
Chandrababu On Nijam With Smitha: దేశంలో విద్యార్థి సంఘాల నుంచి నాయకత్వ లక్షణాలను అలవరచుకొని ఎంతోమంది నేతలుగా ఎదిగారు. అప్పట్లో రాజకీయాలకు తొలిమెట్టు విద్యార్థి సంఘాలే. అక్కడ అరంగేట్రం చేసి.. తరువాత రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు. అటువంటి నేతల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకరు. ఆర్థిక శాస్త్రంలో పీజీ చేసి.. రీసెర్చ్ స్కాలర్ గా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందిన అరుదైన ఘనత చంద్రబాబుది. అటువంటి నాయకుడే విద్యార్థి సంఘాల ఎన్నికలను బ్యాన్ చేయడం మాత్రం విమర్శలకు కారణమైంది. అయితే అందుకు గల కారణాన్ని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
ప్రముఖ గాయనీ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తున్న సోనీ లివ్ ఓటీటీ ఫ్లాట్ ఫాం పై టాక్ షోకు చంద్రబాబు హాజరయ్యారు. ‘అభివృద్ధి వర్సెస్ ప్రజాకర్షక పథకాలు’ అనే కాన్సెప్ట్ పై స్మిత చంద్రబాబును ఇంటర్వూ చేశారు. విద్యార్థి దశ నుంచి నేటి వరకూ జరిగిన పరిణామాలపై పలు ఆసక్తికర విషయాలను చంద్రబాబుతో చెప్పించే ప్రయత్నం చేశారు.అటు చంద్రబాబు కూడా మనసు విప్పి మాట్లాడగలిగారు. తన అంతరంగాన్ని ఆవిష్కరించగలిగారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్నది సైద్ధాంతిక విభేదాలే తప్ప.. వ్యక్తిగతంగా చాలా గౌరవించుకునేవాళ్లమని గుర్తుచేసుకున్నారు. రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజశేఖర్ రెడ్డి తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారని.. తాను మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా ఎన్నికై మంత్రిగా పనిచేశానన్నారు. చాలా సన్నిహితంగా మెలిగేవారమని చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత రాజకీయ దారులు వేరయ్యాయని చెప్పారు. కానీ వ్యక్తిగత స్నేహం మాత్రం కొనసాగిందన్నారు. 1995లో సీఎం అయ్యాక ఒక సాయం కోరారని.. నిబంధనల ప్రకారం చేయలేకపోయానన్నారు. ఆ విషయంలో తనపై వైఎస్సార్ కు కోపం ఉండేదన్నారు. 2004లో తాను ఓడిపోయి వైఎస్ ముఖ్యమంత్రి అయినా రాజకీయంగా విభేదించుకున్నామే తప్ప.. వ్యక్తిగతంగా గౌరవించుకునేవారమని నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.

తనపై వెన్నుపోటు అన్న ఆరోపణ, అపవాదుపై చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు. 1994లో అధికారంలోకి వచ్చిన తరువాత సీనియర్లను నిర్లక్ష్యం చేయడం, కొందరికి అవమానాలు ఎదురుకావడం జరిగిందన్నారు. అశాంతి మొదలైందన్నారు. అటు పార్టీలో సీనియర్లు, ఇటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు లాభం లేదనుకున్నా.. తాను మాత్రం ఎన్టీఆర్ తో మూడు గంటల పాటు చర్చించినట్టు చెప్పారు. ఆ సమయంలో బీవీ మోహన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారని గుర్తుచేశారు. కొన్ని తప్పిదాలు దిద్దుబాటు చేసుకోవాలని చెప్పినా అనివార్య పరిస్థితులు వల్ల అది సాధ్యం కాలేదు. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాం కాబట్టే ఈ రోజు టీడీపీ బతికిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాటి ఘటనకు కారకులైన వ్యక్తి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో మనందరికీ తెలిసిన విషయమేనన్నారు.
అయితే చంద్రబాబు చిన్ననాటి విషయం ఒకటి టాక్ షో ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇంటర్వ్యూలో భాగంగా చిన్ననాటి మిత్రులను ఇంటర్వ్యూ చేశారు. 1968 ఎస్ఎస్ఎల్సీ ఫలితాలు వచ్చాయి. ఆ పరీక్షల్లో చంద్రబాబు ఫెయిలయ్యారు. ప్లాట్ ఫాం దిగి పట్టాలపై వెళుతున్నారు. అప్పుడే రైలు బయలుదేరింది. ఆ సమయంలో చంద్రబాబు రెక్కపట్టి పట్టాల నుంచి బయటకు లాగేశాను అంటూ…మిత్రుడు దేవరాజ్ నాయుడు చెప్పుకొచ్చారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ నిజమే తాను ఎస్ఎస్ఎల్సీ తప్పానని ఒప్పుకున్నారు. తరువాత పరీక్షల్లో ఎప్పుడు ఫెయిల్ కాలేదని కూడా చెప్పారు. నాడు తాను ఆ నిర్ణయం అమలుచేసి ఉంటే మాత్రం చంద్రబాబు ఈ స్థాయిలో మీ ముందు కూర్చొని ఉండేవాడు కాదన్నారు.
విద్యార్థి సంఘాల ఎన్నికలు బ్యాన్ చేయడానికి కారణాన్ని చెప్పుకొచ్చారు చంద్రబాబు. తాను యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీచేశానని చెప్పారు. ఆ సమయంలో రోజంతా ప్రచారం చేసి వాహనాలతో యూనివర్సిటీ చేరుకునేవారిమన్నారు. అయితే రాజకీయాల్లో పడి పిల్లలు చెడిపోతున్నారని తల్లిదండ్రులు, యూనివర్సిటీలో రాజకీయాలతో ఒకరకమైన అసౌకర్యం కలుగుతుందని ప్రొఫెసర్లు బాధపడుతుండే వారని గుర్తుచేశారు. అందుకే విద్యార్థి సంఘాల ఎన్నికలను బ్యాన్ చేసినట్టు చెప్పారు. అయితే కరెక్టా? కాదా? అని ఇప్పటికీ తనలో తాను చర్చించుకుంటానన్నారు. విద్యార్థుల మంచి కోసమే ఆ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.