TDP Janasena Alliance: టిడిపి, జనసేన దూకుడు పెంచాయి. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా.. పొత్తులో అధిగమించాలని భావిస్తున్నాయి. దాదాపు 100 సీట్ల వరకు ఆ రెండు పార్టీల మధ్య ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే తొలి జాబితా ప్రకటించాలని చంద్రబాబు, పవన్ డిసైడ్ అయ్యారు. పౌర్ణమి కావడంతో ఈరోజు 11.40 గంటలకు జాబితా విడుదలకు ముహూర్తంగా నిర్ణయించారు.ఇబ్బందులు లేని సీట్లలో మాత్రమే ప్రకటించనున్నారు. ఈ విషయమై బిజెపి నాయకత్వానికి కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
జగన్ దూకుడుగా ఉన్నారు.రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చారు. ఇప్పటివరకు 70 మంది సిటింగ్లను మార్చారు. ఈ నేపథ్యంలో టిడిపి, జనసేన పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడంతో మొదటి జాబితా విడుదల చేయడం మేలని చంద్రబాబుతో పాటు పవన్ నిర్ణయించుకున్నారు. ఎటువంటి వివాదాలు లేని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాలని భావించారు. విషయాన్ని బిజెపి నేతలకు చెప్పడంతో వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
రెండు పార్టీల కీలక నాయకుల నియోజకవర్గాలు ఈరోజు వెల్లడి కానున్నాయి. కుప్పం నుంచి చంద్రబాబు, భీమవరం నుంచి పవన్, మంగళగిరి నుంచి లోకేష్, టెక్కలి నుంచి అచ్చెనాయుడు, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, హిందూపురం నుంచి బాలకృష్ణ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. వీరి పేర్లు మొదటి జాబితాలో వెల్లడించనున్నారు. మొత్తం ఈ జాబితాలో 65 మంది వరకు అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది. టిడిపి 50 నుంచి 52, జనసేన నుంచి 15 మంది అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటన కోసం శుక్రవారం సాయంత్రం చంద్రబాబు ఉండవెల్లి చేరుకున్నారు. అందుబాటులో ఉన్న టిడిపి సీనియర్లు కూడా రావాలని పిలుపు వెళ్ళింది. అటు పవన్ సైతం ఉండవల్లిలో తన నివాసానికి చేరుకున్నారు. అటు బిజెపితో సీట్ల సర్దుబాటు ప్రక్రియ కుదరడంతోనే ఈ జాబితాను ప్రకటించడానికి సిద్ధపడినట్లు సమాచారం.
సీఎం జగన్ సిద్ధం సభలతో భారీ జన సమీకరణకు తెరతీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో సిద్ధం సభలు పూర్తయ్యాయి. లక్షలాది మంది జనం తరలివచ్చినట్లు వైసిపి ప్రచారం చేసుకుంటుంది. ఈ తరుణంలో ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలని టిడిపి, జనసేన భావిస్తోంది. అంతకంటే ముందే అభ్యర్థులను ప్రకటిస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చారు. అటు మాఘ పౌర్ణమి కావడంతో ముహూర్త బలం బాగుండడం, మరో రెండు వారాల వరకు ముహూర్తాలు లేకపోవడంతో తొలి జాబితా విడుదలకు రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తొలి జాబితా విడుదల నేపథ్యంలో ఆశల పల్లకిలో ఉన్న నేతల భవితవ్యం తేలనుంది.