Gaddar Greatness : గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్.. తెలంగాణ ప్రజా గాయకుడిగా పేరుపొందిన ఈయన.. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువు అయ్యారు. సాంస్కృతిక ఆస్తిత్వానికి నిలువెత్తు పతాక ఆయన 1949లో తెలంగాణలోని తూఫ్రాన్ ప్రాంతంలో దళిత మాల సామాజిక వర్గంలో జన్మించారు. మొదటినుంచి అణచివేత పట్ల వ్యతిరేకంగా పోరాటాలు నడిపారు. చదువుకుంటున్న సమయంలోనే విప్లవ గేయాలు రచించి పాడేవారు. అలా పాడి పాడి ప్రజా గాయకుడిగా పేరుపొందారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. “అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా” అనే పాటలు రచించి తెలంగాణ ఉద్యమానికి సరికొత్త రూపును తీసుకొచ్చారు.
ఎక్కడికైనా వెళ్లేవారు
భుజం మీద గొంగడి, చేతిలో ఎర్ర జెండాతో.. ప్రత్యేకమైన ఆహార్యాన్ని గద్దర్ ప్రదర్శించేవారు. అప్పటికప్పుడు పాటలు రాసి పాడేవారు. ధిక్కారానికి నిలువెత్తు ప్రతీకలాగా ఉండేవారు. 1987లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కారంచేడు ప్రాంతంలో దళితుల హత్య జరిగినప్పుడు..ఆ పాశవిక ఘటనకు వ్యతిరేకంగా పోరాటం నడిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఎన్కౌంటర్లకు నిరసనగా అనేక ప్రదర్శనలు జరిపారు. బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. మావోయిస్టులను పోలీసులు అకారణంగా చంపేస్తున్నారని కోర్టులో కేసులు కూడా వేశారు. దానికి నిరసనగా అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. కొన్ని సార్లు ప్రభుత్వం నుంచి తీవ్రమైన నిర్బంధాలు ఎదుర్కొన్నారు. చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చారు. శిక్షలు కూడా అనుభవించారు. ప్రొఫెసర్ సాయిబాబా ను జైల్లో వేయడాన్ని తీవ్రంగా నిరసించారు.నకిలీ ఎన్కౌంటర్లను తీవ్రంగానకిలీ ఎన్కౌంటర్లను తీవ్రంగా నిరసిస్తున్న సమయంలో 1997 ఏప్రిల్ 6న గద్దర్ పై హత్యాయత్నం జరిగింది. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కేవలం విప్లవ గేయాలు మాత్రమే కాకుండా సామాజిక చైతన్యం నిండిన సినిమా పాటలు రావడంలో గద్దర్ చాలా నేర్పరి. వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో గద్దర్ ఎన్నో పాటలు రాశారు.. ఆర్.నారాయణమూర్తి దర్శకత్వంలో రూపొందిన ఒరేయ్ రిక్షా సినిమాలో ” నీ పాదం మీద పుట్టుమచ్చనై” అనే పాటకు రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డుకు ఎంపికయ్యారు. తర్వాత ఆ అవార్డును తిరస్కరించారు. ప్రభుత్వం ఎన్ కౌంటర్ ల ల్లో మావోయిస్టులను చంపి వేస్తుండడం, తనను హత్య చేసేందుకు యత్నించిన వారి పట్ల చర్యలు తీసుకోకపోవడంతో దానికి నిరసనగా ఆయన ఆ అవార్డు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో గద్దర్ ముక్కుసూటి తనం పట్ల ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గద్దర్ ను హత్య చేసేందుకు యత్నించిన వారిపై కేసులు నమోదు చేసింది.