https://oktelugu.com/

Mukesh Ambani – Anil Ambani : అన్న ముఖేష్ ఎదుగుదల.. తమ్ముడు అనిల్ దివాళా.. ఇదే విధి వైచిత్రి అంటే..

ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ సమానంగా ఆస్తులు పంచుకున్నారు. ముఖేష్ ఎక్కడికో ఎదిగిపోయాడు. అనిల్ నేల చూపులు చూస్తున్నాడు. ఇద్దరూ అన్నదమ్ములే. కానీ ఇద్దరిలో ఎంత తేడా.

Written By:
  • NARESH
  • , Updated On : February 29, 2024 / 10:57 AM IST
    Follow us on

    Mukesh Ambani – Anil Ambani : తెలుగు సినిమాల్లో..మరీ ముఖ్యంగా 90 ల కాలంలో కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. అన్న మంచివాడైతే, తమ్ముడు చెడ్డవాడిగా ఉండేవాడు. ఒకవేళ తమ్ముడు మంచోడు అయితే, అన్న చెడ్డవాడిగా ఉండేవాడు. మంచివాడి సంపాదన అంతకంతకు పెరుగుతుంటే.. చెడ్డవాడి సంపాదన అంతకంతకు తగ్గిపోయేది. చివరికి తమ్ముడిని అన్న ఆదుకోవడంతో కథ సుఖాంతం అయ్యేది. అవంటే సినిమాలు కాబట్టి.. అలా ఉంటాయి.. మరి నిజ జీవితంలో అలా జరుగుతుందా? వ్యాపారం అంటే.. ఎవరైనా సరే లాభనష్టాలు మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. అంతే తప్ప సేవా దృక్పథంతో ఎవరూ వ్యాపారం చేయరు. అయితే ఇలాంటి వ్యాపారం చేయడంలో కొందరు ఆరి తేరితే.. మరికొందరు నిండా మునుగుతారు. అలాంటి స్టోరీ నే అంబానీ సోదరులది.

    ధీరుబాయ్ అంబానీ చనిపోయిన తర్వాత ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ వ్యాపారాలను సమంగా పంచుకున్నారు. కానీ ముఖేష్ అంబానీ దీర్ఘ దృష్టితో తన రిలయన్స్ ఇండస్ట్రీస్ ని మరింత అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. పిల్లలు కూడా తనకు చేతికి అంది రావడంతో వ్యాపారాన్ని మరింత విస్తరించారు. ఒకప్పుడు చమురు శుద్ధి రంగంలో మాత్రమే ఉండే రిలయన్స్.. ఇప్పుడు అనేక రంగాలకు విస్తరించింది. టెలికాం, మీడియా, రిటైల్, ఇంకా చాలా రంగాల్లో రిలయన్స్ కు సంస్థలు ఉన్నాయి. ఫలితంగా ముకేశ్ అంబానీ ఆసియాలోనే అతిపెద్ద ధనవంతుల్లో ఒకడిగా నిలిచాడు.

    ముఖేష్ అంబానీ ఎదుగుదల అలా ఉంటే.. అనిల్ అంబానీ పతనం మరో విధంగా ఉంది. ఆయన తన చేతిలో ఉన్న సంస్థలు పతనాన్ని నమోదు చేయడంతో తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్నారు.. అనిల్ ధీరుబాయ్ అంబానీ గ్రూప్ కు చెందిన రిలయన్స్ క్యాపిటల్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. ఈ సంస్థను టేక్ ఓవర్ చేసేందుకు హిందూజా గ్రూప్ లోని ఇండస్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ పచ్చ జెండా ఊపింది. జూన్ 2023లో రిలయన్స్ క్యాపిటల్ కోసం రెండవ రౌండ్ బిడ్డింగ్ సమయంలో ఇండస్ ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లిమిటెడ్ ప్రకటించిన 9,650 కోట్ల ఉద్దీపన ప్యాకేజీ కి ఆమోదం లభించింది. కానీ సహాయం రిలయన్స్ క్యాపిటల్ ఆర్థిక కష్టాలను ఎంతవరకు తీర్చగలుగుతుందనేదే ఇక్కడ ప్రశ్న.

    వాస్తవానికి 2018 లో రిలయన్స్ క్యాపిటల్ విలువ 93,851 కోట్లుగా ఉంది. అనీల్ అంబానీ ఏర్పాటు చేసిన కంపెనీలు నష్టాల బాట పట్టడం, ఆర్థికంగా పతనం కావడంతో.. ఆ కంపెనీల విలువ దారుణంగా పడిపోయింది. ఫలితంగా అప్పట్లో రుణాలు ఇచ్చిన వారంతా అనిల్ మీద ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అనేక కోర్టు కేసులయిన తర్వాత 2021, నవంబర్ 30న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. అప్పటినుంచి రిలయన్స్ క్యాపిటల్ కు ఇబ్బందులు మరింత పెరిగాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలయన్స్ క్యాపిటల్ బోర్డు ను రద్దు చేసింది. కంపెనీకి సంబంధించి రుణ దాతల సమస్యలను పరిష్కరించేందుకు వై నాగేశ్వరరావు అనే అధికారిని నియమించింది. అప్పటినుంచి రిలయన్స్ క్యాపిటల్ దివాళా ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది.

    ఇటీవల రిలయన్స్ క్యాపిటల్ దివాళా ప్రక్రియకు సంబంధించి మొదటి రౌండ్ వేలంలో టోరెంట్, ఇండస్ఇండ్, ఓక్ ట్రీ, కాస్మియా ఫైనాన్షియల్, ఆతమ్ ఇన్వెస్ట్మెంట్, బీ రైట్ రియల్ ఎస్టేట్ సంస్థలు 4,000 నుంచి 4,500 కోట్ల వరకు రిజల్యుషన్ ప్రణాళికలు సమర్పించాయి. ఆ సంస్థలు వేసిన బిడ్డ చాలా తక్కువగా ఉండటంతో రుణదాతల కమిటీ తిరస్కరించింది. దీంతో ఒక్కసారిగా అనిల్ అంబానీలో నైరాశ్యం పెరిగిపోయింది. దీనికి సంబంధించి త్వరలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకటి మాత్రం సుస్పష్టం వ్యాపారం అన్నాక ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. అది లేకుంటే ఎంతటి వారైనా దివాళా తీయక తప్పదు. ధీరుభాయ్ అంబానీ చనిపోయినప్పుడు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ సమానంగా ఆస్తులు పంచుకున్నారు. ముఖేష్ ఎక్కడికో ఎదిగిపోయాడు. అనిల్ నేల చూపులు చూస్తున్నాడు. ఇద్దరూ అన్నదమ్ములే. కానీ ఇద్దరిలో ఎంత తేడా.