https://oktelugu.com/

Free Electicity In Telangana : రేవంత్ రెడ్డి పై యుద్ధం సరే.. ఈ ఉచిత విద్యుత్ వల్ల ఎంత నష్టమో గుర్తించారా?

వాస్తవానికి ఈ పరిస్థితిని జనముందు ప్రవేశపెట్టడంలో కాంగ్రెస్ నాయకులు కూడా విఫలమవుతున్నారు. స్థూలంగా చెప్పాలంటే తెలంగాణ విద్యుత్ విజయం వెనక కటిక చీకటి ఉంది. అది ఏ క్షణాన్నయినా డిస్కమ్ ల పుట్టి ముంచుతుంది.

Written By:
  • Rocky
  • , Updated On : July 11, 2023 / 08:52 PM IST
    Follow us on

    Free Electicity In Telangana : తానా మహాసభలో ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను భారత రాష్ట్ర సమితి ఖండ ఖండాలుగా ఖండిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేస్తోంది. ఇక సొంత పార్టీ మీడియాలో అయితే అడ్డగోలుగా వార్తలు రాస్తున్నది. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతోంది. ఒక రాజకీయ పార్టీగా తన ప్రత్యర్థి పార్టీని విమర్శించడం లో తప్పు లేదు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలాంటివి? వాటికి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలి? అనేవి తెలియకపోవడమే భారత రాష్ట్ర సమితి భావ దారిద్ర్యానికి నిదర్శనం. వాస్తవానికి ఇక్కడ భారత రాష్ట్ర సమితి చెబుతున్నట్టు తెలంగాణలో సరఫరా అవుతున్న 24 గంటల విద్యుత్ వెనుక ఎన్నో చీకట్లు ఉన్నాయి. అన్నింటికీ మించి ప్రభుత్వం దాస్తున్న లెక్కలు ఉన్నాయి. దీని గురించి భారత రాష్ట్ర సమితిని టాకిల్ చేసే సోయి కాంగ్రెస్ పార్టీకి లేదు. అస్తమానం అది సీనియర్ల కొట్లాటతోనే కొట్టుమిట్టాడుతోంది. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలకు తమ వ్యక్తిగత ప్రాభవాన్ని కాపాడుకోవడంతోనే సరిపోతోంది.

    అంతులేని విషాదం

    “ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త. ఇప్పుడు కరెంట్ పోతే వార్త” భారత రాష్ట్ర సమితి నేతలు పదేపదే చెబుతున్న మాట ఇది. వాస్తవానికి తెలంగాణలో అమలవుతున్న విద్యుత్ సరఫరా విషయంలో బయటకు చూస్తే విజయం సాధించినట్టే కనిపిస్తుంది. కానీ ఈ విద్యుత్ సరఫరా వెనుక అంతులేని విషాదం ఉంది. అన్నింటికీ మించి విద్యుత్ సరఫరాకు కీలకమైన డిస్కం ల పుట్టి ముంచే ప్రమాదం ఉంది. తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న డిస్కములను రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చేసింది. వరుస నష్టాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చింది. రెప్ప వాల్చకుండా కరెంటు సరఫరా చేస్తున్న ప్రభుత్వం.. వాటికి కేంద్ర బిందువైన విద్యుత్ సంస్థలను మాత్రం దివాలా బాట పట్టించింది. ఎంతలా అంటే 2014-15 సంవత్సరాల కాలంలో కేవలం 2,281 కోట్ల నష్టాలతో ఉన్న డిస్కం లు ప్రస్తుతం 45వేల కోట్ల నష్టాలను దాటేశాయి. ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయనే స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది రేటింగ్, ర్యాంకింగ్స్ జాబితాలో కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది. ఈ ప్రకారం తెలంగాణ డిస్కమ్ ల కంటే అప్పులే 150 శాతం అధికంగా ఉన్నాయి. మరో మూడు రాష్ట్రాల్లో కూడా డిస్కమ్ ల పరిస్థితి ఇదే విధంగా ఉంది. తెలంగాణ డిస్కమ్ లకు ఏకంగా మైనస్ “సీ గ్రేడ్” ర్యాంకు దక్కిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితికి డిస్కమ్ లు చేరుకున్నాయి.

    అంత సామర్థ్యం ఎక్కడిది?

    తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. కానీ ప్రభుత్వపరంగా స్థాపిత సామర్థ్యం పెరగడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయిలో జెన్కో ఆధ్వర్యంలో నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు రెండే. అవి ఒకటి కేటీపీఎస్ ఏడోదశలో 800 మెగా వాట్ల తో పాటు మణుగూరులో 1080 మెగా వాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఇక ఉమ్మడి రాష్ట్రంలో భూపాలపల్లిలో 600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం చేపట్టగా.. తెలంగాణ ఏర్పడే నాటికే అది 60% పూర్తయింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్లాంట్ పూర్తి చేశారు. ఇలాగే పులిచింతలలో 120 మెగా వాట్లు, ప్రియదర్శిని జూరాలలో 234 మెగా వాట్ల జల విద్యుత్ కేంద్రాల నిర్మాణాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత పూర్తయ్యాయి. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి సంస్థ అయిన సింగరేణి చెందిన 1200 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణ కసరత్తు/అనుమతుల ప్రక్రియ ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయింది. నిర్మాణంలో కీలక దశలు తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తయ్యాయి. ఇక పూర్వ నల్గొండ జిల్లా దామరచర్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. దీని నిర్మాణం ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. నాలుగేళ్లలో దీనిని పూర్తి చేయాలని అప్పట్లో అనుకున్నారు. కానీ ఇంతవరకు అది కార్య రూపం దాల్చలేదు. తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కేంద్రానికి పర్యావరణ అనుమతిని సస్పెండ్ చేసింది. మరోవైపు కేటీపీఎస్ ఏడోదశ అనుమతి కోసం 30 ఏళ్ళు దాటిన వివిధ దశలకు చెందిన 1020 మెగా వాట్ల ప్లాంట్ ను మూసేశారు. ఇలా ప్రభుత్వ రంగంలో స్థాపిత సామర్థ్యం పెరగక పోగా.. విద్యుత్ డిమాండ్ మాత్రం రోజురోజుకు పెరిగిపోతుంది. డిమాండ్ తగినట్టుగా పెద్ద ఎత్తున విద్యుత్తును కొనుగోలు చేస్తుండటంతో విద్యుత్ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకు పోతున్నాయి.

    బకాయిలు గుదిబండ

    రాష్ట్రం ఏర్పడిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం 20,908 కోట్లు ఖర్చు చేసింది. అదే 2023_24 సంవత్సరానికి ఇది 36,934 కోట్లకు ఇది చేరుకుంది. డిస్కమ్ లకు వచ్చే ఆదాయం కరెంటు కొనుగోలుకే సరిపోతుంది. ఇక ప్రభుత్వ సంస్థల కరెంటు బకాయిలు ఏటికేడు కొండలా పేరుకు పోతున్నాయి. వాటిని ప్రభుత్వం తిరిగి చెల్లించడం లేదు. తెలంగాణ ఆవిర్భవించిన 2014లో నీటిపారుదల శాఖకు చెందిన ఎత్తిపోతల బకాయిలు 107 కోట్లు మాత్రమే. కానీ, 2022(నవంబర్ నాటికి) కు వచ్చేసరికి ఇవి కాస్త 9,268.21 కోట్లకు పెరిగాయి. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖ బకాయిలు తొమ్మిదేళ్ల కిందట బకాయిలు కేవలం 740 కోట్లు మాత్రమే. అవి ఇప్పుడు 6,353.14 కోట్లకు చేరుకున్నాయి. ఇలా వివిధ ప్రభుత్వ శాఖల బకాయిలు మొత్తం కలిపి 2014లో కేవలం 1,302 కోట్లు మాత్రమే. అవి 2022 డిసెంబర్ నాటికి ఏకంగా (తెలంగాణ ఈ ఆర్ సి కి డిస్కమ్ లు సమర్పించిన లెక్క ప్రకారం) 20,841 కోట్లకు చేరుకున్నాయి. ఈ బకాయిల మొత్తం ఏకకాలంలో మంజూరు చేస్తే డిస్కమ్ ల కష్టాలు 40 శాతం వరకు తగ్గుతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేయడం లేదు.

    ఇవీ నష్టాలకు కారణాలు

    ఎత్తిపోతలు సహా ప్రభుత్వ సంస్థల బకాయిలు, సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరా, మీటర్ ఆధారంగా విక్రయించే కరెంటు సరఫరా తగ్గిపోవడం, డిస్కమ్ ల నష్టాలకు ప్రధాన కారణాలు. విద్యుత్ ఉత్పత్తి వ్యయం, పంపిణీ, సరఫరా, వాణిజ్య నష్టాలు పెరగడం కూడా ఇందుకు ఒక కారణం. విద్యుత్ సంస్థల ఆర్థిక సామర్థ్యానికి మీటర్ ఆధారిత విక్రయాలే ప్రాతిపదిక. కానీ, ఈ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. తెలంగాణలో రెండు డిస్కమ్ లు ఉండగా.. వాటిలో దక్షిణ డిస్కం (ఎన్ పీడీసీఎల్ హైదరాబాద్) లో ఆధారిత విక్రయాలను 2021_22 లో 65.81 శాతం(30,794 మిలియన్ యూనిట్లు): 2022_23లో 70.06 శాతం(35,942 మిలియన్ యూనిట్లు), 2023_24 లో 73.48(41,762 మిలియన్ యూనిట్లు) గా అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండే ఎన్పీడీసీఎల్ ( వరంగల్ ) లో మీటర్ ఆధారిత విక్రయాలు తీసి కట్టుగా ఉన్నాయి. 2021_22 లో వీటిని 54.69%(11,222 మిలియన్ యూనిట్లుగా) లెక్కించారు. 2022_ 23లో 53.90 శాతం(10,737 మిలియన్ యూనిట్లు), 2023_24 లో 60.26 శాతం(13,975 మిలియన్ యూనిట్లు) గా అంచనా వేశారు. వ్యవసాయ వినియోగాన్ని లెక్కించడానికి మీటర్లు లేకపోవడం, ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ, వాటర్ బోర్డులో మీటర్లు ఉన్నా రీడింగ్ తీయకపోవడమే ఇందుకు కారణం. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఈ కారణంగానే డిస్కమ్ లు పీకలలోతు కష్టాల్లో కూరుకుపోయాయి. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తే భారత రాష్ట్ర సమితి నాయకులు గోలగోల చేస్తున్నారు. వాస్తవానికి ఈ పరిస్థితిని జనముందు ప్రవేశపెట్టడంలో కాంగ్రెస్ నాయకులు కూడా విఫలమవుతున్నారు. స్థూలంగా చెప్పాలంటే తెలంగాణ విద్యుత్ విజయం వెనక కటిక చీకటి ఉంది. అది ఏ క్షణాన్నయినా డిస్కమ్ ల పుట్టి ముంచుతుంది.