
Land occupation హైదరాబాదులో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలకు మించిన ధరలు అక్కడ పలుకుతాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆ భూములు బంగారం, ప్లాటినం కంటే ఎక్కువ సమానం. ఇంకేముంది ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే అల్లుడి కన్ను ఆ భూములపై పడ్డది. ఆక్రమణల పర్వం మొదలైంది. అమ్మకాల ప్రక్రియ కూడా షురూ అయింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సదరు ఎమ్మెల్యే అల్లుడు అమ్మిన భూములు ప్రభుత్వానివి. ఒక ఎకరమో, రెండు ఎకరాలో కాదు.. ఏకంగా 50 ఎకరాల భూములకు ఎమ్మెల్యే అల్లుడు టెండర్ పెట్టాడు అంటే ఏ స్థాయిలో అతడు దందా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
అవి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో 50 ఎకరాల దాకా ప్రభుత్వానికి భూములు ఉన్నాయి.. ఆ భూములపై కబ్జాదారుల కన్ను పడింది. ఫోర్జరీ డాక్యుమెంట్లు, తప్పుడు పత్రాలతో సర్వేనంబర్లను ఏమార్చి.. బిట్టుబిట్లుగా 50 ఎకరాల దాకా ప్రభుత్వ భూమిని కొల్లగొట్టారు. ఒకటికాదు.. రెండు కాదు.. సుమారు పది కిలోమీటర్ల పొడవున ఈ కబ్జాలు విస్తరించాయి. నష్టనివారణ చర్యలకు ఉపక్రమించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) అధికారులు అర్ధరాత్రి ‘ఆపరేషన్ శంషాబాద్’ చేపట్టారు. గత సోమవారం అర్ధరాత్రి పోలీసులు, డిమాలిషన్/ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్‌లు, పొక్లెయినర్లు, ఇతర సరంజామాతో రోల్‌కాల్ నిర్వహించారు. ముందుగా నిర్ణయించిన రూట్‌మ్యాప్ ప్రకారం కూల్చివేతలను ప్రారంభించారు. ఏకబిగిన.. మంగళవారం ఉదయానికి పని పూర్తిచేసేశారు.

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సింప్లెక్స్ చౌరస్తా సమీపంలో హెచ్‌ఎండిఏకు 181 ఎకరాల భూమి ఉంది. 1990లో ఆనాటి అవసరాల నిమిత్తం ట్రక్ టెర్మినల్ పార్క్ ఏర్పాటుకు భూసేకరణ ద్వారా 181 ఎకరాలను హెచ్‌ఎండీఏ సమకూర్చుకుంది. 111 జీవో పరిధిలో ఉండడం వల్ల ఈ భూముల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. హెచ్‌ఎండీఏ కూడా ఓ 20 ఎకరాల్లో నర్సరీ నిర్వహణ మినహా.. పెద్దగా భూములను వాడుకోలేదు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వెజ్/నాన్-వెజ్ మార్కెట్ కోసం 2 ఎకరాలు, కొత్తగా ఏర్పాటైన శంషాబాద్ మునిసిపల్ కార్యాలయ నిర్మాణానికి 30 గుంటల భూమిని కేటాయించింది. ఈ స్థలం పోను.. హెచ్‌ఎండీఏకు 178.12 ఎకరాల స్థలం ఉంటుంది. ఇందులో ఓ 50 ఎకరాలను కబ్జా చేసేందుకు అక్రమార్కులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పొంతనలేని సర్వేనంబర్లతో పత్రాలు సృష్టించి, ఈ భూముల్లో పొజిషన్‌కు ప్రయత్నాలు చేశారు. రూ. 1,500 కోట్లు విలువ చేసే 50 ఎకరాల్లో రేకుల షెడ్లు, ప్రీఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలను చేపట్టారు.
సరిగ్గా వారం క్రితం ఆక్రమణలపై ఫిర్యాదు అందుకున్న అధికారులు.. పరిశీలనకు అక్కడికి వెళ్లారు. కబ్జాదారులు సెక్యూరిటీ గార్డులను వారిపైకి ఉసిగొల్పారు. వారు రాళ్లదాడి చేశారు. దాంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. యథేచ్ఛగా కబ్జాలు.. అధికారులపై దాడులను సీరియస్ గా తీసుకున్న హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు, అర్ధరాత్రి ఆపరేషన్ చేపట్టి.. ఆక్రమణలను కూల్చివేశారు. మరోమారు ఈ భూములు కబ్జా కాకుండా.. చుట్టూ ఫెన్సింగ్ వేయనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.

తెర వెనుక ఎమ్మెల్యే అల్లుడు
ఈ కబ్జాల వెనుక ఓ ఎమ్మెల్యే అల్లుడు, ఓ మునిసిపల్ చైర్‌పర్సన్ భర్త, అధికారపార్టీకి చెందిన కొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అల్లుడు తన మామ పలుకుబడిని ఉపయోగించుకుని, ఆక్రమించిన భూములను సక్రమమైనవిగా మార్చాలని ప్లాన్ చేయగా.. మునిసిపల్ చైర్‌పర్సన్ భర్త కూడా అధికారులు తమ గుప్పిట్లో ఉంటారని భావించి, కబ్జాలకు పాల్పడ్డట్లు సమాచారం. పైగా.. అధికార పార్టీ కావడంతో.. ప్రభుత్వ పెద్దల అండ కూడా ఉంటుందని భావించారు. అంతేకాదు.. అక్రమ నిర్మాణాలకు వెనువెంటనే ఇంటి నంబర్లు వచ్చేలా చేశారు. ఇంటి నంబర్ల ఆధారంగా కబ్జాదారులు తాత్కాలిక నిర్మాణాలను సైతం అమ్మకానికి పెట్టినట్లు తెలిసింది.