Titanic Tourist : అట్లాంటిక్ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులోని టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ అదృశ్యమైన ఐదుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. వీరి జాడ కోసం ఐదు రోజులుగా తీవ్రంగా వెతికినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఐదుగురు పర్యాటకులతో ఆదివారం న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి బయలుదేరిన మినీ జలాంతర్గామి టైటాన్ అకస్మాత్తుగా అదృశ్యం కావడం, వీరి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఐదుగురు పర్వాటకులు ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించడంతో వీరు ఎవరన్న దానిపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సాహసానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు, ఎందుకు అంత సాహసం చేశారు వంటి వివరాలు మీకోసం.
అట్లాంటిక్ మహా సముద్రంలో కొన్నాళ్ల కిందట ప్రమాదవశాత్తు కూలిపోయిన టైటానిక్ శకలాలను చూసేందుకు మినీ జలాంతర్గామిని టైటాన్ లో వెళ్లిన ఐదుగురు దుర్మరణం చెందారు. నాలుగు రోజులపాటు వీరిని గుర్తించేందుకు చేపట్టిన గాలింపు చర్యలు ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వీరు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ సాహస ప్రయాణాన్ని చేసిన వారి గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది.
పర్యటనకు వెళ్లిన ప్రయాణీకులు వీళ్ళే..
ఈ పర్యటనకు వెళ్లిన వారిలో పాకిస్థాన్ కు చెందిన బిలియనీర్ షాజాద్ దావూద్ (48), ఆయన కుమారుడు సులేమాన్ (19), యూఏఈ లో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఈ యాత్ర నిర్వాహకుడు, ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ మాజీ నావిక దళ అధికారి పాల్ హెన్రీ ఉన్నారు. ప్రత్యేక జలాంతర్గామిలో టైటానిక్ శకలాలు చూసేందుకు వీరు వెళ్లారు.
అపర కుబేరులే కాదు అత్యంత సాహసవంతులు కూడా..
ఈ పర్యటనకు వెళ్లిన వాళ్లంతా అత్యంత ధనవంతులు. అంతేకాకుండా అంతకు మించిన గుండె ధైర్యవంతులు కూడా. ఈ ఐదుగురు గతంలో సాహస యాత్రలు చేసిన అనుభవం కలిగిన వారే కావడం గమనార్హం. ఐదుగురితో యాత్ర నిర్వహించిన ఓషన్ గేట్ సహ వ్యవస్థాపకులు, సబ్ మెరైన్ ట్రైనింగ్ పైలెట్ స్టాక్టన్ రష్ గతంలో కూడా టైటానిక్ శకలాలను చూసి వచ్చారు. రష్ నిపుణుడి హోదాలో ఈ యాత్రకు వెళ్లారు. ఆయన భార్య వెండి రష్ పూర్వీకులు 1912లో జరిగిన టైటానిక్ ప్రమాదంలో మృతి చెందారు. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో రష్ మరణించారు. ఈ విధంగా జరగడం విధి రాత గా పలువురు పేర్కొంటున్నారు. ఇకపోతే ఇదే ప్రమాదంలో మృతి చెందిన మరో వ్యక్తి పాల్ హెన్రీకి నౌకాదళంలో కమాండర్ గా పని చేసిన అనుభవం ఉంది. ఫ్రెంచ్ సబ్ మెరైన్ పైలెట్ గా కూడా ఈయన పని చేశారు. నావికుడిగా పాతికేళ్ళ అనుభవం ఉన్న హెన్రీ అత్యంత లోతైన ప్రదేశాల్లో పనిచేసే టీమ్లకు కెప్టెన్ గా కూడా వ్యవహరించారు. అలాగే బ్రిటన్ కు చెందిన 58 ఏళ్ల హమీస్ హార్డింగ్ కూడా ఈ ప్రమాద ఘటనలో మృతి చెందాడు. ఇతను బిలియనీర్. దుబాయ్ కు చెందిన యాక్షన్ ఏవివేషన్ కంపెనీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈయన బ్లూ ఆరిజన్ వ్యూమనౌకలో అంతరిక్షంలోకి కూడా వెళ్లి వచ్చారు. అనేకసార్లు దక్షిణ ధ్రువాన్ని కూడా సందర్శించారు. ప్రపంచంలోనే అత్యంత లోతైన మారియానా త్రెంట్ లో ఎక్కువసేపు గడిపిన ఈయన.. తన పేరిట మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులను కూడా నమోదు చేసుకున్నాడు. అలాగే, ఈ ప్రమాదంలో మృతి చెందిన పాకిస్థాన్ కు చెందిన తండ్రి కొడుకులు షాజాద్ దావూద్, సులేమాన్ కూడా ఉన్నారు. పాకిస్తాన్ లోని అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్ కు షాజాద్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ లోని అత్యంత ధనవంతులు జాబితాలో షాజాద్ తండ్రి హుస్సేన్ దావూద్ పేరు ప్రతిసారి ఉంటుంది. ఈ ఐదుగురు అత్యంత ధనవంతులే కాదు అంతకుమించిన అత్యంత గుండె ధైర్యం కలిగిన వాళ్లు. కాబట్టి అత్యంత ప్రమాదకరమైన సాహస యాత్రకు వెళ్లి ప్రాణాలను కోల్పోయారు.