Telangana Cabinet Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ముందుగా సీఎంగా సెక్రటేరియట్‌లో బాధ్యతలను రేవంత్‌రెడ్డి స్వీకరించారు. సీఎంగా సచివాలయంలోకి అడుగుపెట్టిన ఆయన ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సచివాలయం లోపల రేవంత్‌కు వేదపండితులు స్వాగతం పలికారు.
ఆయన రాజీనామాను ఆమోదించొద్దు..
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి తొలిరోజే దూకుడు పెంచారు. కేబినెట్ భేటీ నిర్వహించి కీలక అంశాలపై చర్చించారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటుగా ప్రధానంగా విద్యుత్ అంశంపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పనితీరు చర్చ జరిగింది.. విద్యుత్ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఆ శాఖలో వాస్తవాలను వెల్లడించకుండా చాలాకాలంగా దాచిపెట్టడాన్ని తప్పుపడుతూ.. ఆ శాఖ ఉన్నతాధికారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రివ్యూకు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావును కూడా రప్పించాలన్నారు. ఆయన రాజీనామాను కూడా ఆమోదించొద్దని సీఎం ఆదేశించారు.
రూ.85 వేల కోట్ల అప్పు..
విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం రేవంత్ అభిప్రాయపడినట్లు సమాచారం. విద్యుత్ సంస్థలకు ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పులున్నట్లు సీఎంకు అధికారులు చెప్పారని తెలుస్తోంది. 2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అన్ని శాఖల వివరాలపై చర్చ జరిగిందని శ్రీధర్‌బాబు తెలిపారు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు అన్ని శాఖల నుంచి నిధుల ఖర్చు పై శ్వేత పత్రం విడుదల చేయాలని అధికారులకు కోరామన్నారు. విద్యుత్‌కు అంతరాయం కలుగకుండా ప్రజలకు నిరంతాయంగా విద్యుత్ అందించాలని కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కు కేబినెట్ ఆమోదించందని.. 9వ తేదీన కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.