Smita Sabharwal : కొండపోచమ్మ సాగర్ దగ్గర స్మితా సబర్వాల్.. ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

కొండపోచమ్మ సాగర్ నిర్మించిండు.. రేవంత్ రెడ్డి అనవసరంగా బద్నాం చేస్తున్నాడు అని స్మిత సబర్వాల్ ఉద్దేశమా? ఏమో లోగుట్టు "రీల్" కు ఎరుక!

Written By: Anabothula Bhaskar, Updated On : January 14, 2024 6:45 pm
Follow us on

Smita Sabharwal : కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఆమె ఒక వెలుగు వెలిగింది. ముఖ్యమంత్రి కార్యదర్శిగా, మిషన్ భగీరథ ఇన్ ఛార్జ్ అధికారిగా కొనసాగింది. మిషన్ భగీరథ పనులను ఆమె స్వయంగా పరిశీలించింది. అంతేకాదు ముఖ్యమంత్రి కార్యదర్శి హోదాలో ప్రియాంక వర్గీస్ అనే అధికారిని వెంటబెట్టుకొని సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ వంటి ఎత్తిపోతల పథకాలను కూడా ఆమె పలుమార్లు పర్యవేక్షించింది. అంతేకాదు సీఎం సొంత జిల్లా మెదక్ లో నిర్మించే పలు పథకాలను కూడా ఆమె పరిశీలించింది. సాధారణంగా ముఖ్యమంత్రి కార్యదర్శి హోదాలో ఉండే అధికారులు ఎక్కువగా సెక్రటేరియట్ లోనే ఉంటారు. ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. కానీ అప్పట్లో కెసిఆర్ ఆమెకు అపరిమితమైన స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి అంతకుమించి అనేలాగా పని చేసింది. నెక్స్ట్ టు సీఎం అనే విధంగా తన పరిధిని పెంచుకుంది. అంతేకాదు “రీల్స్ ఐఏఎస్ ఆఫీసర్ ” అనే విమర్శలు కూడా మూట కట్టుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.. స్మితా సబర్వాల్. మన ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె పేరు చెప్పుకుంటూనే హావా భావాలు ప్రదర్శించారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె గత సెక్రటేరియట్ లో ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుందో. రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వివిధ శాఖలపై నిర్వహించిన సమీక్షలకు స్మిత సబర్వాల్ హాజరు కాలేదు. కనీసం ముఖ్యమంత్రిని గౌరవప్రదంగా కూడా కలవలేదు. చివరికి ఆ మధ్య మినిస్టర్ సీతక్క తో మాట్లాడుకుంటూ స్మిత ఆటిట్యూడ్ ప్రదర్శించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.. అటువంటి అధికారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన పెట్టారు.

కెసిఆర్ ప్రభుత్వంలో బీభత్సమైన వెలుగు వెలిగిన స్మితా సబర్వాల్ ను దాదాపు పక్కన పెట్టారు. అంటే నామ మాత్రమైన పోస్టులోకి ఆమెను పంపించారు. అంతేకాదు ఆమె ముఖ్యమంత్రి కార్యదర్శి హోదాలో ఉన్నప్పుడు చేసిన పనులు, గతంలో ఒక మ్యాగజిన్ పై పరువు నష్టం దావా వేసిన కేసులో ప్రభుత్వం ఆమె తరఫున చెల్లించిన కోర్టు ఫీజులు.. ఇవన్నీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వుతున్నది. అయితే ఇప్పటికే పలు శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం.. స్మితా సబర్వాల్ పర్యవేక్షించిన మిషన్ భగీరథ, ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాలపై కూడా దృష్టి సారించి..వాటిపై కూడా శ్వేత పత్రాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరుణంలో స్మిత సబర్వాల్ కేంద్ర సర్వీసులోకి వెళ్తారని ప్రచారం జరిగింది.. పైగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది రోజులపాటు ఆమె పెద్దగా యాక్టివ్ గా లేరు. ఆ తర్వాత ఆమె సెక్రటేరియట్ కు వెళ్లడం ప్రారంభించారు. కానీ రేవంత్ రెడ్డిని ఆమె కలవలేదు. ధనసరి సీతక్క మంత్రిగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో మాత్రం స్మితా సబర్వాల్ పాల్గొన్నారు. రేవంత్ ప్రభుత్వం అప్రాధాన్య పోస్టులోకి పంపించడంతో ప్రస్తుతం ఆమెకు పెద్దగా పని లేనట్టుంది.. అందుకే తనకు అలవాటయిన రీల్స్ చేస్తోందనే గుస గుసలు వినిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా ఉన్నప్పుడు కూడా స్మితా సబర్వాల్ తెగ రీల్స్ చేసే వారు. పైగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో నిర్మించిన పథకాలను ప్రమోట్ చేసే విధంగా ఆమె రీల్స్ ఉండేవనే ఆరోపణలు ఉన్నాయి. నూతన సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల జ్యోతి వంటివి ప్రతిబింబించే విధంగా ఆమె రీల్స్ చేసేవారు. షాపింగ్ కు వెళ్ళినప్పుడు కూడా రీల్స్ ను చేయకుండా ఉండేవారు కాదనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఒక అధికారి.. అందులోనూ కీలక పదవిలో ఉన్న అధికారి అలా రీల్స్ చేయడం పట్ల అప్పట్లో విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్న నేపథ్యంలో ఆమె ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. తాజాగా ఫేస్ బుక్ లో స్మిత సబర్వాల్ ఆఫీషియల్ పేజీ లో ఓ రీల్ చక్కర్లు కొడుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన కొండ పోచమ్మ సాగర్ ను స్మిత సబర్వాల్ ఇటీవల సందర్శించినట్టున్నారు.. ఆ ప్రాజెక్టు మొత్తం కనిపించే విధంగా రీల్స్ చేశారు.. అక్కడ ఆమె కూర్చున్న దృశ్యాలు, నడిచిన దృశ్యాలు, ఇంక చాలా ఆ రీల్ కనిపిస్తున్నాయి. ఇందులో తప్పుపట్టడానికి ఏమీ లేదు కానీ.. కొండపోచమ్మ సాగర్ ఉనికికి కారణమైన కాలేశ్వరం ఎత్తిపోతల పథకం లో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడటం.. మేడిగడ్డ కుంగిపోవడం.. అన్నారం బ్యారేజ్ లో ఇసుక మేటలు ఏర్పడటం.. ఎత్తిపోతల పథకమే లోపాల పుట్ట మంత్రులు ప్రకటించడం.. వంటి పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో స్మిత సబర్వాల్ కొండపోచమ్మ సాగర్ ను సందర్శించడం.. దాన్ని రీల్ లాగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంటే మా కేసీఆర్ సార్ గొప్పోడు.. తెలంగాణకు నీళ్లు తెచ్చిండు.. కొండపోచమ్మ సాగర్ నిర్మించిండు.. రేవంత్ రెడ్డి అనవసరంగా బద్నాం చేస్తున్నాడు అని స్మిత సబర్వాల్ ఉద్దేశమా? ఏమో లోగుట్టు “రీల్” కు ఎరుక!