Telangana : అది ఉమ్మడి రాష్ట్రం.. తెలంగాణ ప్రాంతం.. ఆకలేస్తే భూమి వైపు.. దాహం వేస్తే ఆకాశం వైపు చూసిన రోజులున్నాయి. ముఖ్యంగా 2001 తర్వాత చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరువు కరాళ నృత్యం చేసి ఎంతో మంది రైతులను పంటలు పండించలేక ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. తాగేందుకు గుక్కెడు నీరు కూడా కరువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ నీటి గోస, రైతుల ఆక్రందనతో ఆత్మహత్యలు పెరిగి దేశమంతా ప్రకంపనలు చెలరేగాయి. బషీర్ బాగ్ లో రైతుల ఆందోళనలో కాల్పులు జరిగి ప్రాణాలు పోయాయి. అంతటి దుర్భిక్ష తెలంగాణ.. రాష్ట్రం ఏర్పడ్డ 9 ఏళ్లలోనే దేశంలోనే నీటి లభ్యతలో నంబర్ 1 స్థానంలో నిలిచిందంటే అందరి కళ్లు కన్నీళ్లతో చెమర్చక మానవు. నాటికి నేటికి ఎంత తేడా అన్నది గుర్తిస్తేనే తెలంగాణ ఉద్యమకారుల గుండె ఉప్పొంగుతుంది.
దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు తమ రిజర్వాయర్లలో నీరు వేగంగా అడుగంటుతుండడంతో నీటి కోసం అల్లాడిపోతుంటే, నీటి లభ్యతలో తెలంగాణ మాత్రం దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. జల వనరుల్లో తగినంత నిల్వలతోపాటు మిగులు జలాలతో టాప్ లో నిలిచింది. నీటి వనరుల అభివృద్ధి, సమర్థవంతమైన నిర్వహణపై తొమ్మిదేళ్లుగా దృష్టి సారించడంతో కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రధాన ప్రాజెక్టులు ఈ సీజన్‌లో చుక్క నీరు రాకపోయినా ఎలాంటి నీటి ఎద్దడి ఎదుర్కొవడం లేదు.
కాళేశ్వరంతో ప్రయోజనం..
వర్షాకాలం ప్రారంభానికి ముందే ఎండిపోతున్న అనేక రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపడంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్
స్కీం కీలక పాత్ర పోషిస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి కృష్ణా నది ప్రాజెక్టుల క్రింద ఉన్న కొన్ని ప్రాంతాలను మినహాయించి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది మంచి వర్షాలే కురిశాయి. అయితే వర్షాల కొనసాగింపు లేకపోవడంతో వాతావరణం డ్రైగా అనిపిస్తుంది. అయినా కూడా పడిన వానలతోనే అటు కృష్ణా బేసిన్ లోనూ ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. ఇటు గోదావరి డెల్టాకు ఈసారి ఓవర్ ఫ్లో వచ్చింది.
సీడబ్ల్యూసీ నివేదిక ఇలా..
సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) రిజర్వాయర్ డేటాను ప్రచురించే 21 రాష్ట్రాలలో, ఐదు రాష్ట్రాలు మినహా మిగిలినవి లోటు జలాలతో ఉన్నాయి. సమృద్ధిగా నీరు ఉన్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ 68.3 శాతం మిగులుతో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్, ఉత్తరాఖండ్ వరుసగా 14.6 శాతం 12.1 శాతం స్వల్ప మిగులును నమోదు చేశాయి. హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలు 6 శాతం, 2.7 శాతం మిగులు జలాలు కలిగి ఉన్నాయి.
లోటులో బీహార్ ఫస్ట్..
ఇక లోటు జలాలు ఉన్న రాష్ట్రాల జాబితాలో బీహార్ –77.1%తో అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వరుసగా –57.4 శాతం, –44.3 శాతంతో ఉన్నాయి. సెప్టెంబర్ 14 నాటికి 10 సంవత్సరాల సాధారణ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ స్థాయిలు –44 శాతం తగ్గాయి. దాదాపు అన్ని ముఖ్యమైన రాష్ట్రాలు పొడి రుతుపవనాలతో వర్షపాతం లేక నీటి ఎద్దడి కారణంగా ఖరీఫ్ పంటలతోపాటు రబీపై కూడా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ నీటిలభ్యతకు ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈసారి గోదావరి బేసిన్ లో వరద పోటెత్తింది. సంవృద్ధిగా వానలు కురిశాయి. దీంతో అక్కడి నుంచి హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం వరకూ నీటిని ఎత్తిపోశారు. ఒక ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టులు తప్ప మిగతా తెలంగాణ అంతటా కాళేశ్వరం నీటిని పంప్ చేశారు. ప్రాజెక్టులు నింపారు. ఈ కారణంగానే తెలంగాణలో నీటిలభ్యత పెరిగింది. తద్వారా పంటలు పండాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా పూర్తి కావడంతో దక్షిణ తెలంగాణకు నీటి తిప్పలు తప్పనున్నాయి. అందుకే దేశంలోనే 68.3 శాతం నీటిలభ్యతతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి చేరింది.