలు విక్రయించే ఆమె.. సోషల్ మీడియా పుణ్యమా అని పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. తన వ్యాపారాన్ని పెంచుకోగలిగారు. ఇప్పుడు అదే సోషల్ మీడియా ఆమెను కష్టాల్లో నెట్టింది. ఆమె వ్యాపారం నిలిచిపోయేలా చేసింది. తెలంగాణ సర్కార్ స్పందించేలా కూడా సోషల్ మీడియా చేసింది. ఆమె వ్యాపారానికి ఎటువంటి ఇబ్బందులు పెట్టవద్దని సీఎం రేవంత్ స్వయంగా ఆదేశాలు జారీ చేసేదాకా పరిస్థితి వచ్చింది. అయితే ఈ ఎపిసోడ్ సుఖాంతం అయినా.. ఎన్నెన్నో ప్రశ్నలు తెరపైకి రావడం విశేషం.

వీధి వ్యాపారస్తులకు ప్రభుత్వం అండగా నిలవడం మంచిదే అయినా.. ట్రాఫిక్ సమస్య ఎలా పరిష్కరిస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. భాగ్యనగరం అభివృద్ధిలో చిరు వ్యాపారుల పాత్ర కీలకం. మొత్తం గ్రేటర్ పరిధిలో 1.65 లక్షల మంది వీధి వ్యాపారులు ఉన్నట్టు గుర్తించారు. అందులో 1.35 లక్షల మందికి గుర్తింపు కార్డులు అందించారు. పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి కింద రుణాలు కూడా అందించారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంలో ఈ వీధి వ్యాపారుల ద్వారానే ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోంది. కుమారి ఆంటీ విషయంలో కూడా తెలంగాణ పోలీసులకు ట్రాఫిక్ ఇబ్బంది ఎదురైంది. అందుకే ఆమె వ్యాపారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కేసు నమోదు చేశారు. అయితే సోషల్ మీడియాలో రచ్చ జరగడంతో ఇబ్బందులు తప్పవని గ్రహించిన ప్రభుత్వం ఆమె వ్యాపారానికి అనుమతి ఇచ్చింది.

నగరంలో ఈ చిరు వ్యాపారాల ద్వారా లక్షలాదిమంది జీవనోపాధి పొందుతున్నారు. అయితే అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా పరిగణలోకి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో వీధి వ్యాపారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పోలీస్ శాఖ కలుగజేసుకుని ప్రత్యేక జోన్లు వారికోసం కేటాయించింది. ఐటీ కారిడార్ తో పాటు కూకట్ పల్లి, అమీర్ పేట, సికింద్రాబాద్, అబిడ్స్, మోహిదీపట్నం, ఎల్బీనగర్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా వీధి వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో వీరి కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కానీ కొద్ది రోజులకే అవి పరిమితం అయ్యాయి. ఎప్పటి మాదిరిగానే వీధి వ్యాపారాలు వెలిశాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీధి వ్యాపారాలను నియంత్రించాలని నగరవాసులు కోరుతున్నారు. అదే సమయంలో వీధి వ్యాపారుల ఉపాధికి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తానికి అయితే కుమారి ఆంటీ కథ.. ఎన్నెన్నో గుణపాఠాలను నేర్పింది. మరెన్నో ప్రశ్నలను లేవనెత్తింది. కొన్ని కీలక బాధ్యతలను ప్రభుత్వానికి గుర్తు చేసింది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.