Land Issue : మొన్నటి దాకా దేశంలో చక్రాలు తిప్పుతామని కేసీఆర్ భీషణ ప్రతిజ్ఞలు చేసేవారు. సర్కారు సొమ్ముతో చెక్కులు, ఇతరత్రా సొంత కార్యాలు చక్కపెట్టుకునేవారు. తర్వాత ఏమైందో తెలియదు గాని ఒక్కసారిగా ఆయన మనసు మహారాష్ట్ర వైపు మళ్లింది. ఎంతలా అంటే ఏకంగా అక్కడ మూడు సభలు నిర్వహించేంత.. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేంత.. కేసీఆర్ మహా మోజు ఇక్కడితో తీర లేదు. అది ఏకంగా వందల ఎకరాల భూములు కట్టటెట్టేంత వరకూ వెళ్లింది. హైకోర్టు మొట్టికాయలు వేస్తోంది. ఏంటి ఈ భూ తంత్రమని? వెంటనే ఈ భూ సంతర్పణను ఆపేయాలని హుకుం జారీ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. పైగా అనుయాయులకు భారీగా భూములు కట్టబెడుతోంది. నిన్నా మొన్నటి వరకూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఈ తరహా ఆరోపణ లుండేవి. అయితే తాజాగా హైదరాబాద్- విజయవాడ ప్రధాన రహదారి పక్కన తూప్రాన్‌పేట్- చౌటుప్పల్ మధ్య కాందిశీకులకు చెందిన 401 ఎకరాల భూమికి ఎసరు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో దాని విలువ రూ.600 కోట్ల పైనే. ఈ భూములకు సంబంధించి మేమే వారసు లమంటూ 70 ఏళ్ల తర్వాత మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తులు రావడం.. వారికి అడ్డగోలుగా కట్టబెట్టేందుకు అధికారులు పోటీ పడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విషయంలో ఓ మంత్రి, ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
కాందిశీకుల భూమికి స్కెచ్
విజయవాడ హైవే మీద చౌటుప్పల్ వద్ద టీఎ్‌స ఐఐసీ 400 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసింది. దీనిని ఆనుకునే కాందిశీకుల భూమి ఉంది. దీని విస్తీర్ణం 401 ఎకరాలు. అయితే మొదటి నుంచీ ఈ భూమి వివాదాల్లో ఉంది. ఈ వివాదాస్పద భూమిని కాజేసేందుకు అధికార పార్టీ నేతలు తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టీఎ్‌స ఐఐసీ ఏర్పాటు చేసిన పారిశ్రామిక పార్కులో ఇప్పటికే పలు పరిశ్రమలు వచ్చాయి. చుట్టూ రియల్ ఎస్టేట్ విస్తరించింది. 401 ఎకరాల్లో విస్తరించి ఉన్న కాందిశీకుల భూమి మొత్తం కొండలు గుట్టలే అయినప్పటికీ అధికార పార్టీ నేతలు దీని మీదక కన్ను వేశారు. అయితే ఈ భూమికి కాజేసేందుకు ఎక్కడో ఉన్న వారసులను తెర మీదకు తెచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి ద్వారానే కథను నడిపిస్తున్నారని తెలుస్తోంది. టీఎస్ ఐఐసీ ఏర్పాటు చేసిన పారిశ్రామిక పార్కు కోసం సేకరించిన భూములకే రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.65 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. ఇప్పుడు చుట్టుపక్కల భూములు కనీసం ఎకరా రూ.కోటిన్నర పలుకుతున్నాయి.
నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఒత్తిడి
వాస్తవానికి ఈ ప్రాంతంలో ఉన్న కాందిశీకుల భూమి వాస్తవ విస్తీర్ణం 401 ఎకరాలు. ఆ భూమి దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన మీర్జ్ మక్సూద్ అలీఖాన్‌దని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ పరిధిలో ఈ భూమి ఉంది. పాకిస్థాన్‌ను వదిలిపోయిన వారి భూములను అక్కడి ప్రభుత్వం భారత్ నుంచి వలస వచ్చిన వాళ్లకు కేటాయించింది. భారత్‌ను వదిలిపోయిన వారి భూములను పాకిస్థాన్ నుంచి వచ్చిన కాందిశీకులకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 1950లో కాందిశీకుల ఆస్తి చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం కింద అలీఖాన్ వదిలి వెళ్లిన భూముల్లో 401 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన రెండు కుటుంబాలకు 1952లో కేటాయించింది. ఆ రెండు కుటుంబాలు మహారాష్ట్రలోని కొల్హాపూర్, కల్యాణ్ ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. కల్యాణ్‌లో ఉంటున్న రాధాబాయి కుటుంబానికి 141 ఎకరాలు, కొల్హాపూర్‌లో ఉంటున్న తహిల్మిల్ కుటుంబానికి 260 ఎకరాల భూమిని కేంద్రం కేటాయించింది. అలీఖాన్ భూములు మొత్తం కొండలూ గుట్టలు కావడంతో ఆ రెండు కుటుంబాలు హైదరాబాద్‌కు వచ్చి ఆ కొండల్లో తమ భూములకు హద్దులు పెట్టించుకొనేందుకు ఆసక్తి చూపలేదు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తమ బాధ్యతగా వారి పేర్లను 401 ఎకరాలకు రికార్డుల్లో ఎక్కించేశారు. ఈ 70 ఏళ్లుగా ఆ కుటుంబాల నుంచి ఈ భూములు మావి అని వచ్చిన వారు లేరు. కనీసం ఒక రూపాయి భూమి శిస్తూ చెల్లించలేదు.
ఆ తర్వాత కథ మారింది
కాందిశీకుల ఆస్తుల చట్టం 1950లో వచ్చింది. ఆ తర్వాత వ్యవసాయ భూ గరిష్ఠ పరిమితి చట్టం 1975లో అమల్లోకి వచ్చింది. రెండు కుటుంబాలకు ఈ చట్టం వర్తింపజేస్తే 141 ఎకరాలు, 260 ఎకరాల చొప్పున ఇచ్చిన భూమిలో 1975 నాటికి ఉన్న వారసుల సంఖ్యను బట్టి వందల ఎకరాలు భూగరిష్ఠ పరిమితి చట్టం కింద తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం ఆ చట్టం కింద పోగా మిగిలింది మాకు అప్పగించాలని అడిగిన వారు కూడా లేరు. ఈ నేపథ్యంలో ఆ భూముల్ని రక్షించే క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఈ భూముల సర్వే నంబర్లను ఎవరికీ రిజిస్ట్రేషన్ చేసేందుకు వీల్లేకుండా నిషేధిత జాబితాలోకి చేర్చాయి. ఇప్పుడు ఈ భూముల్ని స్వాహా చేయడానికి ఇదే పెద్ద అడ్డంకిగా మారింది. తాజాగా పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన ఆ రెండు కుటుంబాలకు తామే వారసులమంటూ కొందరు వ్యక్తులు అధికారులను ఆశ్రయించారు. వారు అసలైన వారసులా? కాదా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. వారసులు నిజమో కాదో తేల్చమంటూ యాదాద్రి కలెక్టరు మహారాష్ట్రకు చెందిన అక్కడి కలెక్టర్లు ఇద్దరికీ లేఖ రాయగా, ఇంకా సమాధానం రాలేదు. ఈ లోగా ఆ 401 ఎకరాలను నిషేధిత జాబితాలోంచి తొలగించాలంటూ కలెక్టర్‌పై కొందరు అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.
తహసీల్దార్ తేల్చేశారు
అలీఖాన్ భూములను 1951 జూలై 30న కాందిశీకుల భూమిగా ప్రకటించారు. భారత పునరావాస మంత్రిత్వ శాఖ అందులో 401 ఎకరాల భూమిని 1954లో రెండు కాందిశీక కుటుంబాలకు కేటాయించింది. సర్వే నంబరు 115, 123, 137, 141, 267లో 141.14 ఎకరాలు కల్యాణ్‌కు చెందిన రాధాభాయికి కేటాయించింది. సర్వే నంబరు 114లో 260.12 ఎకరాలను కొల్హాపూర్‌కు చెందిన తహిల్మిల్‌కు కేటాయించింది. అప్పటి నుంచి రెవెన్యూ అధికారులు వారి పేర్లను రెవెన్యూ రికార్డుల్లో అప్‌డేట్ చేస్తూ వచ్చారు. 1955-58 నాటి చెస్సాల పహాణీలోని పట్టేదార్ యజమాని కాలంలో వారి పేర్లు నమోదు చేశారు. తాజాగా వచ్చిన ధరణి రికార్డుల వరకు వారి పేర్లే నమోదవుతూ వచ్చాయి. వాళ్లిద్దరూ ఎన్నడూ ఈ భూముల దగ్గరకు రాలేదు. భూమి శిస్తు చెల్లించలేదు. స్వాధీనమూ చేసుకోలేదు. అనంతర కాలంలో వాళిద్దరూ చనిపోయారు. ఇటీవల వారసులమని వచ్చిన వ్యక్తులు ఆ భూమిని వేరే వాళ్లకు కట్టబెట్టేందుకు వీలుగా ఒప్పందం చేసుకొని, దాన్ని రిజిస్టర్ కూడా చేశామని చెబుతున్నారు. తాము రాఽధాబాయి వారసులమని కల్యాణ్ ప్రాంత కోర్టు నుంచి, తహిల్మిల్ వారసులమని కొల్హాపూర్ కోర్టు నుంచి ధ్రువీకరణ ఆదేశాలు తీసుకొచ్చారు. తమకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని, ఫౌతి (వారసత్వ నమోదు) అమలు చేయాలని చౌటుప్పల్ మండల తహసీల్దారును కోరారు. కోర్టు ఆదేశాలు నిజమైనవా? కాదా? అన్నది తేల్చేందుకు యాదాద్రి కలెక్టర్ 2019 ఫిబ్రవరిలో కళ్యాణ్, కొల్హాపూర్ కలెక్టర్లకు లేఖ రాశారు. ఇప్పటికీ ఆ లేఖకు సమాధానం రాలేదు. దీంతో వచ్చిన వారు రాధాబాయి, తహిల్మిల్ వారసులేనా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఈసారి కలెక్టర్‌తో సంబంధం లేకుండా ఈ ధ్రువ పత్రాలు సరైనవేనని చౌటుప్పల్ తహసీల్దార్ తేల్చేయడం విశేషం.