TDP – Janasena List : టిడిపి జనసేన 99 సీట్లలో దక్కింది ఒక్కటే.. ఇలాగైతే ఎలా?

రెండవ విడతలోనైనా టిడిపి జనసేన కూటమి మైనారిటీలకు కోరిన సీట్లు కేటాయిస్తారా? లేక బిజెపిని ఆహ్వానించి ఒక్క సీటుతోనే సరిపుచ్చుతారా? అనేది తేలాల్సి ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : February 24, 2024 3:35 pm
Follow us on

TDP – Janasena List : టిడిపి, జనసేన అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ శనివారం సంయుక్తంగా ప్రకటించిన 99 స్థానాల్లో అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఒకే ఒక్క సీటు దక్కడంతో మైనారిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. తమ జనాభాకు తగినట్టుగా సీట్లు కేటాయించి ఉంటే.. కచ్చితంగా ఓటు బ్యాంకు మొత్తం టిడిపి, జనసేన కూటమికి బదిలీ అయ్యేదని అంటున్నారు. బిజెపితో పొత్తు కుదరకపోయినప్పటికీ తమను దూరం పెట్టారని.. ఒకవేళ పొత్తు కుదుర్చుకుంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే తమకు సీట్లు కేటాయించలేదని మైనారిటీ నేతలు ఆరోపిస్తున్నారు.

టిడిపి ఆవిర్భావం నుంచి మైనారిటీలు దానికి అండగా ఉండుకుంటూ వస్తున్నారని.. చివరికి జనసేన స్థాపించిన పవన్ కళ్యాణ్ కు కూడా కష్టకాలంలో చేయూతనందించామని మైనారిటీలు గుర్తు చేస్తున్నారు.” జగన్ పాలించిన ఐదు సంవత్సరాలు పెద్దగా జరిగింది ఏమీ లేదు. మా సంక్షేమాన్ని పెద్దగా పట్టించుకోలేదు. టిడిపి జనసేన కూటమి మాకు ప్రాధాన్యం ఇస్తాయని అనుకున్నాం. కానీ ఒకే ఒక్క సీటుతో సరిపుచ్చాయి” అంటూ మైనారిటీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టిడిపి జనసేన కూటమి కట్టినప్పుడు గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాలో తమ ఓటు బ్యాంకు బలంగా ఉన్న ప్రాంతాల్లో సీట్లు కేటాయిస్తారని మైనారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా అదే సంకేతాలు ఇచ్చారు. కాని చివరికి సీట్ల కేటాయింపునకు వచ్చేసరికి వారు ఇచ్చిన మాట నిలుపుకోలేదని మైనారిటీ నేతలు అంటున్నారు. కేవలం ఒకే ఒక సీటు (కర్నూలు జిల్లా నంద్యాల ఫారుక్) ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే టిడిపి జనసేన కూటమికి మైనారిటీ ఓటు బ్యాంకు ఎలా బదిలీ అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. సీట్ల కేటాయింపు విషయంలో టిడిపి, జనసేన అధినేతలు పునరాలోచన చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. రెండవ విడతలోనైనా టిడిపి జనసేన కూటమి మైనారిటీలకు కోరిన సీట్లు కేటాయిస్తారా? లేక బిజెపిని ఆహ్వానించి ఒక్క సీటుతోనే సరిపుచ్చుతారా? అనేది తేలాల్సి ఉంది.