Covert Politics In Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. అధికార బీఆర్ఎస్తోపాటు, విపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ కన్నేసింది. ఈసారి ఎలాగైనా కేసీఆర్‌ను గద్దె దించుతామని విపక్షాలు అంటున్నాయి. ఇందుకు ఎవరి వ్యూహాలు వారు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే విపక్షాలను కోవర్టులు టెన్షన్ పెడుతున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌లోనే కోవర్టులు ప్రచారం జరిగింది. ఇప్పుడు బీజేపీలోనే ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అధికార పార్టీకి మేలుచేసేలా సమాచారం చేరవేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కానీ, వారిని ఏరివేయడంలో మాత్రం తాత్సారం చేస్తున్నారు.
కాంగ్రెస్‌లో కోవర్టులపై..
కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారని, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డే చెప్పారు. పార్టీ అంతర్గత సమాచారాన్ని అధికార బీఆర్ఎస్కు చేరవేస్తున్నారని ఆరోపించారు. వీరు పార్టీని వీడి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేశారు. పార్టీలో ఉండి, పార్టీకి నష్టం చస్తే తామే తొలగిస్తామని కూడా హెచ్చరించారు. అయితే కాంగ్రెస్‌లో అసలైన కాంగ్రెస్, వలస కాంగ్రెస్ లొల్లితో రేవంత్ ఈ కోవర్టుల ఆరోణ లు చేస్తున్నారని పార్టీ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. రేవంత్‌కు అనుకూలంగా లేనివారిని కోవర్టులుగా ముద్రవేస్తున్నారని కొందరు సీనియర్లు చెబుతున్నారు. ఇది మంచిది కాదని, పార్టీలైన్‌లో నడిచేవారిని కోవర్టులుగా ముద్రవేయడం పార్టీకి నష్టం చేస్తుందన్నారు. ఈమేరకు అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు పార్టీ సోషల్ మీడియాలో రేవంత్ తనకు నచ్చనివారిపై వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు. కోవర్టులు ఎవరూ లేరని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడు బీజేపీలో…
ఇన్నాళ్లూ కాంగ్రెస్‌కే పరిమితమైన కోవర్టులు.. తాజాగా బీజేపీలోనూ తయారయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొన్న ఆ పార్టీ ఎమ్మెల్యే, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ బీజేపీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని స్వయంగా ప్రకటించారు. తాజాగా, ఆ పార్టీ నేత నందీశ్వర్‌గౌడ్ కూడా బీజేపీలో కోవర్టులు ఉన్నారని ప్రకటించారు. త్వరలోనే వారిపేర్లు చెబుతానని తెలిపారు. దీంతో ఆ పార్టీలో కొత్త చర్చ మొదలైంది.
ప్రకటనల్లో నిజమెంత..
కోవర్టులపై కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనల్లో నిజం ఉందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి కోవర్టులను పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ కోవర్టులు ఉన్న మాట నిజమే అయితే.. వారు ఎందుకోసం పనిచేస్తున్నారు. అధికార పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నుంచి ఇంతవరకు ఏమైనా లబ్ధి పొందారా అని కూడా బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తున్నారు. అయితే ప్రకటనలు చేస్తున్నంత ఈజీగా కోవర్టులను ఏరివేయడం లేదు. కారణం ఏమిటంటే.. కోవర్టు అని నిరూపించే ఆధారాలు లేకపోవడమే.
కొత్త, పాత నేతల మధ్య సఖ్యత లేకనే..
విపక్ష పార్టీల్లో కోవర్టుల ప్రకటనకు అసలు కారణం.. రెండు పార్టీల్లోనూ వలస నేతలు, ఒరిజినల్ నేతలు ఉండడమే కారణం. కాంగ్రెస్ పార్టీకి వలసలు కొత్తేమీ కాదు. అయితే వలస వచ్చిన నేతలకు పార్టీ పగ్గాలు ఇవ్వడమే సీనియర్లకు నచ్చడం లేదు. ఈ క్రమంలోనే ఆ పార్టీలో కోవర్టుల చర్చ తెరపైకి వచ్చింది. ఇక బీజేపీలోకి గతంలో వసలు ఉండేవి కావు. ఇటీవల పార్టీ పుంజుకోవడం, మోదీ, షా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తేవాలని ప్రయత్నించడంతో వలసలను ప్రోత్సహిస్తున్నారు. వాస్తవానికి బీజేపీలో ఆ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే నేతలే ఉంటారు. వలసలు పెరగడంతో వలసవాదులు, ఒరిజినల్ నేతల మధ్య సఖ్యత కుదరడం లేదు. ఈ క్రమంలోనే ఆ పార్టీలోనూ కోవర్టుల అంశం తెపపైకి వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి రెండు పార్టీల నేతలు కోవర్టులను ఏరివేస్తారా.. లేక బీఆర్ఎస్తో తమ కోవర్టులను పెడతారా చూడాలి.