https://oktelugu.com/

Budvel lands : కోకాపేట కోట్లు పలికింది.. బుద్వేల్‌ బేరానికి రెడీ అయ్యింది

18 నెలల్లో అన్నిరకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తామని, ఎయిర్‌పోర్టు అథారిటీ అనుమతులతో ఎన్ని అంతస్తులైనా నిర్మించుకోవడానికి అవకాశం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : August 5, 2023 / 01:10 PM IST
    Follow us on

    Budvel lands : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తీసుకుంటున్న వివిధ నిర్ణయాల అమలుకు గాను నిధులను సమకూర్చుకుంటున్న సర్కారు.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కోకాపేటలో ఎకరం 100 కోట్ల మార్కు దాటిన భూముల వేలం జోష్‌ను కొనసాగిస్తూ.. బుద్వేల్‌లోనూ భూముల అమ్మకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో హెచ్‌ఎండీఏ ఈ మేరకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాల విస్తీర్ణం కలిగిన 14 ల్యాండ్‌ పార్సిళ్లుగా ఈ భూమిని విక్రయించనున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎ్‌సటీసీ ఈ-కామర్స్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ నెల 10న వేలం వేయనుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5గంటల వరకు రిజిస్ట్రేషన్‌కు గడువిచ్చింది. ఈ-వేలంలో పాల్గొనేందుకు డిపాజిట్‌గా రూ.3 కోట్లను ఈ నెల 9న సాయంత్రం 5గంటల లోపు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. కాగా, ఎకరానికి అప్‌సెట్‌ ధరను రూ.20 కోట్లు నిర్ణయించారు. అయితే ఎకరం సగటు ధర రూ.30 కోట్లు దాటుతుందని భావిస్తున్నారు. దీంతో 100 ఎకరాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని హెచ్‌ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు.

    రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌ రెవెన్యూ పరిధిలోని 283/పీ, 284/పీ, 287/పీ, 288/పీ, 299/పీ, 289 నుంచి 298 వరకు గల సర్వే నెంబర్లలోని 182 ఎకరాలను భారీ లేఅవుట్‌గా హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. ఇందులో కేవలం రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, డెవలపర్స్‌, పలు సంస్థలకు మాత్రమే అవకాశం కల్పించేలా 14 ప్లాట్లను (ల్యాండ్‌ పార్సిల్‌) మాత్రమే చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపలే మల్టీపర్పస్‌ జోన్‌లో ఉన్న ఈ భారీ లేఅవుట్‌లో కోకాపేట తరహాలోనే 150అడుగుల నుంచి 120 అడుగుల విస్తీర్ణంలో ఉండే రోడ్లు వేయాలని నిర్ణయించారు. రూ.200 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో లేఅవుట్‌ను అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టారు. 18 నెలల్లో అన్నిరకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తామని, ఎయిర్‌పోర్టు అథారిటీ అనుమతులతో ఎన్ని అంతస్తులైనా నిర్మించుకోవడానికి అవకాశం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.

    -రూ.3 వేల కోట్ల ఆదాయం అంచనా..

    రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఈ భారీ లేఅవుట్‌ నివాసపరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణోగ్రత కూడా కొంత తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములే అధికంగా ఉన్నాయి. ప్రైవేటు భూములున్నా.. ఇప్పటికే పలు భారీ సంస్థల చేతుల్లోకి వెళ్లాయి. రియల్‌ ఎస్టేట్‌ పరంగానే కాకుండా వివిధ సంస్థల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతం కావడంతో ఎకరం రూ.30 కోట్లు దాటుతుందని, వంద ఎకరాల విక్రయం ద్వారా రూ.3వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని హెచ్‌ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా హెచ్‌ఎండీఏ భూములు, ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్‌ విడుదలయ్యాక ఈ-వేలానికి నెల రోజుల గడువు ఇస్తారు.అయితే.. కోకాపేటలో భూముల వేలంతో వచ్చిన జోష్‌ కొనసాగించేందుకు ప్రభుత్వ ఆదేశాలతో ఆగమేఘాల మీద హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వారం రోజుల్లోనే బుద్వేల్‌లో భూముల అమ్మకం జరపనుంది. ఈ-వేలం ఈ నెల 10న కావడంతో అందుకనుగుణంగా హెచ్‌ఎండీఏ చర్యలు చేపడుతోంది. 6న ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించి.. బుద్వేల్‌ లేఅవుట్‌పై డెవలపర్లు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థల సందేహాలను నివృత్తి చేయనున్నారు. అయితే కోకాపేట వేలంలో ప్లాట్లు దక్కని వారికి బుద్వేల్‌ ఓ అవకాశంగా మారింది. ఇప్పటికే కోకాపేటకు రిజిస్ర్టేషన్‌ చేసుకున్నవారు కేవలం డిపాజిట్‌ సొమ్ము చెల్లించి.. బుద్వేల్‌ భూముల వేలంలో పాల్గొనవచ్చని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.