Telangana Politics : చెరువులో నిండా నీళ్లు ఉన్నప్పుడే కప్పలు మెండుగా ఉంటాయి. బెకబెకమంటూ అరుస్తూ చెరువుకు కొత్త సందడి తీసుకొస్తాయి. అదే చెరువులో నీళ్లు లేకుంటే తలో దారి చూసుకుంటాయి. రాజకీయాలు కూడా చెరువులో నీళ్ల లాంటివే. అధికారం ఉన్నప్పుడు ఎక్కడెక్కడ నుంచో నాయకులు వస్తూ ఉంటారు. కండువా కప్పుకొని నినాదాలు చేస్తూ ఉంటారు. పదవులు ఇస్తే భజనలు చేస్తారు. అదే అధికారం పోతే ఎవరి దారి వారు చూసుకుంటారు.. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే భారత రాష్ట్ర సమితి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి చవిచూస్తోంది.. మొన్నటిదాకా హైదరాబాద్ తెలంగాణ భవన్, ఢిల్లీ, నాందేడ్ లోని పార్టీ కార్యాలయాల్లో నిండుగా నాయకులు, మెండుగా కార్యకర్తలతో కిటకిటలాడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు..
ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది
తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు టిడిపి ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంది. కాంగ్రెస్ వాళ్లను చేర్చుకుంది.. 2018 ఎన్నికల్లోనూ భారీ మెజారిటీ వచ్చినప్పటికీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తెలంగాణ రాష్ట్ర సమితి తనలో చేర్చుకుంది. 2023 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత.. ఒక్కొక్కరుగా పార్టీని విడిపోతున్నారు. బయటికి చెప్పడం లేదు గానీ పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసేందుకు కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ముందుకు రావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పట్నం మహేందర్ రెడ్డి, సైదిరెడ్డి ఉదాహరణలు మాత్రమే..
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు మహేందర్ రెడ్డి కి పిలిచి మరి కేసీఆర్ మంత్రి పదవి కట్టబెట్టాడు. ఆయన సతీమణిని జెడ్పి చైర్మన్ ను చేశాడు. అయినప్పటికీ మహేందర్ రెడ్డి నిలబడలేకపోయాడు. పైగా ఆయన భార్యకు కాంగ్రెస్ పార్లమెంట్ టికెట్ ఇప్పించుకున్నాడు. ఇక ఆదివారం హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే, ఇటీవల ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి బిజెపిలో చేరారు.. శానంపూడి సైదిరెడ్డి అంతకుముందు అమెరికాలో ఉండే వాడు. అప్పట్లో హుజూర్ నగర్ స్థానంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు శానంపూడి సైదిరెడ్డి కి కెసిఆర్ ఏరికోరి మరి టికెట్ ఇచ్చాడు. ఆయనను గెలిపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. చివరికి గెలిపించుకున్నాడు. సైదిరెడ్డిని ఎమ్మెల్యేను చేశాడు. రెండు సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పని చేసిన సైదిరెడ్డి.. ఇటీవలి ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఇక అప్పటినుంచి భారత రాష్ట్ర సమితికి దూరంగా ఉంటున్నాడు. హఠాత్తుగా ఆదివారం బిజెపిలో చేరాడు.
ఇప్పుడర్థమవుతోంది
మహేందర్ రెడ్డి, సైదిరెడ్డి.. ఇంకా చాలామంది నాయకులు కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరారు. భవిష్యత్తు కాలంలో చాలామంది చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలు భారత రాష్ట్ర సమితికి ఇబ్బందికరమైనవే. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు మరో విధంగా చెబుతున్నారు. గతంలో ప్రతిపక్షాలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కేసీఆర్.. తానే ప్రతిపక్షంగా మారిన తర్వాత ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో స్వయంగా చవిచూస్తున్నాడని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ ముందున్న లక్ష్యం ఉన్న క్యాడర్ ను కాపాడుకోవడం.. అది అంత సులభం కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఊరుకునే రకం కాదు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే బిజెపి పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టి పెడుతుంది.. కాంగ్రెస్ నుంచి ఎలాగూ నాయకులు వెళ్లలేరు. అప్పుడు అంతిమంగా ఆ ప్రభావం భారత రాష్ట్ర సమితిపై పడుతుంది. అన్ని రకాల ప్రయోగాలు చేసి బిజెపి వారిని తన పార్టీలోకి లాక్కుంటుంది. అప్పుడు భారత రాష్ట్ర సమితి మరింత ఉక్కపోతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే అంటారు పెద్దలు.. ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళని నాయకులుగా స్వీకరించాలి. నాయకులుగా తీర్చిదిద్దాలి. అంతేతప్ప రెడీమేడ్ కండువా వేసుకున్న వారిని నాయకులుగా మార్చితే.. ఆ కండువా ఉన్నంతవరకే వారి నాయకులుగా ఉంటారు. కండువా మార్చిన మరుక్షణమే, వారి అసలు రూపాన్ని చూపిస్తారని.. ప్రస్తుతమిది భారత రాష్ట్ర సమితి నాయకత్వానికి అర్థమవుతోంది. అది కూడా అధికారం కోల్పోయిన మూడు నెలలకే.