TDP And Janasena Alliance: ఉమ్మడి ఏపీ నుంచి ఒక సెంటిమెంట్ నడుస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లు సాధించే పార్టీ అధికారంలోకి వస్తుంది. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు ఈ జిల్లాలపై దృష్టి పెడతాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. అయితే టిడిపి, జనసేన కూటమి ఇక్కడ ఏకపక్ష విజయం దక్కించుకుంటుందన్న అభిప్రాయం ఉంది. అందుకే ఆ రెండు పార్టీల ఆశావాహులు ఇక్కడ అధికం. దీంతో ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కష్టతరంగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెజారిటీ సీట్లను జనసేన ఆశిస్తుండడంతో.. టిడిపి నేతలు బెంబేలెత్తిపోతున్నారు.
2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో జనసేన 14 శాతం ఓట్లను సాధించింది. ఇదే జిల్లాలోని రాజోలు నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. అందుకే ఈసారి మెజారిటీ సీట్లను ఆశిస్తోంది. 6 నుంచి 8 వరకు ఎమ్మెల్యే స్థానాలను జనసేనకు కేటాయించాలని పవన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాజోలు, రాజానగరం పై పవన్ స్పష్టమైన ప్రకటన చేశారు. వీటికి తోడు కాకినాడ రూరల్, పిఠాపురం, రాజమండ్రి రూరల్, ముమ్మిడివరం సీట్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్తపేట, రామచంద్రపురం వంటి స్థానాల్లోనూ జనసేన పార్టీ ఆశావహులు పనిచేసుకుంటూ పోతున్నారు.
అయితే జనసేన ఆశిస్తున్న నియోజకవర్గాల్లో టిడిపికి బలమైన నేతలు ఉన్నారు. వారికి ఎలా సముదాయిస్తారు? ఎలా సర్దుబాటు చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది. రాజమండ్రి రూరల్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఆయన ఆ స్థానాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. ఆయనకు కాదని జనసేనకు టికెట్ కేటాయిస్తే రెబల్ గా మారి పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఉన్నారు. ఆ సీటును సైతం జనసేన ఆశిస్తుండడంతో బుచ్చిబాబు పరిస్థితి ఏమిటి అన్నది తెలియడం లేదు. మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో పొత్తుల అంశం రెండు పార్టీల మధ్య సంక్లిష్టత ఉంది. దీనిపై పవన్, చంద్రబాబు ఎలాంటి ఆలోచన చేస్తున్నారో చూడాలి. ఇప్పటికే పవన్ కాకినాడలో వరుసగా సమీక్షలు చేశారు. మెజారిటీ నియోజకవర్గాల విషయంలో ఒక స్పష్టతకు వచ్చారు. చంద్రబాబుతో తుది ఆలోచన చేసి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అప్పటివరకు రెండు పార్టీల నేతలకు టెన్షన్ తప్పదు.