Professor Sushmitha: చేతిరాత మీ కలను నిర్ణయిస్తుంది, మీ కల ఎంత అందంగా ఉంటుందో, మీ చేతిరాత కూడా అంతే అనేది సామెత. దానిని నిజం చేస్తోంది గుంటూరుకు చెందిన ప్రొఫెసర్ సుస్మితచౌదరి. భిన్నమైన, అందమైన చేతిరాతతో వివిధ పోటీల్లో రాణిస్తోంది. ఇటీవల ఆల్ ఇండియా హ్యాండ్ రైటింగ్ అండ్ కాలిగ్రఫీ అకాడమీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వ్యాప్త పోటీలో సుస్మిత మొదటి స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ చేతుల మీదుగా అవార్డు అందుకుంది.
ప్రొఫెసర్‌గా పనిచేస్తూ..
గుంటూరుకు చెందిన సుస్మిత హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సుస్మిత తన చిన్నతనం నుంచి చేతివ్రాత, నగీషీ రాతపై మక్కువ పెంచుకుంది. పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయుడి ప్రోత్సాహంతో చేతిరాతలో భిన్న శైలిని ఎంచుకుంది. అందరూ సంగీతం, డ్రాయింగ్ వంటి కళలపై దృష్టిపెడితే సుస్మిత మాత్రం కాలిగ్రఫీ, లూప్డ్ కర్సివ్, ఇటాలియన్ కర్సివ్ మరియు టైమ్స్ రోమన్ నేర్చుకుంది. అందులో రాణించడం ఆమెకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది.
5 వేల మందిలో ఒక్కరిగా..
మంచి చేతివ్రాత యొక్క ప్రాముఖ్యతను వ్యాప్తి చేయడానికి ఆల్ ఇండియా హ్యాండ్ రైటింగ్ అండ్ కాలిగ్రఫీ అకాడమీ ఏటా పోటీలు నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన పోటీలో 5 వేల మంది పాల్గొన్నారు. సుస్మిత తన పనిని అరవై నిమిషాల రికార్డు సమయంలో పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది.
చేతిరాతతో వ్యక్తిత్వం అంచనా..
ఒక వ్యక్తి చేతిరాతతో అతడిలోని 5 వేలకుపైగా వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేయవచ్చని సుస్మిత తెలిపారు. విద్యార్థుల చేతిరాతను అర్థం చేసుకోవడం, వారి అభ్యాస శైలిని, వారు పాఠాల సమయంలో సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు.