Russia Luna 25 Spacecraft : రష్యా లూనా.. చంద్రుడి వద్దకు సమీపించే వేళ హైరానా!

సాంకేతిక సమస్య కారణంగా రష్యా పంపించిన నౌక పనితీరు అత్యవసర స్థితికి చేరుకుంది. గడచిన 50 సంవత్సరాలలో చంద్రుడి పైకి రష్యా తొలి లాండర్ ను ప్రయోగించింది.

Written By: K.R, Updated On : August 20, 2023 11:48 am
Follow us on

Russia Luna 25 Spacecraft : ఇస్రో చంద్రుడి మీదికి చంద్రయాన్_3 ని ప్రయోగించింది. ఇది చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించిన విషయాలను పూర్తిగా కనుగొనే పనిలో పడింది. ప్రయోగించిన నాటి నుంచి నేటి వరకు ఇస్రో ఆశించిన ప్రకారమే చంద్రయాన్_3 ఫలితాలు వస్తున్నాయి. చంద్రయాన్_2 పోలిస్తే ఈ ప్రయోగం దాదాపు విజయవంతమైనట్టేనని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే భారత్ ప్రయోగించిన కొంతకాలానికి రష్యా కూడా “లూనా” ను చంద్రుడి మీదికి పంపించింది. అయితే ఇస్రో కంటే మెరుగైన ఫలితాలు ఇస్తాయని భావించిన రష్యాకు ఆదిలోనే హంస పాదు ఎదురైంది.

చంద్రుడిపై అడుగు పెట్టేందుకు రష్యా పంపించిన “లూనా_25” ల్యాండర్ కార్యకలాపాల్లో సమస్య తలెత్తింది.. దీనికి సంబంధించిన వివరాలను రష్యా అంతరిక్ష సంస్థ “రాస్ కాస్మోస్ ” వెల్లడించింది. సాంకేతిక సమస్య కారణంగా రష్యా పంపించిన నౌక పనితీరు అత్యవసర స్థితికి చేరుకుంది. గడచిన 50 సంవత్సరాలలో చంద్రుడి పైకి రష్యా తొలి లాండర్ ను ప్రయోగించింది. ఈనెల 16న ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. “లూనా_25” చంద్రుడి కక్ష్య లోకి చేరుకుంది. అయితే అక్కడి నుంచి చంద్రుడు పైకి సోమవారం ల్యాండర్ దిగాల్సి ఉంటుంది. తాజా సమస్య వల్ల ఆ ల్యాండింగ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపై రష్యా అంతరిక్ష సంస్థ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

ఇక ఇదే సమయంలో భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్_3 కీలక దశలు పూర్తి చేసుకుంది. చంద్రుడి మీద దిగేందుకు కేవలం ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. చంద్రుడికి అత్యంత దిగువన లాండర్ మాడ్యూల్ కక్ష్య ను ఇస్రో అధికారులు తగ్గించారు. ఫైనల్ డీ బూస్టింగ్ ఆపరేషన్ విజయవంతంగా చేపట్టి ల్యాండర్ ను దిగువ కక్ష్య కు చేర్చారు. దీంతో చంద్రుడి నుంచి అతి దగ్గర కక్ష్య లోకి విక్రమ్ మాడ్యుల్ చేరింది.

చంద్రుడి దక్షిణ ధృవం లక్ష్యంగా చంద్రయాన్_3 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. చంద్రయన్_2 ప్రయోగం జరిపినప్పుడు ఎదురైన వైఫల్యాలను అధిగమించేందుకు పకడ్బందీ ప్రణాళికతో ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇస్రో అనుకున్నట్టుగానే చంద్రయాన్_3 గమనం సాగుతోంది. 20వ తేదీన జరిగే డీ బూస్టింగ్ ద్వారా చంద్రుడికి సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఇస్రో భావిస్తోంది. గతంలో చంద్రుడి మీద నీటి జాడలను కనుగొన్న ఇస్రో.. ఈసారి ఏ విషయాలను వెలుగులోకి తెస్తుందోనని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.