
Ghost Stories in North Andhra : మీరు దెయ్యాన్ని ఎప్పుడైనా చూసారా..? అని ఇప్పుడు ఎవరినైనా అడిగితే సినిమాల్లో చూశామని చెబుతారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని అనేక గ్రామాల్లో ఈ దెయ్యాలను నేరుగా చూసిన వాళ్లు, వాటితో పనులు చేయించుకున్న వాళ్లు కూడా ఉన్నారు. నమ్మశక్యంగా లేదా.. నిజంగానే ఒకప్పుడు దెయ్యాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో తిరిగాడేవని, రాత్రులు బయట పడుకునేటప్పుడు మంచాలతో సహా ఎత్తుకొని వెళ్లి పొలాల్లో విడిచిపెట్టేవని కూడా ఈ ప్రాంత ప్రజలు చెబుతుంటారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో దెయ్యాల గురించి ఎక్కువగా చెబుతుంటారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఈ దయ్యాలు బెడద ఎక్కువగా ఉండేది. ఒంటరిగా వెళ్లే వారిని ఈ దెయ్యాలు భయపెట్టడం, భిన్నమైన శబ్దాలు చేస్తూ ఒంటరిగా వెళ్లే వారిని అనుసరిస్తున్నట్లు చేయడం ద్వారా భయాందోళనలకు గురి చేసేవి. తీవ్రమైన ఎండ ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్లే వారిని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేసేవని ఈ ప్రాంత ప్రజలు చెబుతుంటారు. రాత్రులు అయితే గ్రామానికి దగ్గరలో ఉండే తాటి చెట్లు వంటి వాటిపై ఉండి భయంకరమైన శబ్దాలు చేసేవని, ఒక్కోసారి ఆ తాటి చెట్ల పైన మంటలుగా వ్యాప్తి చెందెలా చేసి కాల్చి వేసేవని పేర్కొనేవారు. అలా ఆ దగ్గరలో ఉండే వారిని భయాందోళనలకు గురి చేసేవి ఈ దెయ్యాలు.
దెయ్యాలతో పనులు చేయించిన వాళ్ళు ఉన్నారు..
దెయ్యాలంటే భయపడే వారితోపాటు.. వాటితో బలంగా ఎదురొడ్డి నిలబడిన వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని అనేక గ్రామాల్లో దెయ్యాలతో వ్యవసాయ పనులు చేయించేవారు. రాత్రులు వ్యవసాయ పనులు చేసే రైతులు వద్దకు దెయ్యాలు వచ్చి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే.. వాటిని మాటల్లో పెట్టి వ్యవసాయ పనులు చేయించే వారిని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. ముఖ్యంగా వ్యవసాయానికి నీళ్లు కట్టించేలా చేసిన ఎంతో మంది రైతులు ఉన్నారని పేర్కొంటున్నారు.

మంచాలతో తీసుకెళ్లి ఊరు బయట విడిచి పెట్టేవి..
ఒకప్పుడు ఈ ప్రాంతంలోని రైతులు ఎక్కువగా కల్లాల్లో (పొలాలు దగ్గరలో ఉండే పశువులు కొప్పం లాంటివి) పడుకునేవారు. అక్కడ మంచాలపై రైతులు బయట పడుకునేవారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా సహకరించే దెయ్యాలు కొంతమందిని మంచాలతో తీసుకుని వెళ్లి స్మశాన వాటిక దగ్గరలో, ఊరికి సుదూర ప్రాంతాల్లో విడిచి పెట్టేవని ఈ ప్రాంతానికి చెందిన పలువురు ఇప్పటికీ చెబుతుంటారు.
కోకొల్లలుగా దెయ్యాల కథలు..
ఇప్పటికీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో దెయ్యాల కథలు కోకొల్లలుగా చెబుతుంటారు. అయితే ఇవన్నీ కథలు కాదని వాస్తవంగా జరిగినవే అని ఇక్కడ ప్రజలు చెబుతుండడం గమనార్హం. దెయ్యాలు అంటే భయపడని వాళ్ళు వాటితో పనులు చేయించి ఇబ్బందులు పెట్టగా.. దెయ్యాలు పట్టి తీవ్ర ఇబ్బందులకు గురైన వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. రోజులు.. వారాలు.. నెలలు తరబడి.. దెయ్యాలు పట్టిన తర్వాత ఇబ్బందులు పడ్డ ఎంతో మంది బాధితులు ఇప్పటికీ ఈ ప్రాంతంలో కనిపిస్తుంటారు. దెయ్యాల నుంచి విముక్తి పొందేందుకు పూజలు, యాగాలు అంటూ ఇప్పటికీ చేస్తుంటారు. దెయ్యం పట్టిన వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తించడం, భిన్నమైన వాయిస్లతో మాట్లాడడం, రాత్రి వేళల్లో భయాన్ని కలిగించేలా వ్యవహరించడం వంటివి చేస్తూ ఉంటారు. ఇదే గ్రామానికి చెందిన వివిధ కారణాల వల్ల గతంలో చనిపోయిన వాళ్లే ఈ దెయ్యాలుగా చలామణి అవుతూ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తుంటారని.. ఆయా గ్రామాల పెద్దలు చెబుతున్నారు.
అయితే, వీటిని మూఢనమ్మకాలుగా, మానసిక సమస్యలుగా నిపుణుల పేర్కొంటున్నారు. దెయ్యాలు, భూతాలు అంటూ లేవని.. మానసికంగా ఇబ్బందులు ఉన్నవారికి ఈ తరహా సమస్యలు ఉత్పన్నమవుతుంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే, వైద్యులు, నిపుణుల వివరణ ఎలా ఉన్నా…. గ్రామాల్లో ఈ దైవ, దుష్టశక్తులు ఉన్నాయన్న విషయాన్ని మాత్రం ఈ ప్రాంత ప్రజలు బలంగా నమ్ముతుండడం విశేషం.