Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే గంటా రాజీనామా ఆమోదం.. వెనుక భారీ వ్యూహం

దాదాపు మూడేళ్ల కిందట రాజీనామాకు ఇప్పుడు ఆమోదించడం వెనుక అధికార వైసిపి వ్యూహాత్మక ఎత్తుగడ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో నేరుగా స్పీకర్ ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని గంటా శ్రీనివాసరావు కోరారు.

Written By: Dharma, Updated On : January 24, 2024 10:00 am
Follow us on

Ganta Srinivasa Rao: టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఎట్టకేలకు స్పీకర్ ఆమోదించారు. మూడేళ్ల కిందట ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 2021 ఫిబ్రవరి 12న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల రిలే నిరాహార దీక్షకు మద్దతుగా గంటా రాజీనామా ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా సమర్పించినట్లు చెప్పారు. అయితే ఆ రాజీనామా పై నిర్ణయాన్ని ఇంతకాలం పెండింగ్ లో ఉంచిన స్పీకర్.. ఇప్పుడు ఆమోదించడమే కాదు.. గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.

దాదాపు మూడేళ్ల కిందట రాజీనామాకు ఇప్పుడు ఆమోదించడం వెనుక అధికార వైసిపి వ్యూహాత్మక ఎత్తుగడ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో నేరుగా స్పీకర్ ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని గంటా శ్రీనివాసరావు కోరారు. అయితే అప్పట్లో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించి ఆయన ప్రాతినిధ్యం వహించిన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉప ఎన్నిక పెడతారని అంతా భావించారు. విశాఖ రాజధాని నేపథ్యంలో రెఫరెండంగా తీసుకొని ఎన్నిక నిర్వహిస్తారని విశ్లేషణలు వచ్చాయి. కానీ అటువంటిదేమీ జరగలేదు. కానీ ఇప్పుడు ఉన్నపలంగా, ఎన్నికల షెడ్యూల్ వెల్లడించునున్న తరుణంలో రాజీనామా ఆమోదించడంపై రకరకాల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.

ప్రధానంగా రాజ్యసభ ఎన్నికల వ్యూహంలో భాగంగా వైసిపి ఈ ఎత్తుగడ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 2తో ఏపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఎన్నిక అనివార్యంగా మారింది. ఫిబ్రవరి, మార్చిలో రాజ్యసభ ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు జగన్ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారు. రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సి ఉన్నందున జగన్ జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగానే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదమని టాక్ నడుస్తోంది. అయితే టిడిపి నుంచి నలుగురు వైసీపీలోకి.. వైసీపీ నుంచి టిడిపిలోకి నలుగురు వచ్చారు. ఇటీవల టిడిపిలో చేరేందుకు మరి కొంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. అయితే వారిపై పార్టీ ధిక్కారణ కింద వేటు వేస్తారా? లేదా? అన్నది చూడాలి.