NTR Death Anniversary: ఈ భూమి మీద ఎంతో మంది మనుషులు పుడతారు. కానీ అందులో కొంతమంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అటువంటి మహనీయుడే నందమూరి తారక రామారావు. పురాణాల్లో రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. కానీ తెలుగు వారికి మాత్రం రాముడు, కృష్ణుడు అంటే ముందుగా గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు. వెండితెరపై ఆయన చేసిన పాత్ర లేదు. పౌరాణిక,ఇతిహాసాల దగ్గర నుంచి జానపద, సాంఘిక చిత్రాల వరకు అన్ని రకాల పాత్రలు చేశారు ఆయన. అందుకే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయ్యారు. సినీ రంగంలో చెరగని ముద్ర వేసుకున్నారు. అదే చరిష్మతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. నేడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడిని ఒక్కసారి స్మరించుకుందాం.
సినీ రంగంలో అనతి కాలంలోనే అగ్ర హీరోగా వెలుగొందారు నందమూరి తారకరామారావు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా చలించిపోయేవారు. దివిసీమ ఉప్పెన సమయంలో దేశవ్యాప్తంగా జోలె పట్టారు. చందాలు పోగుచేసి విపత్తు బాధితుల సహాయార్థం ఆ మొత్తాన్ని అందించారు. అప్పుడే సమాజం పై ఒక అవగాహన, పాలకపక్షం వైఫల్యాలు, ప్రజలకు సంక్షేమ ఫలాలు దక్కకపోవడాన్ని గుర్తించారు. రాజకీయాల్లోకి రావాలని బలమైన ఆకాంక్ష పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి.. రా కదలిరా అంటూ ఏపీ ప్రజలను పిలుపునిచ్చారు. 1982 మార్చి 29న హైదరాబాదులోని కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కొద్దిపాటి విలేకరుల మధ్య తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ అనూహ్య నిర్ణయానికి ఢిల్లీ పునాదులు కదిలాయి. రాజ్యసభ ఇస్తాం అంటూ ఢిల్లీ పెద్దలు రాయబారాలు పంపించారు. కానీ ఎన్టీఆర్ ఎక్కడ వెనుకడుగు వేయలేదు. జనం మధ్యకు వచ్చారు. జనాలు జేజేలు పలికారు. నీరాజనాలు పట్టారు. చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ ఎన్టీఆర్ చేసిన ప్రచారానికి ఏపీ ప్రజలు నీరాజనం పలుకుతూ ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు. అనూహ్య విజయంతో జాతీయస్థాయిలో తెలుగోడి సత్తాను ఎన్టీఆర్ చాటారు.
దాదాపు 400 చిత్రాల్లో నందమూరి తారక రామారావు నటించారు. నటుడుగానే కాకుండా దర్శక నిర్మాతగా కూడా రాణించారు. 1923 మే 28న ఎన్టీఆర్ జన్మించారు. 1942 మేలో.. 20 సంవత్సరాల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామ తారకాన్ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఎన్టీఆర్ బిఏ పూర్తి చేశారు. కొద్దిరోజుల పాటు రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగం కూడా కొనసాగించారు. కానీ తనకు ఇష్టమైన సినిమా రంగంలో రాణించాలని భావించి మద్రాసు వైపు అడుగులు వేశారు. అక్కడకు కొద్ది రోజులకే సినీ అవకాశం తలుపు తట్టింది. ఎదురులేని హీరోను చేసింది. ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ,మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ జయ శంకర్ కృష్ణ కుమారులు కాగా.. గారపాటి లోకేశ్వరి, దగ్గుపాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.
పేదవాడే నా దేవుడు.. సమాజమే నా దేవాలయం అంటూ అధికారం చేపట్టిన నాటి నుంచి ఏదైతే చెప్పారో.. చేసి చూపించిన నేతగా ఎన్టీఆర్ గుర్తించబడ్డారు. కాషాయ వస్త్రాలను ధరించి ప్రజా క్షేమమని దీక్ష పూనారు. నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం ఇప్పటికీ స్ఫూర్తిదాయకమే. జాతీయ రాజకీయాల్లో టిడిపి ది మంచి ముద్ర. ఎన్టీఆర్ వేసిన పటిష్ట పునాదులు.. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. అమలు చేసిన సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీకి శ్రీరామరక్షగా నిలిచాయి. పార్టీకి ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదురైనా నిలబడింది. నిలిచి కలబడింది. అధికారంలోకి వచ్చింది. దాదాపు 33 సంవత్సరాల వెండితెర జీవితం, 13 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ నాయకుడుగా వెలుగొందారు. 1996 జనవరి 18న మృతి చెందారు. ఆయన భౌతికంగా దూరమై 28 సంవత్సరాలు గడుస్తున్నా.. ఆయన ఆశయాలు ఇప్పటికీ కళ్ళముందే కనిపిస్తున్నాయి. తెలుగుజాతి బతికున్నంత వరకు ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోనున్నారు.