https://oktelugu.com/

Telugu Media : వార్నీ ఇంత పసుపు భక్తా? దెబ్బకు జీ-20 నే కింద పడేశారు!

చంద్రబాబును అరెస్టు చేయడం అనేది తెలుగుజాతికి జగన్ చేసిన ద్రోహమని, అభివృద్ధిపై వేసిన గొడ్డలి వేటు అని ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసుకొచ్చాయి.

Written By:
  • Rocky
  • , Updated On : September 10, 2023 / 03:59 PM IST

    Tdp media

    Follow us on

    Telugu Media : జి_20 ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగే ఈ సమావేశాలకు మన దేశం ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు ప్రస్తుతం మనదేశంలోనే ఉన్నారు. ఢిల్లీ కేంద్రంగా పలు ఆర్థిక అంశాలకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. ఇవన్నీ కూడా మన దేశంతో స్థూలమైన సంబంధం ఉన్నవే. అంటే అక్కడ జరిగే ప్రతి నిర్ణయం కూడా మన జీవితాన్ని ఎంతో కొంత ప్రభావితం చేయగలుగుతుంది. మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా ప్రభావితం చేయగలుగుతుంది. మరి ఇంత పెద్ద వార్తను ఎలా ప్రజెంట్ చేయాలి? అందులో ఉన్న విషయాలను ఎలా ఫోకస్ చేయాలి? ఇది మీడియా బాధ్యతే కదా! ఇది మీడియా పట్టించుకోవాల్సిన విషయమే కదా! బ్యానర్ గా అచ్చు వేయాల్సిన వార్తే కదా! కానీ దాన్ని ఈనాడు, జ్యోతి పట్టించుకోలేదు. అసలు పాత్రికేయ ప్రమాణాలనే గాలికి వదిలేసారు. కేవలం చంద్రబాబు సేవలోనే తరించారు.

    చంద్రబాబును అరెస్టు చేయడం అనేది తెలుగుజాతికి జగన్ చేసిన ద్రోహమని, అభివృద్ధిపై వేసిన గొడ్డలి వేటు అని ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసుకొచ్చాయి. ఒక సాక్షి జగన్ గురించి ప్రచారం చేస్తుంది అంటే..అది పక్కా తన పార్టీ పత్రిక బట్టి అది అలానే రాస్తుంది. ఒక నమస్తే తెలంగాణ కెసిఆర్ గురించి ప్రచారం చేస్తుంది అంటే..అది పక్కా బీఆర్ఎస్ పత్రిక కాబట్టి అది అలానే రాస్తుంది. మరి ఈనాడు, జ్యోతి? మేము పాత్రికేయ ప్రమాణాలు పాటిస్తున్నాం, మేము సుద్ధ పూసలం అని ప్రచారం చేసుకుంటాయి కదా? ప్రజాస్వామ్యం గురించి, నీతి మయమైన రాజకీయాల గురించి విపరీతంగా రాస్తుంటాయి కదా? ఇక్కడ ఏమైంది? అంటే చంద్రబాబు అరెస్టు కాగానే ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయిందా? చంద్రబాబు ఏమైనా చట్టాలకు అతీతుడా? ఒకవేళ చంద్రబాబు తప్పు చేయకుంటే కోర్టులో తన సచ్చీలతను నిరూపించుకోవచ్చు. అంతటి నంబియార్ కూడా ఇస్రోలో తను ఏ తప్పూ చేయలేదని నిరూపించుకున్నాడు.. చంద్రబాబు కూడా అలాంటి పని చేయవచ్చు. “దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి, నన్ను కూడా అరెస్టు చేస్తారేమో” అనే వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అరెస్ట్ అయితే ఈనాడు, జ్యోతి శోకాలు దేనికి?

    ఇవి మాత్రమే కాదు ఆ సాక్షి కూడా అంతే.. నాడు జగన్ అరెస్ట్ అయినప్పుడు ప్రజాస్వామ్యానికి చీకటి దినంగా రాసుకొచ్చింది. జగన్ అరెస్ట్ కేవలం కుట్ర వల్లే జరిగింది అని చెప్పుకొచ్చింది. సాక్షిలో పని చేసే ఉద్యోగులతో ధర్నాలు చేయించింది. మేధావులతో జగన్ పాట పాడించింది. రచయితలతో జగన్ స్తోత్రం చేయించింది. చివరికి సాక్షి అంత గాయి గాయి చేసినప్పటికీ 16 నెలలపాటు జైల్లో ఉన్నాడు. చంచల్ గూడ స్టేషన్లో శిక్ష అనుభవించాడు. అంటే ఇక్కడ స్థూలంగా చెప్పొచ్చేదేంటంటే మీడియా అనేది రాజకీయ పార్టీలకు, రాజకీయ పార్టీలకు అనుసంధానంగా పనిచేసే వ్యక్తులకు కామధేనువుగా మారింది. అందువల్లే మీడియా విశ్వసనీయతను కోల్పోతోంది. ఆ మీడియాలో పనిచేసే వ్యక్తులకు క్రెడిబుల్టి లేకుండా పోతుంది. ఇలాంటి సమయంలోనే సోషల్ మీడియా ఒక ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోంది. అది కూడా వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయినప్పటికీ.. స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని చెప్పే అవకాశం అందులో ఉంది. అంటే సోషల్ మీడియా గొప్పది అని ఇక్కడ అర్థం కాదు. అది కూడా ఓ నానాజాతి సమితే.