
Pawan Kalyan- TDP: వైసీపీ విముక్త ఏపీ అన్న నినాదంతో పవన్ ముందుకు సాగుతున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రయత్నిస్తానని చెబుతున్నారు. ఇందుకు అవసరమైతే అన్ని రాజకీయ పక్షాలను ఒకే వేదికపైకి తెస్తానని హెచ్చరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెప్పుకొచ్చారు. అప్పుడే పొత్తుల అంశం తెరపైకి వచ్చింది. టీడీపీతో జనసేన పొత్తు ఖాయమని ప్రచారం సాగింది. పొత్తు కోసం పవన్ ప్రయత్నిస్తున్నారని.. బీజేపీని సైతం కలుపుకెళ్లేందుకే ఢిల్లీ టూర్ కు వెళ్లారంటూ ఎవరిష్టం వచ్చినట్టు వారు ఊహించుకుంటున్నారు. అధికార వైసీపీ అయితే తమకు వ్యతిరేకంగా ఆ సమూహమంతా కలిసిపోతోందని ప్రచారం మొదలుపెట్టింది.
ఎవరి ఎత్తులువారివి..
అయితే పొత్తు కుదుకోవాలని టీడీపీ ఆరాటపడుతోంది. పొత్తు కుదరకూడదని వైసీపీ భావిస్తోంది. జగన్ సర్కారు అరాచకాల నుంచి ఏపీకి విముక్తి లభించాలంటే అన్ని రాజకీయ పక్షాలు ఏకం కావాలి. లేకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అది అంతమంగా వైసీపీకే లాభిస్తుంది. అందుకే ఈ ధర్మ సందేహాల నడుమే పవన్ పొత్తుల కోసం బలంగా ఆలోచిస్తున్నారు. గత ఎన్నికల తరువాత బీజేపీ తనతో సక్రమంగా నడిచి ఉంటే ఇంకొకరి అవసరం లేకుండా ఎదిగి ఉండేవారమని టీడీపీ గురించి పవన్ ప్రస్తావించారు. అంటే ఒక వేళ పొత్తు పెట్టుకున్నా అది అనివార్య పరిస్థితుల్లో మాత్రమేనని ముందుగా చెప్పుకొచ్చారు. ఒక వేళ జగన్ లా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే తెలుగుదేశం పార్టీని సైతం పక్కనపెడతామని పవన్ ముందస్తు హెచ్చరికలు జారీచేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జనసేన ఉండకూడదన్న కుట్ర..
పవన్ వరకూ ఓకే కానీ.. జనసేన పార్టీ ఉండకూడదు.. ఎదగకూడదన్నది టీడీపీ భావనం. అందుకే ఎల్లో మీడియా జనసేన, పవన్ పై కుట్రలు చేస్తోంది. పవన్ నాయకత్వాన్ని చిన్నతనం చేసేలా కథనాలను వండి వార్చుతోంది. టీడీపీతో జనసేన కలవాలి. తద్వారా టీడీపీ విజయం సాధించాలి. చంద్రబాబు సీఎం కావాలి. జనసేనకు సీట్లు తగ్గాలి. పవన్ పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉండాలి. ఇన్ని లక్ష్యాలతో ఎల్లో మీడియా పావులు కదుపుతోంది. అటు చంద్రబాబు సైతం జనసేనకు పరిమిత సంఖ్యలో సీట్లు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. వ్యూహాత్మకంగా జనసేనను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ విముక్త ఏపీ అన్న పవన్ శపథం చుట్టూనే రాజకీయాలు నడుపుతున్నారు.

అధికారం తారుమారైనా పంథా అదే..
ఒక వేళ టీడీపీ, జనసేన కూటమి ఖరారై అధికారంలోకి వచ్చినా.. పవన్ శైలి ఇదే మాదిరిగా ఉంటుందని విశ్లేషకులు స్థిరమైన అభిప్రాయమే చెబుతున్నారు. ప్రజాభిష్టం విషయంలో పవన్ చాలా నిబద్ధతో ఉంటారని చెబుతున్నారు. ఒక వేళ సంఖ్యాబలంగా తక్కువగా ఉండి.. టీడీపీకి పవర్ ఇచ్చినా.. ఇప్పటి అధికార వైసీపీపై కంటే మాటల దాడి ఎక్కువగా ఉండే అవకాశముందని సైతం విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రస్తుతానికి వైసీపీ విముక్త ఏపీ అని.. అదే పరిస్థితి టీడీపీ వస్తే.. ఆ పార్టీపై అదే పిలుపు ఇవ్వడానికి వెనుకాడబోరని పవన్ నైజం తెలిసిన వారు బలంగా విశ్వసిస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఆయన వైసీపీ విముక్త ఏపీ కోసమే పాటుపడుతున్నారు. అందుకు అనుగుణంగానే ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు తగ్గించే ప్రయత్నం చేస్తే టీడీపీకే అసలు ఎసరు అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.