Top Telangana bureaucrat’s daughter’s wedding: ఒకప్పుడు ఎన్నికల కమిషనర్ గా ఉన్న ఆయన ఇటీవలే తెలంగాణ పరిపాలనలోని ప్రభుత్వ డ్రీమ్ శాఖ స్పెషల్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పర్యవేక్షణలోనే ఎన్నో ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బడా కంపెనీలు ఈ వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేస్తున్నాయి. తాజాగా సదురు ఐఏఎస్ కూతురు పెళ్లి జరిగితే ఆయన ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం ఖర్చంతా కాంట్రాక్టు పట్టిన కంపెనీలే భరించాయని ‘ది న్యూస్ మినిట్’ అనే వెబ్ సైట్ తాజాగా సంచలన కథనాలను ప్రచురించింది.ఇవిప్పుడు తెలంగాణ అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయట.. ఇదే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇటీవలే ఈ సీనియర్ బ్యూరోక్రాట్ కూతురు పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని పలు స్టార్ హోటళ్లలో ఐదురోజుల పాటు పెళ్లికి సంబంధించిన సంగీత్ సహా వివిధ సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో పెళ్లి ఘనంగా జరిగింది. అయితే ఈ పెళ్లి ఖర్చులన్నీ ఒక్క రూపాయి కూడా సదురు సీనియర్ ఐఏఎస్ పెట్టుకోలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.. తెలంగాణలో ఓ బడా కన్ స్ట్రక్షన్ కంపెనీ కి చెందిన వ్యక్తులు ఈ పెళ్లి ఏర్పాట్లు చేశారని సమాచారం. ఈ మేరకు ఓ అనామక కంపెనీ పేరు మీద ఒక్క చెక్ ద్వారా రూ.23 లక్షలు చెల్లించారని ‘ది న్యూస్ మినిట్’ అనే వెబ్ సైట్ పేర్కొంది.
ఈ వివరాలన్నీ స్పష్టంగా ఆధారాలతో సహా సదురు వెబ్ సైట్ బయటపెట్టడంతో సదురు ఐఏఎస్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. ఆ అధికారిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే తన కూతురు పెళ్లికి ఆ కంపెనీ ఎలాంటి ఖర్చులు పెట్టుకోలేదని సదురు ఐఏఎస్ వాదిస్తున్నారు. అలాగే ఆ బడా కంపెనీ కూడా స్పందించింది. ఐఏఎస్ కూతురు పెళ్లికి ఏర్పాట్లు చేసింది తమ ఉద్యోగులు అని.. కానీ వారు వ్యక్తిగతంగా చేసి ఉంటారని.. దాంతో కంపెనీకి సంబంధం లేదని ప్రకటనలో తెలిపింది.

అయితే నెల జీతానికి పనిచేసే ఆ కంపెనీ ఉద్యోగులు ఏకంగా పెళ్లి ఖర్చు రూ.23 లక్షలు భరించారంటే నమ్మశక్యంగా లేదు సుమా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపితే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడీ ఐఏఎస్ వ్యవహారం తెలంగాణ అధికార వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారితీసింది.
