Chandrababu: ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రం. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ ఐదు సంవత్సరాల్లో పార్టీ బలం పెంచుకుందంటే.. లేదనే సమాధానం వినిపిస్తోంది. కనీసం షర్మిల ఎంట్రీ తో కాంగ్రెస్ పార్టీ స్వరూపం మారింది. కచ్చితంగా ఎన్నికల్లో ఓటు శాతం పెంచుకుంటుంది. కానీ బిజెపి ఆ స్థాయిలో ఉందా? ఓట్లు పెంచుకుందా? మరి అటువంటి పార్టీతో పొత్తు కోసం చంద్రబాబు ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే బలమైన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీని ఢీకొట్టాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. చంద్రబాబు వెంపర్లాడడానికి అదే ప్రధాన కారణం. ఎలాగైనా టిడిపి, జనసేన కూటమిలోకి బిజెపిని రప్పించాలని చంద్రబాబు ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లి నేరుగా తేల్చుకోనున్నారు.
జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత ఉంది. అయినా సరే సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారుల్లో సానుకూల దృక్పథం ఉంది. అదే సమయంలో ప్రభుత్వ బాధిత వర్గాలు కూడా ఉన్నాయి. అభివృద్ధి లేదన్న అపవాదు ఉంది. ఇవన్నీ ఓటింగ్ రూపంలో మారాలంటే వ్యవస్థల సాయం అవసరం. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరిస్తేనే ఏపీలో నెగ్గుకు రాగలమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే బిజెపి కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అసలు బలమే లేని బిజెపి కోసం చంద్రబాబు బలమైన ప్రయత్నాల వెనుక ఎన్నికల నిర్వహణే అసలు కారణం. బిజెపి కూటమిలోకి రాకున్నా పర్వాలేదు కానీ… కనీసం వైసిపికి సహకారం అందించకుండా న్యూట్రల్ గా ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. అటు పవన్ ఉద్దేశ్యం కూడా అదే.
వాస్తవానికి టిడిపి, జనసేన మధ్య పొత్తు గతంలో వర్కౌట్ అయ్యింది. రెండు పార్టీలు కలిసినప్పుడు మంచి ఫలితాలే నమోదయ్యాయి. 2019 ఎన్నికల్లో భవిష్యత్తు అంచనా వేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని దారుణంగా దెబ్బతిన్నారు. అందుకే చంద్రబాబుకు జ్ఞానోదయం అయ్యింది. ఉంటే బీజేపీతో పొత్తు.. లేకుంటే ఆ పార్టీకి న్యూట్రల్ గా ఉంచేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారు. చంద్రబాబు గత ఎన్నికల్లో చేసిన తప్పు మూలంగానే బిజెపి ఇప్పుడు నమ్మడం లేదు. ఆ నమ్మకాన్ని నిలబెడతానని చెప్పేందుకే నేరుగా చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం.
వాస్తవానికి ముచ్చటగా మూడోసారి బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అందరూ నమ్ముతున్నారు. కానీ హిందీ బెల్టులో ప్రతికూలత వస్తే ఎలా అధిగమిస్తారు అన్నది ఒక ప్రశ్న. ప్రస్తుతం ఎన్డీఏలో బలమైన పక్షాలు లేవు. ఒకవేళ ప్రతికూల ఫలితాలు వస్తే అండగా నిలిచే మిత్రులు కూడా లేరు. అందుకే నితీష్ నేతృత్వంలోని జెడిఎస్, అకాళీదళ్ వంటి పార్టీలను బిజెపి చేరదీస్తోంది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును బిజెపి పెద్దలు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు కుదిరితే బిజెపిని కూటమిలోకి తేవడం.. లేకుంటే న్యూట్రల్ గా ఉంచి.. అధికారంలోకి వచ్చిన తర్వాత సహకరిస్తామని ఒప్పందం పెట్టుకోవడం చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు చంద్రబాబు ఢిల్లీ టూర్ అజెండా ఏమిటన్నది రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.