https://oktelugu.com/

Bairanpally : వికృతం.. పైశాచికం.. రాక్షసానందం.. ఇది తెలంగాణలో మరో జలియన్ వాలా బాగ్

మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. వారిని వివస్త్రలను చేసి, ఒకచోట చేర్చిన మృతదేహాల చుట్టూ బతుకమ్మ అడించారు.

Written By:
  • Rocky
  • , Updated On : August 27, 2023 / 11:06 AM IST

    bairanpally]

    Follow us on

    Bairanpally : జలియన్ వాలా బాగ్.. బ్రిటిష్ జనరల్ డయ్యార్ దురాగతానికి నెత్తుటి మరక లాంటి నిలిచిన ఘటన.. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది గాయపడ్డారు. చాలామంది తప్పిపోయారు. ఆ ఘటన జరిగి దశాబ్దాలు అవుతున్నప్పటికీ.. నేటికీ ఆ సంఘటన గుర్తుకు వస్తే ప్రతి భారతీయుడి కళ్ళలో నుంచి నీళ్లు ఉబికి వస్తాయి. వ్యాపారం పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించి దేశాన్ని తమ కబంధహస్తాల్లో తీసుకున్న బ్రిటిష్ వాల్ల రాక్షసత్వానికి ఆ ఘటన ఒక నిదర్శనం. అలాంటి ఘటన తెలంగాణలో కూడా జరిగింది. కాకపోతే దానికి పాల్పడింది బ్రిటిష్ వాళ్ళు కాదు. ఆగస్టు 27 నాటికి ఆ దారుణం జరిగి 75 సంవత్సరాలు. ఇంతకీ ఆనాడు ఏం జరిగింది?

    బైరాన్ పల్లి బురుజు

    రజాకార్ల దురంతానికి 75 ఏళ్లు

    బైరాన్‌పల్లి! ఈ ఊరి పేరు వింటేనే ప్రజలపై నిర్దయగా ఘోర అకృత్యాలకు పాల్పడ్డ రజాకార్లకు హడల్‌! నిజాం పాలన నుంచి స్వేచ్ఛను కాంక్షిస్తూ గొంతెత్తిన సిద్దిపేట జిల్లాలోని ఈ ఊరిపై రజాకార్లు అర్ధరాత్రి దొంగచాటుగా దాడికి పాల్పడి పారించిన నెత్తుటేర్లకు ఆదివారంతో సరిగ్గా 75 ఏళ్లు! అప్పట్లో బైరాన్‌పల్లిలో 123 మందిని రజాకార్ల మూక కాల్చి చంపింది. అయితే మృతుల సంఖ్య 300కు పైనే ఉంటుందని చెబుతారు. మృతదేహాలన్నింటినీ ఒక చోట చేర్చి.. మహిళలను వివస్త్రలను చేసి వాటి చుట్టూ బతుకమ్మ ఆడించి పైశాచిక ఆనందం పొందింది. అప్పట్లో జలియన్‌వాలాబాగ్‌ ఘటననను గుర్తుచేసేలా ఆ మూక పాల్పడిన దమనకాండకు సాక్షీ భూతంగా నిలిచిన మైసమ్మ మర్రి చెట్టు, బురుజు ఇంకా ఉన్నాయి. నాటి దాడిలో అమరులైన వారి త్యాగాలకు చిహ్నంగా గ్రామంలో నిలువెత్తు స్థూపం ఉంది. అప్పటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడాదే అయింది. స్వేచ్ఛను కాంక్షిస్తూ నిజాం పాలనను బైరాన్‌పల్లి గ్రామస్థులు ధిక్కరించారు. అదే వారు చేసిన తప్పయింది. తొలుత 60 మంది  రజాకార్లతో, మరోసారి 150 మంది రజాకర్లతో ఇలా ఐదుసార్లు గ్రామంపై నిజాం దాడి చేయించాడు. పలుమార్లు గ్రామస్థులు గొడ్డళ్లు, బరిసెలు, ఒడిసెలతో వారిపైన విరుచుకుపడటంతో రజాకార్లు వెనుదిరగక తప్పలేదు. ఈ దాడిలో రజాకార్ల నాయకుడైన అవ్వల్‌సాబ్‌ కుమారుడిని గ్రామస్థులు మట్టుపెట్టారు. ప్రతీకారేచ్చతో రగిలిపోయిన రజాకార్లు 1948 ఆగస్టు 27 తెల్లవారు జామున 1200 మంది బలగాలతో గ్రామాన్ని చుట్టుముట్టారు.

    బహిర్భూమికి వెళ్లిన వడ్ల నర్సయ్య అనే వ్యక్తిని పట్టుకుని గ్రామంలోకి చొరబడ్డారు. రజాకార్లు చొరబడ్డారని పెద్దగా ఆయన కేకలు వేయడంతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. గ్రామం నడిబొడ్డున ఉన్న బురుజుపై పహారా కాస్తున్న కొందరు కాల్పులు జరిపారు. ప్రతిగా రజాకార్లు ఎదురు కాల్పులు జరపడంతో బురుజుపైనున్న మందుగుండు సామగ్రి పేలి దానిపై ఉన్న మోటం పోశాలు, మోటం రామయ్య మృతి చెందారు. బురుజుపై నుంచి కాల్పుల శబ్దం ఆగిపోవడంతో గ్రామంలోకి చొరబడ్డ రజాకార్లు దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో సుమారు 92 మంది మృతి చెందారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. వారిని వివస్త్రలను చేసి, ఒకచోట చేర్చిన మృతదేహాల చుట్టూ బతుకమ్మ అడించారు. తర్వాత బైరాన్‌పల్లికి వెన్నుదన్నుగా నిలిచిన కూటిగల్‌ను వదలలేదు. గ్రామంలో చొరబడి జనాలపై కాల్పులు జరిపారు. అక్కడ బురుజుపైనున్న వారిని కిందికి దింపి లెంకలు కట్టి గ్రామ శివారు ఒడ్డున గల ఊడలమర్రి కింద వరుసగా నిల్చోపెట్టి కాల్చి చంపారు. ఈ ఘటనలో సుమారు 31 మంది గ్రామస్థులు చనిపోయారు.

    ఇంతటి దారుణం జరిగినప్పటికీ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను ఆయన పూర్తిగా విస్మరించారు. కేవలం ఎంఐఎం ప్రాపకం కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పక్కన పెట్టారు. వాస్తవానికి తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం అనేది ఇక్కడి ప్రజల చిరకాల కాంక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు వెనుకాడాయి. చివరికి స్వీయ రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఎదురవుతుండడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ తొమ్మిది సంవత్సరాల పాలన కాలంలో బైరాన్ పల్లి ఉదంతాన్ని ప్రభుత్వం ఒక్కసారి కూడా గుర్తు చేసుకోకపోవడం బాధాకరం.