
ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ టెక్ మహీంద్రా ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. బిజినెస్ ప్రాసెసింగ్ సేవల విభాగంలో పని చేస్తున్న 5,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. సంస్థ ఆదాయం పెరుగుతున్నా సిబ్బంది తొలగింపులు జరుగుతూనే ఉన్నాయి. అక్టోబర్ – డిసెంబర్ లో టెక్ మహీంద్రా ఆదాయం గత త్రైమాసికంతో పోలిస్తే ఏకంగా 11 శాతం పెరగడం గమనార్హం. ఆదాయం పెరిగినా ఇప్పటికే ఈ సంస్థ 2,500 మంది సిబ్బందిని తొలగించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వల్ల కంపెనీ అనుకున్న లక్ష్యాలను రీచ్ కావడంతో సిబ్బందిని తొలగించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల టెక్నాలజీని వినియోగించుకుని తక్కువ సంఖ్యలో సిబ్బంది ఎక్కువ పని చేసే అవకాశం ఉండటంతో కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. భవిష్యత్తులో ఇతర కంపెనీలు కూడా సంస్థ ఆదాయానికి అనుగుణంగా సిబ్బంది సంఖ్యలో మార్పులు చేసే అవకాశం ఉంది.
టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ మాట్లాడుతూ సిబ్బంది ఉత్పాదకత పెరుగుతోందని అందువల్లే ఆదాయం కూడా పెరుగుతోందని తెలిపారు. వర్క్ ఫ్రమ్ ఆప్షన్ వల్ల కొన్ని అద్దె భవనాలను ఖాళీ చేసినట్లు వెల్లడించారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి 5జీ కంపెనీలతో కలిసి టెక్ మహీంద్రా పని చేస్తోందని.. 40 శాతం సిబ్బంది కార్యాలయాలకు వచ్చి పని చేయాల్సి వస్తోందని గుర్నానీ వెల్లడించారు.
కరోనా వల్ల ఇప్పటికే చాలామంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోగా ప్రముఖ కంపెనీలు సైతం ఉద్యోగుల తొలగింపు దిశగా అడుగులు వేయడం ఫ్రెషర్స్ ను టెన్షన్ పెడుతోంది. అయితే పలు కంపెనీలు మాత్రం ఈ ఏడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ఇప్పటికే కీలక ప్రకటనలు చేశాయి.