https://oktelugu.com/

Journalists: జర్నలిస్టుల బతుకులు ఇలా ఉంటాయి

ఒకరోజు ఆఫీస్‌కు వెళ్లగానే చీఫ్‌ రిపోర్టర్‌ని పిలిచి ఎడిటర్‌ చెడామడా తిట్టి పంపించారు. సాధారణంగా ఏదైనా ముఖ్యమైన వార్త మిస్‌ అయితే అలా తిడతారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 6, 2023 10:59 am
    Journalists

    Journalists

    Follow us on

    Journalists: సంపాదకులు.. చాలా మందికి దీనిని సంపాదించే వారు అనుకుంటారు. రెండు చేతులా ఆదాయం అనుకుంటారు. కానీ సంపాదనకు సంపాదకీయానికి సంబంధం లేని వారు అని చాలా మందికి తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. సంపాదకులు అనగా.. రకరకాలుగా వేధించు శాడిస్టులు అని మరో అర్థం. జర్నలిస్టుల జీవితాలు దినదిన గండం అనేదీ నిజమే.

    ఒకవైపు బాధపడుతూ.. మరోవైపు నవ్వు నటిస్టూ..
    ఓ సినిమాలో బ్రహ్మానందం ఒకవైపు బాధపడుతున్నట్టు నటిస్తూ మరుక్షణమే ఇంకోవైపు సంతోష పడుతున్నట్టు అద్భుతంగా నటన పండించాడు. చాలా మంది జర్నలిస్ట్‌లు ఇలాంటి నటనను దాదాపు రోజూ తన వృత్తి జీవితంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. బయటి వారే కాదు రిపోర్టర్లను చూసి సబ్‌ ఎడిటర్లు, సబ్‌ ఎడిటర్లను చూసి రిపోర్టర్లు మా కంటే వీరి జీవితమే బెటర్‌ అని ఈర‡్ష్య ఉంటుంది. నెలనెలా జీతం ఇచ్చే పత్రికల్లో జర్నలిస్ట్‌లు ఒళ్లు దగ్గర పెట్టుకొని, అప్రమత్తంగా పని చేయాల్సి ఉంటుంది. జీతం ఇవ్వడం మాట దేవుడెరుగు ఉల్టా జర్నలిస్ట్‌ల వద్దనే డబ్బులు తీసుకోనే మీడియాలో వారు ఆడింది ఆటగా ఉంటుంది. తిను తినిపించు అనే నినాదం వీరు నమ్ముతుంటారు . అప్పుడప్పుడు బ్లాక్‌ మెయిల్‌ కు పాల్పడుతున్న జర్నలిస్ట్‌ అరెస్ట్‌ అంటూ వచ్చే వార్తలు ఇలాంటి వారి గురించే .

    నెలనెలా జీతం.. దిన దిన గండం..
    నెలనెలా జీతం ఇచ్చే సంస్థల్లో జర్నలిస్ట్‌ ల జీవితాలు మాత్రం దినదిన గండం లాంటిదే . ఉద్యోగం నిలుపుకోవడానికి బ్రహ్మానందంను మించి నటించాల్సి ఉంటుంది . సంస్థలో ఒక్కరు కాదు బోలెడు మంది బాస్‌లు ఉంటారు. కొన్ని సంస్థల్లో బాస్‌ల సొంత పనులు చేయకపోయినా ఇబ్బందే.. ఇదే సమయంలో ఇలాంటి పైరవీలు ఎంజాయ్‌ చేస్తూ ఎదిగే వారు కూడా ఉంటారు. నిజాయితీగా మన పని మనం చేస్తే బాస్‌కే కాదు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అని సినిమా డైలాగు చెప్పవచ్చు… కానీ వాస్తవ పరిస్థితి అలా ఉండదు .

    రిపోర్టర్‌ తప్పయినా…
    ఒకరోజు ఆఫీస్‌కు వెళ్లగానే చీఫ్‌ రిపోర్టర్‌ని పిలిచి ఎడిటర్‌ చెడామడా తిట్టి పంపించారు. సాధారణంగా ఏదైనా ముఖ్యమైన వార్త మిస్‌ అయితే అలా తిడతారు. దానితో రిపోర్టర్లు అందరూ అప్రమత్తమై తమ బీట్‌కు సంబంధించిన వార్త ఏమైనా మిస్‌ అయిందా అని అన్ని పత్రికలు చూశారు. ఏమీ మిస్‌ కాలేదు. మరి దేనికోసం ఆ తిట్లు అని విచారిస్తే … ఆస్ట్రేలియాలో భారీ భూకంపమో ఏదో ప్రకృతి వైపరీత్యం .. ఆ వార్త మిస్‌ అయ్యారు. దానికి చెడామడా తిట్టడం అందరికీ హాస్యంగా అనిపిస్తుంది. జర్నలిస్టులకు కూడా.. ఆస్ట్రేలియాలో ఏదో జరిగితే హైదరాబాద్‌లో ఉన్న రిపోర్టర్‌ కు ఏం బాధ్యత?

    కారణం వేరే..
    ఐతే ప్రతీ తిట్టుకు తెరవెనుక ఓ కథ ఉంటుంది . ఎడిటర్‌ ఎక్కువ సమయాన్ని పుస్తకాలు రాయడానికి ఉపయోగిస్తారు . యజమాని ధృతరాష్ట్రుడు అయినప్పుడు దుర్యోధనుడు పూనడం సహజం. ఈ పుస్తకాలను అమ్మడం జర్నలిస్టుల ప్రధాన విధిగా మారిపోతుంది. ప్రభుత్వ సంస్థలకు పెద్ద మొత్తంలో పుస్తకాలు అంటగట్టారు . బిల్లులు మాత్రం రావడం లేదు . ముఖ్యమంత్రి స్థాయిలో చెబితే తప్ప పని కాదు. దాంతో అమెరికాలో తుఫాన్‌ వచ్చినా, ఆస్ట్రేలియాలో భూకంపం వచ్చినా చారి వణికిపోయే పోయే పరిస్థితి. మనం నిజాయితీగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు అనే డైలాగు ఇతర ఉద్యోగాలకు పని చేస్తుందేమో కానీ జర్నలిస్ట్‌లకు పని చేయదు. ఎడిటర్‌ పని కాక పోయినా, ఓనర్‌ కు కోపం వచ్చినా వణికిపోవలసిందే.