https://oktelugu.com/

Ayodhya Ram Mandir: దర్గాలో రామనామ జపం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సత్యనారాయణపురంలో అటవీ ప్రాంతంలో ఓ దర్గా ఉంది. ఈ దర్గా పరిసర ప్రాంతంలోనే రామాలయం కూడా ఉంది. ఈ దర్గాలో ప్రతి ఏటా హజ్రత్ నాగుల్ మీరా పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు.

Written By:
  • Bhaskar
  • , Updated On : January 23, 2024 10:49 am
    Ayodhya Ram Mandir

    Ayodhya Ram Mandir

    Follow us on

    Ayodhya Ram Mandir: ఏ దేశానికైనా సరే మత సామరస్యం అనేది చాలా ముఖ్యం. అది ఉన్నచోట ఎటువంటి ఘర్షణలకు తావు ఉండదు. ఎటువంటి విధ్వంసానికి ఆస్కారం ఉండదు.. కొన్ని కొన్ని సంఘటనలు మినహాయిస్తే బాల రాముడు విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దేశం మొత్తం ప్రశాంత వాతావరణం నెలకొంది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముస్లింలు కూడా హాజరవడం విశేషం. అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల ముస్లింలు రాముడి అక్షింతలు పంపిణీ చేశారు. కొనిచోట్ల అన్నదానాల్లో కూడా పాల్గొన్నారు. వీటన్నింటి కంటే ఇల్లందు మండలంలోని సత్యనారాయణపురంలో జరిగిన క్రతువు విశేషంగా అనిపిస్తున్నది.

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సత్యనారాయణపురంలో అటవీ ప్రాంతంలో ఓ దర్గా ఉంది. ఈ దర్గా పరిసర ప్రాంతంలోనే రామాలయం కూడా ఉంది. ఈ దర్గాలో ప్రతి ఏటా హజ్రత్ నాగుల్ మీరా పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో దర్గాలో చాలామంది ప్రముఖులు చాదర్ సమర్పిస్తుంటారు.. ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. ఉత్సవాలు జరిగే అన్ని రోజులు భక్తులకు నిర్వాహకులు అన్నదానాలు కూడా చేస్తుంటారు. అయితే ఈ దర్గాలో జరిగే ఉత్సవాల్లో హిందువులు కూడా పాల్గొంటారు. అయ్యప్ప మాలధారులు గుర్రపు బగ్గిపై హజ్రత్ నాగుల్ మీరా వెండి అవశేషాలను ఊరేగిస్తూ ఉంటారు. ఇక డప్పు కళాకారులు, కోయ కళాకారులు చేసే ప్రదర్శనలు ఆకట్టుకుంటాయి. అయితే ఈసారి అయోధ్య లో బాల రాముడి ప్రతిష్ట సందర్భంగా హజ్రత్ నాగుల్ మీరా దర్గాలో విశేషం చోటుచేసుకుంది.

    ఈ దర్గాలో కేవలం హజ్రత్ నాగుల్ మీరా కే కాకుండా ఇతర హిందూ దేవుళ్లకు కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ దర్గా పక్కన ఒక పుట్ట ఉంది. అక్కడ నాగులమ్మ వెలసింది అని ఇక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు. ప్రతి సంవత్సరం నాగుల పంచమి సందర్భంగా అక్కడి పుట్టలో పాలు పోస్తూ ఉంటారు.. ఇక బాల రాముడి విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో నాగుల్ మీరా దర్గాలో సీతారాములకు ప్రత్యేక పూజలు జరిపారు. రాముడి ప్రాణ ప్రతిష్ట లో ముస్లింలు కూడా పాల్గొన్నప్పటికీ.. ఒక దర్గాలో అదికూడా సీతారాముడికి పూజలు చేయడం మాత్రం విశేషమే మరి. పైగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ముస్లింల ఆధ్వర్యంలో జరగడం విశేషం. పైగా ఈ క్రతువుకు చూసేందుకు వచ్చిన భక్తులందరికీ నిర్వాహకులు అన్నదానం చేశారు. లడ్డు ప్రసాదాన్ని కూడా పంపిణీ చేశారు.. అనంతరం దక్షిణ అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను పంపిణీ చేశారు.. అంతేకాదు భారీతెరను ఏర్పాటు చేసి రాముడి ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేశారు.. కాగా, దర్గాలో రాముడు విగ్రహాలకు పూజలు చేయడం తన సుకృతమని ఇక్కడ ముస్లింలు వ్యాఖ్యానిస్తుండటం విశేషం .