Congress: వియ్యానికైనా.. కయ్యానికైనా సమ ఉజ్జీలు ఉండాలి అంటారు పెద్దలు.. తెలంగాణ రాజకీయాల్లో ఇక్కడ వియ్యం సంగతి పక్కన పెడితే కయ్యం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు మొన్నటి వరకు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేసిన వ్యాఖ్యలే నిరద్శనం. ‘‘ఇక ఆటమొదలైంది.. హామీలు అమలు చేసే వరకూ ప్రభుత్వాన్ని విడిచిపెట్టం’’ అని కేటీఆర్ అన్నారు. కేటీఆర వ్యాఖ్యలకు అధికార కాంగ్రెస్ కూడా దీటుగా సమాధానం ఇస్తోంది. వారం కూడా కాకుండానే రెండు గ్యారంటీలను అమలు చేశాం. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని పేర్కొంటున్నారు.
బలమైన ప్రతిపక్షం..
తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్)కు గట్టి ప్రతిపక్షం ఉండేది కాదు. మొదట 63 సీట్లతోనే అధికారంలోకి వచ్చినా.. తర్వాత కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ గూటికి చేరారు. దీంతో ప్రతిపక్ష బలం తగ్గిపోయింది. అధికార పక్షాన్ని ప్రశ్నించే.. తప్పులను ఎత్తిచూపే నాయకులు లేకుండా పోయారు. ఇక 2018లో కూడా ఇదే పరిస్థితి 88 సీట్లు గెలిచిన బీఆర్‌ఎస్.. బలమైన ప్రతిపక్షం ఉండకూడదని.. కాంగ్రెస్‌కు చెందిన 12 మందిని లాక్కుంది. దీంతో విపక్షం మళ్లీ బలహీనపడింది. ఈసారి కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగా తమను ప్రశ్నించేవారు లేకుండా చేసుకున్నారు. కానీ, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన ప్రతిపక్షం నుంచి సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీనే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కావడం కూడా అధికార పార్టీని ఇరుకున పెట్టే అవకాశాలు ఉన్నాయి.
తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్న సర్కార్..
ఇక కాంగ్రెస్ సర్కార్ ఊడా విపక్షం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీలో, అసెంబ్లీ బయట వచ్చే ఆరోపణలు, విమర్శలను దీటుగా తిప్పికొట్టేందకు సీఎం రేవంత్ వ్యూమాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నరు. తొమ్మిదిన్నరేళ్ల వైఫల్యాలను ప్రజల ముందు పెట్టేందకు శ్వేతపత్రాల విడుదలకు సమాయత్తం అవుతున్నారు. తద్వారా ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టవచ్చని భావిస్తున్నారు.
అధికాపక్షం 65, విపక్షం 54..
ఇక అసెంబ్లీలో బలా బలాల పరంగా చూస్తే.. అధికార కాంగ్రెస్‌కు 64, మిత్రపక్షం సీపీఐకి ఒక ఎమ్మెల్యే కలుపుకుని 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక విపక్ష బీఆర్‌ఎస్‌కు 39, బీజేపీకి 8, ఎంఐఎంకు 7 గురు ఎమ్మెల్యేలు మొత్తం 54 మంది ఉన్నారు. అంటే అధికార, విపక్షాలు దాదాపు సమాన బలం కలిగి ఉన్నాయి. ఇకపోతే అధికార పక్షంలో కన్నా.. విపక్షంలోనే ప్రశ్నించే.. దీటుగా మాట్లాడే నేతలు ఉన్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార బీఆర్‌ఎస వారి గొంతు నొక్కడం, ఇతర ఇబ్బందులు పెట్టడంతో పెద్దగా ప్రశ్నించలేదు. ఈసారి విపక్షాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్దమవుతోంది.
మొత్తంగా చూస్తే కేటీఆర్ చెప్పినట్లు.. ఆట మొదలైనట్లే కనిపిస్తోంది. ముందు ముందు రాజకీయం రంజుగా మారడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.