Telangana Paddy : ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ టాప్ ? ఇందులో ఎంత నిజం?

మొత్తంలో వినియోగించే బియ్యం 11 నుంచి 17 శాతం వరకు తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నాయి అంటే మామూలు విషయం కాదు.

Written By: K.R, Updated On : October 13, 2023 12:02 pm
Follow us on

Telangana Paddy : ధాన్యం.. దేశంలో మెజార్టీ ప్రజలకు ప్రధాన ఆహార పంట ఇదే. ఈ క్రమంలో దేశంలో కొన్ని రాష్ట్రాలు ధాన్యాన్ని ప్రధాన ఆహార పంటగా సాగుచేస్తున్నాయి. ఈ జాబితాలో ఉత్తర ప్రదేశ్, బెంగాల్, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ముందు వరుసలో ఉండేవి. అయితే ఈ రాష్ట్రాల్లో నీటి వనరులు విరివిగా ఉన్న నేపథ్యంలో వరి విస్తారంగా సాగయ్యేది. అయితే ఈ రాష్ట్రాల సరసన ఇప్పుడు తెలంగాణ కూడా చేరింది. తెలంగాణ ఏర్పడిన ఈ పది సంవత్సరాలలో వరి సాగు విషయంలో గత రికార్డులను తుడిచి పెట్టేస్తోంది. ధాన్యం, బియ్యం ఉత్పత్తికి తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్ గా మారింది. దేశం యావత్ ధాన్యం, బియ్యం కోసం పంజాబ్ తర్వాత తెలంగాణ పైనే ఆధారపడుతోంది. ఈ విషయాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్ సీ ఐ) వెల్లడించింది. 2022_23 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా కేంద్రం కొనుగోలు చేసిన బియ్యం, ధాన్యంలో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. తెలంగాణ నుంచి 2 సీజన్లలో కలిపి 131.86 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన భారత ఆహార సంస్థ.. 88.35 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించింది. దేశం మొత్తం మీద పంజాబ్ తర్వాత ఇదే అత్యధికం.

వాస్తవానికి దాన్యం ఉత్పత్తిలో నిరుడు తెలంగాణ రాష్ట్రం పంజాబ్ రాష్ట్రాన్ని దాటేసింది. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని అక్కడి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. తెలంగాణలో సుమారు 40% ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులు, పిల్లలు కొనుగోలు చేస్తుంటారు. వీటికి తోడు రైతులు తమ ఆహార అవసరాల కోసం కొంతమేర ధాన్యం నిల్వ ఉంచుకుంటారు. ఈ నేపథ్యంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచినప్పటికీ.. కొనుగోలు విషయంలో మాత్రం రెండవ స్థానంలో నిలిచింది. అది తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి సాగు నమోదయింది. వాన కాలంలో 64.5 లక్షల ఎకరాల్లో, యాసంగిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. మొత్తంగా 2022 _23లో 1.21 కోట్ల ఎకరాలలో వరి సాగయింది. ఈ లెక్కన తెలంగాణలో సుమారు మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. పంజాబ్ రాష్ట్రంలో ఇది సుమారు రెండు కోట్ల టన్నులకు పరిమితమైనట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో సన్న రకాలకు చెందిన ధాన్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నది. జైశ్రీరామ్ అనే రకానికి చెందిన ధాన్యం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పండుతోంది. ఈ ధాన్యానికి బయట మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రైతులు లాభాలు కళ్ళ జూస్తున్నారు. ప్రస్తుత బహిరంగ మార్కెట్ ప్రకారం ఈ బియ్యం క్వింటా నాలుగు నుంచి ఐదువేలు పలుకుతోంది. ఇక సోనామసూరి, జగిత్యాల సన్నాలు, కేఎన్ఎం 118 వంటి రకాలకు కూడా మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది.. మొత్తానికి ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు విస్తారంగా పెరిగింది. అనుకూలంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు విస్తారంగా వరి సాగు చేస్తున్నారు. మరో వైపు ఇతర పంటలు కూడా దిగుబడి సరిగ్గా ఇవ్వకపోవడంతో రైతులు వరి పంట వైపు మొగ్గుతున్నారు.

గతంలో వ్యవసాయానికి 8 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యేది. ప్రస్తుతం వ్యవసాయానికి 24 గంటల పాటు కరెంటు ఇస్తుండడంతో రైతులు కూడా వరి సాగు వైపు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. పంజాబ్ తర్వాత అత్యధిక విస్తీర్ణంలో వరి సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. కేవలం లావు రకాలు మాత్రమే కాకుండా సన్న రకాలను కూడా రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. దీనివల్ల గణనీయంగా లాభాలను ఆర్జిస్తున్నారు. మనదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా తెలంగాణలో ఉత్పత్తి అయిన బియ్యం ఎగుమతి అవుతున్నాయి. సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ వంటి ప్రాంతాలు బియ్యం వ్యాపారానికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెలువరించిన నివేదిక ప్రకారం దేశం మొత్తంలో వినియోగించే బియ్యం 11 నుంచి 17 శాతం వరకు తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నాయి అంటే మామూలు విషయం కాదు.