https://oktelugu.com/

Crime News : లండన్ నుంచే విషప్రయోగం.. భార్యపై కోపంతో అత్తపై అల్లుడి దారుణం

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లుడు అజిత్ కుమార్ సూత్రధారి అని తేల్చారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 20, 2023 / 08:24 PM IST
    Follow us on

    Crime News : మానవ సంబంధాలు మాయమైపోతున్నాయి. అయినవారినే కడ తేర్చేందుకు కొందరు వెనుకాడడం లేదు. భార్యతో ఉన్న విభేదాలతో.. ఆమె కుటుంబాన్ని మట్టు పెట్టాలని ఆలోచించాడు ఓ వ్యక్తి. ఏకంగా విష ప్రయోగమే చేశాడు. తొలుత అత్తను చంపించాడు. ఇతర కుటుంబ సభ్యుల అవయవాలు పనిచేయకుండా చేశాడు. ఈ తతంగాన్ని లండన్ నుంచే నడిపించాడు. హైదరాబాద్ మియాపూర్ లో వెలుగు చూసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

    మియాపూర్ గోకుల్ ప్లాట్స్ లో హనుమంతరావు, ఉమామహేశ్వరి దంపతులు నివాసముంటున్నారు. జూలై 5న ఉమామహేశ్వరి అకాస్మాత్తుగా చనిపోయింది. ఆమె అనారోగ్యంతో మృతి చెందిందని అంతా భావించారు. అదే సమయంలో హనుమంతరావు, ఆయన ముగ్గురు పిల్లల కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోయాయి. అయితే ఒక్కసారిగా ఈ రుగ్మత బయటపడడంతో కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. ఆసుపత్రిలో చేరగా.. వైద్య పరీక్షల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. శరీరంలో విష ప్రయోగం చేయడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు నిర్ధారించారు. వెంటనే హనుమంతరావు కుమార్తె డాక్టర్ శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లుడు అజిత్ కుమార్ సూత్రధారి అని తేల్చారు.

    హనుమంతరావు కుమార్తె డాక్టర్ శిరీష కు 2018లో అజిత్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో వివాహం జరిపించారు. ఉద్యోగరీత్యా ఇద్దరూ లండన్ లో స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తె ఉంది. కొంతకాలానికి దంపతులిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో డాక్టర్ శిరీష లండన్ లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.అప్పటినుంచి వారు వేరువేరుగా ఉంటున్నారు.అయితే భార్యపై కోపం పెంచుకున్న అజిత్ కుమార్.. ఆమెతోపాటు కుటుంబ సభ్యులను అంతమొందించడానికి డిసైడ్ అయ్యాడు. తన వద్ద పనిచేసే వినోద్ కుమార్, హైదరాబాదులో ఉన్న స్నేహితులు భవాని శంకర్, అశోక్, గోపీనాథ్, పూర్ణచంద్రరావు తో కలిసి కుట్ర పన్నాడు. అదే సమయంలో సోదరుడి వివాహానికి లండన్ నుంచి డాక్టర్ శిరీష హైదరాబాద్ వచ్చారు. ఆమె కదలికలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని గోకుల్ ప్లాట్స్ వాచ్మెన్ కుమారుడు రమేష్ కు కొంత నగదు ముట్ట చెప్పాడు. జూన్ 25న ముగ్గురు వ్యక్తులతో హత్యాయత్నానికి ప్రయత్నించినా అది విఫలమయ్యింది.

    అయితే ఇక్కడే తమ బుర్రకు పదును పెట్టారు. గుర్తుతెలియని విషమును కలిపిన మసాలాపొడులు , పసుపు, కారంవంటి వాటిని శాంపిల్ ప్యాకెట్లుగా డెలివరీ బాయ్ రూపంలో అందజేశారు. వాటిని వినియోగించడంతో హనుమంతరావు కుటుంబంలో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో ఉమామహేశ్వరి జూలై 5న మృతి చెందారు.శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘా పెట్టారు. అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు గమనించారు. వాచ్మెన్ కుమారుడు రమేష్ వ్యవహార శైలి అనుమానంగా ఉండడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. అటు పూర్ణచంద్రరావు పేరు వెల్లడయ్యింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టే సరికి నిందితుల పేర్లు బయటికి వచ్చాయి. దీనికి సూత్రధారి అల్లుడు అజిత్ కుమార్ అని తేలింది. ఆరుగురిని పోలీసుల అరెస్టు చేశారు. లండన్ లో ఉన్న అజిత్ కుమార్ ను సైతం అరెస్టు చేయనున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.