Year Roundup 2023: చంద్రయాన్‌ సక్సెస్‌.. వరల్డ్‌ కప్‌ ఫెయిల్యూర్‌.. 2023 పంచిన జ్ఞాపకాలివే..!

లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌సింగ్కు వ్యతిరేకంగా సాక్షి మలిక్, బబ్లింగ్ పునియా. వినేశ్ పొగాట్ తదితర రెజ్లర్లు జనవరి నెలలో డిల్లీలో చేపట్టిన ఆందోళన తీవ్ర కలకలం సృష్టించింది.

Written By: Raj Shekar, Updated On : December 30, 2023 9:54 am

Year Roundup 2023

Follow us on

Year Roundup 2023: మరో 48 గంటల్లో 2023 కాలగర్భంలో కలియనుంది. సరికొత్త లక్ష్యాలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. అయితే 2023 ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. చంద్రయాన్, జీ20 సదస్సుతో భారత్ పేరు అంతర్జాతీయంగా మార్మోగింది. మణిపూర్ ఘర్షణలు, ఒడిశా ఘోర రైలు ప్రమాదం, రెజ్లర్ల ఆందోళన మచ్చలా మరాయి. ఎన్నో మధురానుభూతులతోపాటు కొన్ని గుళికలను మిగిల్చిన ఈ ఏడాదిని ఓ సారి గుర్తుచేసుకుందాం..!

రోడ్డెక్కిన వస్తాదులు..
లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌సింగ్కు వ్యతిరేకంగా సాక్షి మలిక్, బబ్లింగ్ పునియా. వినేశ్ పొగాట్ తదితర రెజ్లర్లు జనవరి నెలలో డిల్లీలో చేపట్టిన ఆందోళన తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ డబ్ల్యూఎఫ్ఎపై నిరవధికంగా సస్పెన్షన్‌ విధించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం డబ్ల్యూఎస్ఐ ప్యానెల్‌ను రద్దు చేసి, మరలా ఎన్నికలు నిర్వహించింది. ఈ క్రమంలో ఎన్నో ఉద్వేగపూరిత పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో తమ పతకాలను గంగా నదిలో కలిపేందుకు రెజ్లర్లు సిద్ధమయ్యారు. మరికొందరు ఆట నుంచి వీడ్కోలు పలుకుతున్నామని ప్రకటించారు. ఇంకొందరు ఆవార్డులు వెనక్కి ఇచ్చారు.

రాహుల్‌పై అనర్హత వేటు..
సాక్షాత్తూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీపై మార్చి నెలలో అనర్హత వేటు పడటం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మోదీ ఇంటిపేరును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం (క్రిమినల్) కేసులో సూరత్ కోర్టు రాహుల్కు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. వెంటనే లోక్‌సభ సచివాలయం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. న్యాయపోరాటం అనంతరం దిగువస్థాయి కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో సుమారు ఐదు నెలల తర్వాత రాహుల్ పార్లమెంట్లో అడుగుపెట్టారు.

జనాభాలో నంబర్‌ వన్..
ఈ ఏడాది ఏప్రిల్లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. నంబర్ వన్‌గా ఉన్న చైనాను దాటేసింది. 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. చైనా రెండో స్థానంలో నిలిచింది. 1950 నుంచి ఐరాస జనాభా లెక్కల్ని ప్రచురిస్తోంది. అప్పట్నుంచి అగ్రస్థానంలో ఉన్న చైనాను మనదేశం వెనక్కి నెట్టింది. జనాభా విషయంలోనూ భారత్‌పై చైనా అక్కసు వెళ్లగక్కింది.

మణిపుర్ ఘటన మాయని మచ్చ..
జాతుల మధ్య వైరంతో మే నెలలో ఈశాన్య రాష్ట్రం మణిపుర్ లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. మైతేయిలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు ప్రతిపాదన చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడంతో అల్లర్లు చెలరేగాయి. వారికి రిజర్వేషన్లు ఇవ్వొద్దని ఆదివాసీ తెగలు డిమాండ్ చేశాయి. ఇది ఘర్షణలకు దారితీయడంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. మహిళలు బృందాలుగా ప్రముఖుల ఇళ్లపై దాడి చేసి, నిప్పంటించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగించిన ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఇంటర్నెట్‌పై ఆంక్షలతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ ఘటనలపై ప్రస్తుతం దర్యాప్త జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పరిస్థితి కాస్త కుదుటపడింది.

కొత్త పార్లమెంట్ భవనం..
ఈ అమృతకాలంలో భారత్‌కు కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తమిళనాడులోని ద్రవిడ సంప్రదాయానికి గుర్తుగా ఉన్న సెంగోల్‌ను స్పీకర్ కుర్చీ పక్కన ప్రతిష్టించారు.

విషాదం నింపిన ఒడిశా రైలు దుర్ఘటన..
ఒడిశాలోని బాలేశ్వర్ జూన్ 2 రాత్రి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, ఓ గూడ్స్ రైలు, యశ్వంత్పూర్-హావ్డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అనూహ్య రీతిలో ఢీకొన్న ఘటన దేశ వ్యాప్తంగా పెను విషాదం నింపింది. ఈ ఘటనలో 296 మంది బలయ్యారు. సుమారు 1,200 మంది గాయపడ్డారు. బోగీలు ఒకదానిపై ఒకటి దూసుకెళ్లడం, వాటి మధ్య చిద్రమైన శరీరాలు, క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. గాయపడిన వారికి రక్తం అవసరం ఉంటుందని ఆలోచించిన వందలాదిమంది యువత ఆసుపత్రికి తరలివచ్చి రక్తం ఇచ్చారు.

గోల్డెన్‌ మూమెంట్‌ చంద్రయాన్-3
ఆగస్టు నెలలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 సురక్షితంగా దిగడంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాలకు సైతం అందని దక్షిణ ధ్రువంపై కాలుమోపింది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్లు 14 రోజుల పాటు చంద్రుడి గురించి విలువైన సమాచారం అందించాయి. అనంతరం చంద్రుడిపై చీకటి కావడంతో ఆ రెండు నిద్రాణస్థితిలోకి వెళ్లిపోయాయి.

కీర్తిని చాటిన జీ20 సదస్సు..
సెప్టెంబర్‌లో భారత్ అధ్యక్షతన జీ-20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ నినాదంతో సభ్యదేశాలతోపాటు పలు మిత్ర దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు భారత్ అతిథ్యం ఇచ్చింది. ఢిల్లీ డిక్లరేషన్‌పై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడాన్ని భారీ విజయంగా అభివర్ణించారు. దీని నిర్వహణపై అమెరికా సహా ప్రపంచ దేశాల నుంచి భారత్‌ను ప్రశంశించాయి. మనదేశం నుంచి ఐరోపాను అనుసంధానం చేసే ప్రతిష్టాత్మక భారత్-పశ్చిమాసియా-తూర్పు ఐరోపా ఆర్ధిక నడవా విషయంలో ఈ సదస్సులో అవగాహన ఒప్పందం కుదరడం కీలక పరిణామం.

వరల్డ్‌ కప్‌ జస్ట్‌ మిస్‌..
నవంబర్ నెల భారత క్రికెట్ అభిమానులకు అంతులేని నిరాశను మిగిల్చింది. వన్డే ప్రపంచకప్‌ – 2023లో ప్రారంభం నుంచి పరుగుల వరద పారించి.. వికెట్ల వేటలో దూసుకుపోయి.. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టి జైత్రయాత్రను కొనసాగించిన రోహిత్ సేన ఆఖరి మెట్టుపై భంగపడింది. పరాజయం పాలై కంగారులకు ఆరో ప్రపంచకప్ సమర్పించుకొంది. మాజీ క్రికెటర్లు కపిల్‌దేవ్‌, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత భారత్‌కు కప్పు అందించాలనుకున్న రోహిత్ కల నెరవేరలేదు.

సుఖాంతమైన ఆపరేషన్ టన్నెల్..
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరాకాశీలో సొరంగం పాక్షికంగా కుప్పకూలడంతో 41 మంది కూలీలు చిక్కుకుపోయిన ఘటన దేశవ్యాప్తంగా కలవరానికి గురిచేసింది. సహాయక చర్యలకు అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలను దాటి, 17 రోజుల శ్రమించిన బలగాల కష్టానికి ఫలితం దక్కింది. చివరకు ‘ర్యాట్ హోల్ మైనర్ల’ నైపుణ్యంతో ఆ కూలీలు సురక్షితంగా బయటపడ్డారు.

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం..
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్ సభలోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒక వ్యక్తి గ్యాలరీ నుంచి కిందకు దూకుతూ నినాదాలు చేయగా.. మరొకరు ఒకరకమైన పొగను లోక్‌సభలో వదలడం అలజడి సృష్టించింది. మరో ఇద్దరు పార్లమెంట్‌ బయట ఈ తరహాలో ఆందోళనలు చేశారు. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నిరసనలతో లోక్‌సభ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందంటూ సభాపతులు వారిపై వేటు వేశారు. ఒక సెషన్‌లో 146 మందిపై సస్పెన్షన్ విధించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

మరికొన్ని..
స్వలింగ సంపర్కుల ‘ప్రత్యేక వివాహాల చట్టం’ కింద చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా నిరాకరించింది. చట్టబద్ధత చేసే హక్కు పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది.

– ఖలిస్థానీ సానుభూతిపరుడు, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించి కలకలం సృష్టించారు.

– 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో విపక్ష పార్టీలన్నీ కలిసి ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశాయి.

– సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌లో వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించింది.