Assembly Fight: కొమురంభీం నేల ఆసిఫాబాద్‌లో గెలుపు ఎవరిది?

మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్‌లో టికెట్‌ ఫైట్‌ జరుగుతోంది. 2018లో కాగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోవ లక్ష్మిపై గెలిచిన ఆత్రం సక్కు తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు.

Written By: Raj Shekar, Updated On : August 9, 2023 11:10 am

Assembly Fight

Follow us on

Assembly Fight: జల్‌.. జంగల్‌.. జమీన్‌ నినాదంతో ఆదివాసీల కోసం పోరాటం చేసిన వీరుడు కుమురంభీం. జిల్లాల పునర్విభజనతో ఆసిఫాబాద్‌ జిల్లాగా ఏర్పడింది. ఆదివాసీ వీరుడి పేరుమీద కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాగా పెరు పెట్టారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో ఆదివాసీలకు నిలయం. 45 శాతం మంది ఇక్కడ ఆదివాసీలే. తండాలు, గూడేలు ఎక్కువ. ఇక ఎన్నికల్లో విజేతను నిర్ణయించేది ఆదివాసీలే. 1962 నుంచి ఎస్టీ నియోజవర్గం అయిన ఆసిఫాబాద్‌లో ఆదివాసీల మద్దతు ఉంటేనే ఏ పార్టీ అభ్యర్థి అయినా గెలుస్తాడు. మొదట కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలిచారు. తర్వాత కమ్యూనిస్టులు పట్టు సాధించారు. గుండా మల్లేశ్‌ సీపీఐ నుంచి రెండుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారింది.

బీఆర్‌ఎస్‌లో టికెట్‌ ఫైట్‌..
మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్‌లో టికెట్‌ ఫైట్‌ జరుగుతోంది. 2018లో కాగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోవ లక్ష్మిపై గెలిచిన ఆత్రం సక్కు తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం కోవ లక్ష్మి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కోవ లక్ష్మి ఆత్రం సక్కుపై విజయం సాధించారు. ఈసారి మళ్లీ టికెట్‌ సాధించి బరిలో నిలవాలని భావిస్తున్నారు. అయితే సక్కు మాత్రం టికెట్‌ తనకే వస్తుందని, ఈమేరకు అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చిందని ప్రచారం మొదలు పెట్టారు.

రేఖానాయక్‌ భర్త కన్ను..
ఒకవైపు బీఆర్‌ఎస్‌లో సక్కు, లక్ష్మి మధ్య టికెట్‌ఫైట్‌ జరుగుతుండగా మూడో వ్యక్తి టికెట్‌ తన్నుకుపోయే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ భర్త, రవాణాశాఖలో పనిచేసి ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న శ్యాంనాయక్‌ కూడా ఆసిఫాబాద్‌పై కన్నేశారని తెలుస్తోంది. ఈమేరకు అధిష్టానం వద్ద లాబీయింగ్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సక్కు, లక్ష్మి టికెట్‌ కోసం కొట్లాడుకుంటే.. అధిష్టానం ఇద్దరినీ కాదని శ్యాంనాయక్‌కు టికెట్‌ ఇచ్చే అవకాశం ఉందని అంతర్గతంగా గుసగుజలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌వైపు సక్కు, శ్యాంనాయక్‌ చూపు..
బీఆర్‌ఎస్‌లో ఉన్న సక్కు, శ్యాంనాయక్‌ ఇటు కాంగ్రెస్‌తోనూ టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ టికెట్‌ రానిపక్షంలో కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలవాలని భావిస్తున్నారని సమాచారం.
సక్కు మనిషి బీఆర్‌ఎస్‌లో ఉన్నారు.. మనసు మాత్రం కాంగ్రెస్‌లో ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. 2018లో సక్కు కేవలం 170 ఓట్ల మెజారిటీతోనే గెలిచారు. ఈసారి ఆయనకు స్థానికంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మరోవైపు గత ఎన్నికల్లో ఓడిపోయిన కోవా లక్ష్మి ఇప్పుడు బీఆర్‌ఎస్‌ టికెట్‌ రేసులో ముందున్నారు. దీంతో సక్కు కాంగ్రెస్‌కు మళ్లీ దగ్గరవుతున్నారని తెలుస్తోంది. శ్యాంనాయక్‌ కూడా కుదిరితే బీఆర్‌ఎస్‌ లేకుంటే కాంగ్రెస్‌ అన్నట్లుగానే ఉన్నారు.

సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్‌..
ఆసిఫాబాద్లో బీఆర్‌ఎస్‌ను ఓడించాలని బీజేపీ, కాంగ్రెస్‌ పట్టుదలతో ఉన్నాయి. బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోట్నాక్‌ విజయ్‌ కుమార్, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆజ్మీర అత్మారామ్‌ నాయక్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్తున్నారు. మోదీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వ పనితీరు మీద వీరు నమ్మకం పెట్టుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ కూడా బలంగా ఉంది. ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసిఫాబాద్‌ మాజీ సర్పంచ్‌ మర్సుకోల సరస్వతి, డాక్టర్‌ గణేశ్‌ రాథోడ్, శేషారావు రాథోడ్‌ పోటీ పడుతున్నారు. 2018లో టీఆర్‌ఎస్‌ హవాలోనూ ఆసిఫాబాద్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. దీంతో ఇక్కడ తమ ఓటు బ్యాంకు చెక్కుచెదర లేదని, వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని కాంగ్రెస్‌ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మూడు పార్టీల్లో నువ్వా.. నేనా
ఆసిఫాబాద్‌పై మూడు ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. రూలింగ్‌ పార్టీలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి టికెట్‌ ఆశిస్తున్నారు. బీజేపీలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోట్నాక్‌ విజయ్‌ కుమార్, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆజ్మీర అత్మారామ్‌ నాయక్‌ మధ్య టికెట్‌ ఫైట్‌ ఉంది. ఇక కాంగ్రెస్‌లో ఆసిఫాబాద్‌ మాజీ సర్పంచ్‌ మర్సుకోల సరస్వతి, డాక్టర్‌ గణేశ్‌ రాథోడ్, శేషారావు రాథోడ్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు.