KCR Mahaa Dharna: తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాక ప్రగతి భవన్ కట్టుకొని అటు సచివాలయానికి గత ఏడేళ్లలో కేసీఆర్ వెళ్లింది లేదు. ఇటు ప్రజల్లో పెద్దగా కలిసింది లేదు. పోని ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతి భవన్ లోనే ప్రజలను కలుస్తున్నారంటూ అదీ లేదు. అదొక ‘గడీ’లా మార్చుకొని దొరల్లా పాలిస్తున్నాడని బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తూనే ఉన్నారు. అయినా ఎప్పుడూ కేసీఆర్ బయటకు రాలేదు. విమర్శలను పట్టించుకోలేదు. కానీ ఫస్ట్ టైం కేసీఆర్ రోడ్డునపడ్డాడు.

కానీ ఫస్ట్ టైం బయటకొచ్చాడు.అదీ బీజేపీతో ఫైట్ కోసం ప్రగతి భవన్ వీడాడు. సార్ గర్భగుడిని దాటి రోడ్డునపడ్డాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఢిల్లీలో కాదు.. హైదరాబాద్ గల్లీలో తొలి ధర్నా చేపట్టడం జాతీయ స్థాయిలో సంచలనమైంది. బీజేపీతో ఫైట్ లో తగ్గేది లేదని కేసీఆర్ నిరూపించారు. రోడ్డెక్కారు.
ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కేంద్రంతో ఫైట్ చేస్తూ తెలంగాణలో వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మహాధర్నా చేపట్టడం నిజంగానే జాతీయ స్థాయిలో వార్త అయ్యింది. కేసీఆర్ మాత్రమేకాదు.. టీఆర్ఎస్ మంత్రులంతా.. ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ లో చేపట్టిన నిరసన ఇవాళ సంచలనమైంది. వరికొనుగోళ్లపై కేంద్రం దిగి వచ్చే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ హెచ్చరించిన విధానంతో ఇక కేసీఆర్ కేంద్రంతో ఫైట్ కు రెడీ అయ్యాడని అర్థమవుతోంది.
ఇప్పటికే హుజూరాబాద్ లో ఎంత ఖర్చు పెట్టినా టీఆర్ఎస్ గెలవలేదు. ఇక ఈటల గెలిచి కేసీఆర్ ప్రతిష్ట మసకమారింది. ప్రజల్లో టీఆర్ఎస్ వ్యతిరేకత పెల్లుబుకుతోంది. దాన్ని తగ్గించడానికి.. హుజూరాబాద్ గెలుపును డైవర్ట్ చేయడానికి కేసీఆర్ ఈ స్ట్రాటజీ తీసుకున్నట్టు అర్థమవుతోంది.
రాజకీయాలను ఒక్కరోజులో మార్చగల సామర్థ్యం ఉన్న కేసీఆర్ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అంతా తెలుసు. అందుకే హుజూరాబాద్ ఓటమిని.. ప్రజల్లో తమ ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించుకోవడానికి కేసీఆర్ స్వయంగా మహాధర్నాలో కూర్చొని బీజేపీని టార్గెట్ చేశారు. మరి ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా? కేసీఆర్ ను ప్రజలు , రైతులు నమ్ముతారా లేదా? అన్నది వేచిచూడాలి.