Slumdog Husband Review: నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావ్ హీరోగా రెండో ప్రయత్నం స్లమ్ డాగ్ హస్బెండ్. గతంలో సంజయ్ రావ్ ఓ పిట్ట కథ చిత్రంలో నటించారు. ఈసారి వైవిధ్యంతో కూడిన బోల్డ్ కంటెంట్ ఎంచుకున్నాడు. ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటించగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. జులై 29న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..
కథ:
లక్షణ్(సంజయ్ రావ్) మౌనిక ప్రేమించుకుంటారు. వయసులో ఉన్న ఈ జంట ఫోన్లోనే సంభాషణలతో శృంగారం చేస్తుంటారు. సందు దొరికితే సరసమాడాలనుకునే ఈ ప్రేమజంట పెళ్ళికి సిద్ధం అవుతారు. పెద్దలు కూడా అంగీకారం తెలుపుతారు. అయితే వీరి పెళ్ళికి ఒక చిక్కొచ్చిపడుతుంది. ఇద్దరి పుట్టినరోజులు తెలియవు. కాబట్టి వారి జాతకాలు ఏంటి? అవి కలుస్తాయా లేదా? అనే సందేహం కలుగుతుంది. ఒకవేళ జాతకాలు కలవకుండా పెళ్లి చేసుకుంటే పెద్దలు మరణించే ప్రమాదం ఉందని చెబుతారు. దీనికి పరిహారంగా ముందు చెట్టునో, జంతువునో పెళ్లి చేసుకోండి. తర్వాత మీరు పెళ్లి చేసుకోండని పండితులు సలహా ఇస్తారు.
దాంతో లక్ష్మణ్ ఓ కుక్కను వివాహం చేసుకుంటాడు. అయితే ఆ కుక్క ఓనర్ లక్ష్మణ్ కి ఎదురు తిరుగుతాడు. తన కుక్కను వదిలేసి వేరే వివాహం చట్టరీత్యా నేరమని కేసు వేస్తాడు. దాంతో లక్ష్మణ్, మౌనికల పెళ్లి ఆగిపోతుంది. మరి కుక్కను చేసుకున్న లక్ష్మణ్ పరిస్థితి ఏంటీ? దాన్ని ఎలా వదిలించుకున్నాడు? లక్ష్మణ్, మౌనికల పెళ్లి జరిగిందా లేదా? అనేది కథ…
విశ్లేషణ:
ఓ సిల్లీ పాయింట్ చుట్టూ కథ అల్లుకుని నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు దర్శకులు. జాతిరత్నాలు మూవీ సక్సెస్ ఇందుకు ఒక ఉదాహరణ. ఆ మూవీలో చెప్పడానికి కథ అంటూ ఏమీ ఉండదు. ముగ్గురు పనిలేని కుర్రాళ్ళు, వాళ్ళ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే జాతిరత్నాలు మూవీ. స్లమ్ డాగ్ హస్బెండ్ ఇదే ఫార్మాట్ లో తెరకెక్కించారనిపిస్తుంది.
కుక్కను పెళ్లి చేసుకున్న హీరోకి లీగల్ ప్రాబ్లెమ్స్ తలెత్తుతాయి. ఆ కుక్కను వదిలించుకోవడం అంత ఈజీ కాదని తేలిపోతుంది. ఈ క్రమంలో హీరో పడే హైరానాను కామిక్ గా చెప్పే ప్రయత్నం చేశారు. హీరో హీరోయిన్ మధ్య ఫోన్ సంభాషణలు ఈ తరం యూత్ కి కనెక్ట్ అవుతాయి. చెప్పాలంటే ఇది చాలా మంది ప్రేమికులు చేసే పనే.
దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు, సంభాషణలు కొంత మేర నవ్విస్తాయి. సప్తగిరి, బ్రహ్మాజీ మధ్య నడిచే కోర్ట్ సన్నివేశాలు కూడా పర్లేదు. కుక్కను పెళ్లి చేసుకోవడం దాని వలన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవడం అనేది గతంలో ఎక్కడా టచ్ చేయని సబ్జెక్టు. అక్కడక్కడా కామెడీ వర్క్ అవుట్ అయింది.
నటుడిగా సంజయ్ రావ్ కి పాస్ మార్క్స్ పడతాయి. హీరోయిన్ ప్రణవి మానుకొండ ఆడియన్స్ ని తన నటనతో కట్టిపడేసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్లేదు. అయితే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇష్టపడే అంశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో కామెడీ పండలేదు. దర్శకుడు దీనిపై ఇంకా వర్క్ చేసి ఉంటే బాగుండేది. అలాగే లాజిక్ లెస్ సీన్స్ ఎక్కువైపోయాయి. కుక్క కోసం ఓనర్ కోర్టుకు ఎక్కడం వాస్తవికతకు దూరం. కామెడీ వర్క్ అవుట్ అవని చోట సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి సన్నివేశాలు.
ప్లస్ పాయింట్స్ :
హీరోయిన్ నటన
అక్కడక్కడా మెప్పించే కామెడీ
ఎంచుకున్న పాయింట్
మైనస్ పాయింట్:
సిల్లీ సీన్స్
లాజిక్ మిస్ కావడం
పూర్తి స్థాయిలో కామెడీ పండకపోవడం
రేటింగ్:2.5/ 5
సినిమా చూడాలా వద్దా?: దర్శకుడు కామెడీ పంచడంలో కొంత మేర సక్సెస్ అయ్యాడు. కామెడీ చిత్రాలను ఇష్టపడే ఓ వర్గం ఆడియన్స్ కి నచ్చుతుంది. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టునే చిత్రం కాదు.