Smita Sabharwal: స్మితా సబర్వాల్ ఐఏఎస్.. పరిచయం అక్కరలేని పేరు. పదేళ్లుగా సీఎంవోలో కీలక అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు వివిధ జిల్లాల కలెక్టర్‌గా, డేరింగ్ ఆఫీసర్‌గా తెలంగాణ ప్రజలకు సుపరిచితురాలు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక స్మితా సబర్వాల్ పనితీరు మెచ్చి ఆమెను సీఎంవోలోకి తీసుకున్నారు. కీలక బాధ్యతలు అప్పగించారు. మొన్నటి వరకు సీఎంవో కార్యదర్శిగా, నీటిపారుదల శాఖ ఇన్‌చార్జి కార్యదర్శిగా ఉన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులను కూడా పర్యవేక్షించారు.
బీఆర్‌ఎస్ ఓటమితో..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయింది. దీంతో స్మితా సబర్వాల్ పదేళ్ల ఏకఛత్రాధిపత్యానికి చెక్ పడినట్లయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సీఎం రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వివిధ శాఖల్లో ఏళ్లుగా పాతుకుపోయిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను బదిలీ చేశారు. స్మితా సబర్వాల్‌ను ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించారు.
బాధ్యతల స్వీకరణ..
మొన్నటి సీఎంవో కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ఆయనను కనీసం కలవలేదు. దీనిపై కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేంద్ర సర్వీసులకు వెళ్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ, చివరకు మంత్రి సీతక్కను కలిసి తాను స్థానికంగానే ఉంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు. కేంద్ర సర్వీసులకు వెళ్తున్నట్లు జరుగుతున్న పుకార్లను ఖండించారు. ఈ క్రమంలో ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా సోమవారం స్మితా సబర్వాల్ బాధ్యతలు స్వీకరించారు.
ఎమోషనల్ ట్వీట్..
బాధ్యతల స్వీకరణ సందర్భంగా స్మితా సబర్వాల్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది తెలంగాణలో చర్చకు దారితీసింది. ‘‘ మనం అగ్నిలో ఎలా నడుస్తామనే విషయం చాలా ముఖ్యమైనది. తల పైకి ఎత్తి బలంగా నడవాలి’ అని ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. స్మితా సబర్వాల్ ఫ్యాన్స్ ఈ ట్వీట్ చూసి స్పందిస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు మీరు సమర్థవంతమైన అధికారి, ఎక్కడైనా పనిచేయగలరు అని ఒకరు. మీకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయి అని మరొకరు. ఇంకో నెటిజన్ మీరు చెప్పింది నిజమే.. సవాళ్లను సానుకూలంగా మార్చుకుని దృఢంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలి అని కామెంట్ చేశారు. మరికొందరు సీఎంవో వీడినంత మాత్రాన అంత కష్టం ఏమొచ్చింది.. అని ప్రశ్నిస్తున్నారు. ఒకే పోస్టులో ఎన్ని రోజులు ఉంటారు. పదేళ్లు ఉన్నారు సరిపోదా.. పోస్టు మారినంత మాత్రాన కష్టం వచ్చినట్లా అని ప్రశ్నిస్తున్నారు.
What matters most is how we walk through the fire.
Chin up n walk strong
#HappySunday guys! pic.twitter.com/XAUqo8N5nc— Smita Sabharwal (@SmitaSabharwal) January 21, 2024