https://oktelugu.com/

Hyderabad IT : హైదరాబాద్ కు “ఐటీ”ని ప్రభుత్వమే దూరం చేస్తోందా?

పెరుగుతున్న భూముల ధరలు బహుళజాతి కంపెనీలకు కూడా దడ పుట్టిస్తున్నాయి. ఇతర నగరాల్లో ఏటా 10-20 శాతం పెరుగుతుంటే, హైదరాబాద్‌లో ఏకంగా వంద శాతం పెరిగి ఐటీ కంపెనీలకు, ఉద్యోగులకు షాక్‌ ఇచ్చాయి.

Written By:
  • Rocky
  • , Updated On : August 20, 2023 / 08:15 PM IST
    Follow us on

    Hyderabad IT : పెరుగుట అనేది విరుగుట కోసమే అనే సామెత ఉంది. ప్రస్తుతం ఈ సామెత హైదరాబాద్ ఐటీ పరిశ్రమ విషయంలో నిజం కాబోతుందా? పెరిగిన భూముల ధరలు బహుళ జాతి సంస్థలను ఆలోచనలో పడేశాయా? ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న అభివృద్ధి నమూనా ఐటీ కంపెనీలకు ఇబ్బంది కలిగిస్తోందా? ఇలాంటి పరిస్థితి మును ముందు ఉంటే హైదరాబాద్ మహానగరంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఇవన్నీ విషయాలను ప్రభుత్వం ఆలోచించడం లేదు. పైగా తమ పాలనలోనే హైదరాబాద్ విపరీతంగా అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్నది. భూముల ధరలు వందల కోట్లకు పెరిగిన నేపథ్యంలో సొంత మీడియాలో డబ్బా ప్రచారం చేసుకుంటున్నది.

    దేశంలోని ఇతర ఐటీ కారిడార్లతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ప్రస్తుతం భూముల ధరలు అధికంగా ఉన్నాయి. బెంగుళూర్‌ వైట్‌ఫీల్డ్స్‌, ఎలక్ర్టానిక్‌ సిటీ, సర్జాపూర్‌ రోడ్‌లలో ఎకరా రూ.30-40 కోట్లు పలుకుతోంది. ఇప్పటివరకు పలిగిన గరిష్ఠ ధర రూ.60 కోట్లు మాత్ర మే. ముంబాయిలోని పన్వెల్‌-ఐరోలీ ఐటీ కారిడార్‌లో కూడా ఎకరా రూ.25-30 కోట్లు మాత్రమే పలుకుతోంది. నోయిడాలో ఎకరా రూ.45 కోట్లు పలికింది. పూణెలోని హింజెవాడి, ఖరాడీ ప్రాంతాల్లో రూ.18-30 కోట్ల ధర పలికింది. హైదరాబాద్‌ కోకాపేట మాత్రం వంద కోట్ల రికార్డు సెట్‌ చేసింది. ఇక్కడ గతేడాది జూలైలో వేలంలో సగటున ఎకరా రూ.40 కోట్లు పలికింది. తాజా వేలంలో సగటు రూ.73.23 కోట్లకు చేరింది. ఏడాదికాలంలోనే రెట్టింపు కావడం వెనుక రియల్‌ ఎస్టేట్‌ సంస్థల హస్తం ఉందనే ఆరోపణలున్నాయి.

    అనుకూలతను వాడుకోవడం లేదు

    హైదరాబాద్‌కు అన్ని వైపులా అడ్డూ అదుపూ లేకుండా విస్తరించేందుకు అవకాశం ఉంది. చుట్టూ అవుటర్‌ రింగ్‌ రోడ్డు ఉంది. ఆ పైన రీజనల్‌ రింగ్‌ రోడ్డు వస్తోంది. అంటే, అందరికీ ఇళ్లు అందుబాటులోకి తేవాలనే సదుద్దేశం ప్రభుత్వానికి ఉంటే, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో కలిపి ఎక్కడ డిమాండ్‌ అధికంగా ఉంది, ఏ ప్రాంతంలో ఏ అవసరాలున్నాయి అని సామాజిక అధ్యయనం చేసి, ప్రణాళికలు రూపొందిస్తే వచ్చే వందేళ్ల వరకు నగరం అభివృద్ధి చెందుతూ ఉండేలా చూసుకోవచ్చు. కానీ, ఆ ప్రయత్నమే జరగలేదు. దేశంలో ఏ మెట్రో నగరంలో లేని విధంగా ఫ్లోర్‌ స్పెస్‌ ఇండెక్స్‌ పరిమితిని ఎత్తేయడంతో దక్షిణాదిలోనే అత్యధిక ఎతైన భవనాలు హైదరాబాద్‌లో వస్తున్నాయి. డిమాండ్‌ లెక్కలు వేసుకోకుండా ఒకేచోట అన్ని భవనాలు వస్తే అమ్ముడుపోతాయా? అనే సందేహం కూడా నెలకొంది.

    ఐటీ పురోగతికి సవాల్

    హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ ఇటీవలే ఎకరా రూ.వంద కోట్ల మార్క్‌ దాటింది. కోకాపేట నియోపోలిస్‌ వేలంలో దాదాపు అన్ని ప్లాట్లు ఎకరా రూ.75-80 కోట్లకు అమ్ముడు పోయాయి. ఈ ప్రాంతంలోనే ఒకేసారి భూముల ధరలు డబులై పోయాయి. ఈ వార్త ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు… దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ, ప్రపంచవ్యాప్తంగా భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లలోనూ కొద్ది వారాలుగా హాట్‌ టాపిక్‌గా మారింది. రాష్ట్ర అధికార పక్షం బీఆర్‌ఎస్‌ కూడా నగరాభివృద్ధికి, భవిష్యత్తుకు దీన్ని ఒక ఇండికేటర్‌గా ప్రకటిస్తూ ఘనంగా చాటుకుంటోంది. ఇప్పుడు దేశంలోని ఐటీ కారిడార్లలోనే రియల్‌ ఎస్టేట్‌ పరంగా హైదరాబాద్‌ ఖరీదైన నగరంగా మారింది. అయితే, ఈ రికార్డు ధరలే ఇప్పుడు నగరానికి అత్యంత కీలకమైన ఐటీ రంగం పురోగతికి సవాలు విసురుతున్నాయి.
    ఇటీవలే ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే అగ్రస్థానం సంపాదించుకున్న హైదరాబాద్‌ నగరం దాన్ని నిలబెట్టుకోవాలంటే దశాబ్దాలుగా ఇక్కడ నెలకొన్న ఐటీ అనుకూల వాతావరణం కొనసాగాలి. 1990ల్లో హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు వచ్చినపుడు వాటిని ఆకర్షించిన ప్రధాన అంశం మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి, కారుచౌకగా ఇచ్చిన భూములు. ఆ తర్వాత నగరం వేగంగా విస్తరించినా ఇక్కడ భూముల ధరలు ఇటీవలి వరకు దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే చౌకగానే ఉన్నాయి. కానీ, తాజా పరిస్థితుల్లో పెరుగుతున్న భూముల ధరలు బహుళజాతి కంపెనీలకు కూడా దడ పుట్టిస్తున్నాయి. ఇతర నగరాల్లో ఏటా 10-20 శాతం పెరుగుతుంటే, హైదరాబాద్‌లో ఏకంగా వంద శాతం పెరిగి ఐటీ కంపెనీలకు, ఉద్యోగులకు షాక్‌ ఇచ్చాయి.