CM Revanth Reddy: రేవంత్ రెడ్డి బిగ్ ఆఫర్.. ఆంధ్రజ్యోతిలో తర్జనభర్జన

కొన్ని రోజులుగా ఈ వార్త మీడియా సర్కిళ్ళల్లో చక్కర్లు కొడుతోంది.. అయితే ఇంతవరకు దీనికి సంబంధించి అడుగు ముందుకు పడలేదు. శ్రీనివాస్ కు ఆ పదవి గనుక ఇస్తే.. జ్యోతిలో ఆయన స్థానం రాధాకృష్ణ ఎవరికి ఇస్తారు అనే విషయంపై అనేక చర్చలు జరుగుతున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : January 3, 2024 11:01 am

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: తనకు గిట్టని కెసిఆర్ అధికారాన్ని కోల్పోయాడు. కాలు జారి కిందపడి ప్రస్తుతానికైతే మంచానికే పరిమితం అయ్యాడు. తనకు ఎంతో ఇష్టమైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రస్తుతానికైతే తను చెప్పినట్టు నడుచుకుంటున్నాడు.. ఇంకా తన పత్రికకు జాకెట్ యాడ్స్ ఇస్తున్నాడు. సలహాలు, సూచనల కోసం తనని సంప్రదిస్తున్నాడు. ఇంకా రేవంత్ రెడ్డి నుంచి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చాలానే కోరుకుంటున్నాడు. సరే ఇప్పుడప్పుడే అవి బయటపడవు కానీ.. కానీ ఈ జాబితాలో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్న వార్త ఏదైనా ఉందంటే అది ఆయన పత్రికలో ఎడిటర్ గా పనిచేస్తున్న కే శ్రీనివాస్ కు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి కట్టబెడుతున్నారని..

కొన్ని రోజులుగా ఈ వార్త మీడియా సర్కిళ్ళల్లో చక్కర్లు కొడుతోంది.. అయితే ఇంతవరకు దీనికి సంబంధించి అడుగు ముందుకు పడలేదు. శ్రీనివాస్ కు ఆ పదవి గనుక ఇస్తే.. జ్యోతిలో ఆయన స్థానం రాధాకృష్ణ ఎవరికి ఇస్తారు అనే విషయంపై అనేక చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి సెంట్రల్ డెస్క్ ఇన్చార్జిగా ఈనాడు నుంచి వచ్చిన రాహుల్ కొనసాగుతున్నారు. గతంలో వక్కలంక రమణ కొనసాగే వారు. ఆయన ప్రస్తుతానికి క్వాలిటీ సెల్ చూస్తూనే.. సెంట్రల్ డెస్క్ ను కూడా పర్యవేక్షిస్తున్నారు.. ఇక ఈనాడు నుంచి వచ్చిన దత్తిరామ్ ఖాత్రి కూడా సెంట్రల్ డెస్క్ ను పర్యవేక్షిస్తున్నారు.. ఇందులో రాహుల్ లేదా రమణవైపు రాధాకృష్ణ మొగ్గు చూపించ వచ్చనే చర్చ జరుగుతోంది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో వక్క లంక రమణ రాసిన ఎడిటోరియల్ వ్యాసాలు వివాదాస్పదమయ్యాయి. అప్పట్లో ఆయనకు, అల్లం నారాయణ కు వివాదం చెలరేగింది. ఇద్దరు సుప్రసిద్ధ జర్నలిస్టులు ప్రాంతీయ వాదంతో వివాదాలను రాజేయ్యడం అప్పట్లో చర్చనీయాంశమైంది. మరోవైపు రమణ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం తో.. అతనికంటే రాహుల్ వైపే రాధాకృష్ణ మొగ్గు చూపించే అవకాశం కొట్టి పారేయలేనిదని జర్నలిస్టు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎలాగూ ఈనాడులో సెంట్రల్ డెస్క్ ఇన్చార్జిగా పని చేశారు కాబట్టి.. ఆ అనుభవాన్ని తన పత్రికకు ఖచ్చితంగా రాధాకృష్ణ ఉపయోగించుకుంటాడని చర్చ నడుస్తోంది. మరోవైపు దత్తిరామ్ విషయంలోనూ రాధాకృష్ణ సుముఖంగానే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే రాహుల్, దత్తిరామ్ కంటే ముందు నుంచి రమణ ఉన్నాడు కాబట్టి.. అతడికి ఎడిటర్ పదవి ఇస్తే.. రాహుల్, దత్తిరామ్ లలో ఒకరిని సెంట్రల్ డెస్క్ ఇన్చార్జిగా, మరొకరిని క్వాలిటీ సెల్ ఇంచార్జిగా నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అయితే ఇన్ని ప్రచారాలు జరుగుతున్నప్పటికీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా వెళ్లడానికి శ్రీనివాస్ అంత సుముఖంగా ఉన్నారా? అంటే దానికి ఔను అని కానీ, కాదు అని కానీ సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే శ్రీనివాస్ ప్రశంస కంటే విమర్శనే ఎక్కువగా ఇష్టపడతారు.. ప్రశ్నించడాన్నే తనకు ఇష్టమని భావిస్తారు. ఆయన రాసే వ్యాసాల్లో కూడా అదే విషయం ప్రతిబింబిస్తుంది. అలాంటి వ్యక్తి ప్రభుత్వానికి అనుకూలంగా ఎలా ఉంటాడు? ప్రభుత్వం ఒకవేళ ప్రజావ్యతిరేక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎలా సమర్థిస్తాడు? ఇన్ని రోజులపాటు ప్రశ్నించే గొంతుకగా ఉన్న అతడు.. ఒక్కసారిగా ప్రభుత్వం వైపు ఎలా మరలిపోతాడు? అంటే ఈ ప్రశ్నలకు శ్రీనివాస్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాధానం రాలేదు. ఒకవేళ రాధాకృష్ణ ఒత్తిడి తీసుకొస్తే ఆయన ఆ పదవి చేపడతాడా? లేక ఆంధ్రజ్యోతి నుంచే తప్పుకుంటాడా? ఏమో వీటికి ఎవరు సమాధానం చెబుతారో? ఒకటి మాత్రం స్పష్టం.. నిప్పులేనిదే పొగ రాదు.. ప్రెస్ అకాడమీ చైర్మన్ రేసులో శ్రీనివాస్ పేరు బయటికి వచ్చింది అంటే.. ఆంధ్రజ్యోతిలో తర్జన భర్జన జరుగుతున్నట్టే కదా..