https://oktelugu.com/

Singareni History : బొగ్గు నుంచి బుగ్గ దాక.. సిరుల మాగాణి సింగరేణి

సింగరేణి కార్మికులు వెలికి తీసిన బొగ్గుతో.. ఇళ్లలో బుగ్గలు వెలుగుతుండడంతో బొగ్గును నల్ల బంగారంగా, సింగరేణి కార్మికులను నల్ల సూర్యులుగా పిలుస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2023 / 10:36 AM IST
    Follow us on

    Singareni History : సింగరేణి.. నల్ల బంగారు గని.. తెలంగాణలో ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థ, అధిక లాభాలు గడిస్తున్న ఏకైక ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి. ప్రకృతికి విరుద్ధంగా, ప్రాణాలు ఫణంగా పెట్టి.. భూమి పొరలను చీల్చుకుంటూ.. నల్లబంగారం వెలికి తీస్తున్నారు నల్ల సూరీలు. తెలంగాణతోపాటు అనేక రాష్ట్రాలకు సింగరేణి నల్లబంగారమే వెలుగులు పంచుతోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సంస్థ విస్తరించి ఉన్న సింగరేణి.. డిసెంబర్‌ 23న సింగరేణి 153వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా శతాబ్దంనరకు పైగా చరిత్ర గల సింగరేణి నాడు కఠిన పరిస్థితుల నుంచి నేడు యాంత్రీకరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వరకు, భూగర్భ గనుల నుంచి ఓపెన్ కాస్టుల దాకా ఎలా మారింది.. భూగర్భం నుంచి బొగ్గు మన ఇంటి కరెంటు బుగ్గలో వెలుగై ఎలా ప్రజ్వరిల్లుతుంది అనే వివరాలు తెలుసుకుందాం.

    బొగ్గుట్టటలో మొదలై..
    బొగ్గుబాబుల ప్రస్థానం ఉమ్మడి ఖమ్మం జిల్లా బొగ్గుట్టలో మొదలైంది. నేడు ఎన్నో రాష్ట్రాలకు వెలుగులు అందిస్తున్న సంస్థ.. నాడు ఎన్నో కఠిన పరిస్థితులను, ప్రమాదాలను ఎదుర్కొంది. గతంలో భద్రాచలం పుణ్యాక్షేత్రానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కాలి నడక, ఎడ్లబండ్ల మీద ప్రయాణం సాగించేవారు. అప్పుడు అంతా దట్టమైన అడవే. మార్గమధ్యంలో భక్త బృందాలు విశ్రాంతి తీసుకునేవారు. ఇల్లెందు అటవీ ప్రాంత సమీపంలో విశ్రాంతి తీసుకుంటూ, వంట చేసుకుంటున్న ఓ బృందానికి రాళ్లు మండు తూ కనిపించాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న సమీప క్రిస్టియన్‌ మిషనరీ బ్రిటీష్‌ అధికారులకు సమాచారం అందిం చింది. రంగంలో దిగిన నాటి బ్రిటీష్‌ ఇంజినీర్‌ విలియమ్స్‌ కింగ్‌ 1871లో బొగ్గు అన్వేషణ ప్రారంభించారు. 20 ఏళ్ల సుదీర్ఘ పరిశోధన అనంతరం 1889లో ఆయన కృషి ఫలించింది. తొలిసారిగా ఇల్లెందులో బొగ్గును బయటకు తీసి చరిత్ర సృష్టించారు. ఈ కారణంగా ఇల్లెందు(బొగ్గుట్ట)లో బొగ్గు తవ్వకాలు చేపట్టారు.

    దక్కన్‌ కంపెనీగా..
    మొట్టమొదటగా దీనికి దక్కన్‌ కంపెనీగా పేరు నమోదు చేసి ఇంగ్లాండ్‌లో కేంద్ర కార్యాలయాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత 1921లో దక్కన్‌ కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని మద్రాస్‌కు తరలించారు. దీనికే సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌గా నామకరణం చేశారు.

    గోదావరి లోయలో అపార నిల్వలు..
    ఇలా స్థాపించబడిన సింగరేణి కాలరీస్‌ కంపెనీ దినదినాభివృద్ధి చెందుతూ 1927 నాటికి ఆదిలాబాద్‌ జిల్లాకు విస్తరించింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని తాండూరు వద్ద ప్రప్రథమంగా బొగ్గు త్రవ్వకం ప్రారంభమైంది. ఆ తర్వాత అపారమైన బొగ్గు నిల్వలు ఉన్న గోదావరి లోయ ప్రాంతాన్ని డాక్టర్‌ విలయమ్స్‌ కింగ్‌ ఒక పంటగా రూపొందించారు. సుమారు 350 కిలోమీటర్ల ప్రాంతం వరకు బొగ్గు నిల్వలు విస్తరించి ఉన్నట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాలలో బొగ్గు విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ఉభయగోదావరి జిల్లాలోనూ బొగ్గు వ్యాపించి ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీ జిల్లాలన్నింటితో కలిపి 4 వేల మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిల్వలు ఉన్నట్లు అం చనా వేశారు. సింగరేణి చేపట్టిన సర్వేలో 9300 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉన్నట్లు గుర్తించారు. అయితే 153 ఏళ్లలో సింగరేణి వెలికి తీసిన బొగ్గు 2400 మిలియన్‌ టన్నులు మాత్రమే.

    నాడు కిరోసిన్‌ దీపాలే దిక్కు..
    బొగ్గు గనులు ఆవిర్భవించిన తరువాత సుమారు 45 ఏళ్లపాటు బావుల్లో నీరు, గాలి, వెలుతురు వంటి కనీస సౌకర్యాలు లేవు. చీకటి గుహల్లో ప్రాణానికి కనీస రక్షణ, భద్రత లేకుండా కార్మికులు పనిచేసేవారు. 1936లో కొత్తగూడెంలోని బర్టీఫిట్, అండ్రూస్‌ నంబర్‌.1 ఇంక్లయిన్, అండ్రూస్‌ నంబర్‌ 2 ఇంక్లయిన్‌ బావులలో బొగ్గు తవ్వకం ప్రారంభమైంది. అప్పుడు ఇల్లెందులో పనిచేసే కార్మికులందరినీ కాంట్రాక్టర్లతో సహా కొత్తగూడెం తరలించారు. నాడు కిరోసిన్‌తో వెలిగే దీపాలే కార్మికులకు దిక్కు. బావుల్లో విపరీతమైన పొగ, వేడి ఉండేవి. గాలి, వెలుతురు, నీరు మచ్చుకైన కానరాకపోయేవి. బావుల్లో ఊటల ద్వారా వచ్చే నీటిని కార్మికులు తాగేవారు. రక్షణ సదుపాయాలు అసలే ఉండేవి కావు. కార్మికుడు బావిలో పనిలో వెళ్తే తిరిగి బయటికి వచ్చేవరకు ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉండేది. చేసే పనికి భద్రత లేదన్న భయంతోపాటు కష్టానికి ఇచ్చే బేడాపావులా చాలీచాలక దుర్భర జీవితాన్ని గడిపేవారు. అప్పుడు దినసరి కూలీ బేడా, మూణాల, పావలా, అరణాలు ఉండేవి. కాంట్రాక్టర్ల దోపిడీ, దౌర్జన్యం నరకయాతనగా ఉండేది. కార్మికులు పారిపోకుండా రైల్వే స్టేషన్ల వద్ద కాంట్రాక్టర్లు కాపలా ఉండేవారు. ఎవరైనా పారిపోయేందుకు ప్రయత్నించినా, ఎదురు తిరిగినా చిత్రహింసలకు గురిచేసేవారు.

    నేడు కొలువు కోసం బారులు..
    నాడు సింగరేణి ఉద్యోగం అంటే భయపడిన పరిస్థితుల నుంచి నేడు సింగరేణి కొలువు కోసం క్యూకట్టే పరిస్థితి ఏర్పడింది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాలు తగ్గుతూ వచ్చాయి. ప్రమాదాల నియంత్రణకు సంస్థ తీసుకుంటున్న చర్యలు ఫలించాయి. ఇక గతంలో తరచూ సమ్మెలతో కార్మికులకు వచ్చే వేతనాలు కూడా తక్కువగా ఉండేవి. నేడు సకల సౌకర్యాలతోపాటు కార్పొరేట్‌ స్థాయి వేతనాలు అందుతున్నాయి. ఇక బావుల్లో దిగేందుకు గతంలో నడిచి వెళ్లేవారు. నేడు మ్యాన్‌రైడింగ్‌ టెక్నాలజీ తీసుకొచ్చారు. నాడు మనుషులు తవ్వే బొగ్గును నేడు యంత్రాలే తవ్వుతున్నాయి. ఇలా ప్రతీ అంశంలోనూ సంస్థ విశేషమైన పురోగతి సాధించింది.

    ఇల్లెందులో పెనుప్రమాదం
    ఇల్లెందు స్ట్రట్‌ఫిట్‌ గనిలో 1938, 12 మార్చిన మొహర్రం పండుగ రోజు గ్యాస్‌ ప్రమాదం సంభవించింది. ఆ సమయం లో ముగ్గురు తెల్లదొరలతో సహా వందలాది మంది కార్మికులు మరణించారు. ఈ కారణంగా 30కి పైగా బావులు నిలుపుదల చేశారు. ఉప్పాలాల్‌పాసీ అనే కార్మికుడి నేతృత్వంలో నాడు 8 రోజుల సమ్మె జరిగింది. ప్రతిఫలంగా వరంగల్‌ జిల్లా నుంచి ఉప్పాలాల్‌పాసీని బ్రిటీష్‌ అధికారులు, నిజాం నవాబ్‌ ప్రవేయంతో బహిష్కరించారు. ఈ ఘటనలు సింగరేణిలో మరిచిపోలేని సంఘటనలుగా గుర్తుండిపోయాయి. అప్పటి నుంచి ఇల్లెందు ఏరియాలో ప్రతీ శుక్రవారం కార్మికులకు సెలవు దినంగా ప్రకటిస్తూ వచ్చారు. ఇటీవలే దానిని ఆదివారానికి మార్చారు.

    వేతనాల పెరుగుదల
    బేడా, మూణాల, పావలా,అరణాల కూలి జీవితంతో సింగరేణి కార్మికులు దుర్భర జీవితాన్ని గడిపేవారు. కార్మిక వర్గానికి కంపెనీ ద్వారా బియ్యం, గోధుమలు, జొన్నలు, పప్పుదినుసులు, తదితర నిత్యావసర వస్తువులను రేషన్‌గా ఇప్పించేవారు. 1946లో రేగా కమిటీ ద్వారా రోజుకు ఒక్క రూపాయి వేతనం పెరిగింది. 1949లో జాదవ్‌ కమిటీ ద్వారా రోజుకు రూ. 3 వేతనం పెరిగింది. 1956లో ముజుందార్‌ అవార్డు ద్వారా రోజుకు రూ. 5 కంపెనీ చెల్లించింది. 1959 లో లేబర్‌ అపీలియట్‌ ట్రిబ్యునల్‌ ద్వారా రోజుకు రూ.10లు వేతనం పెరిగింది. 1961లో దాస్‌ గుప్తా అవార్డు ద్వారా ఇండ్లు, కరంట్, నీటి సౌకర్యాలు, వెల్ఫేర్, క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి.

    నేడు తెలంగాణ తలమానికంగా..
    ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కుటుంబాలకు అండగా నిలు స్తున్న సింగరేణి నేడు తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా మారింది. సింగరేణి చరిత్రలో మొదట 60 ఏండ్లు 60 మీటర్ల లోతు మేరకే బొగ్గు తవ్వకాలు జరిగాయి. ప్రస్తుతం 700 మీటర్ల లోతు నుంచి బొగ్గు వెలికి తీస్తున్నారు. బొగ్గు ఆధారంగా నడిచే విద్యుత్, సిమెంట్, ఎరువులు తదితర పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. సాధారణ గ్రామాలుగా ఉన్న గోదావరిఖని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీ రాంపూర్‌ నేడు పారిశ్రామిక పట్టణాలుగా ఆవిర్భవించాయి. సింగరేణి బొగ్గు పక్క రాష్ట్రాలతో పాటు ప్రపంచం నలుమూలలకు ఎగుమతి చేయడం ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతున్నది.

    విద్యుత్‌ ఉత్పత్తిలో కీలకం..
    సింగరేణి కార్మికులు ప్రకృతికి విరుద్ధగా శ్రమిస్తూ వెలికి తీస్తున్న బొగ్గు.. 80 శాతం విద్యుత్‌ సంస్థలకే సరఫరా అవుతోంది. తెలంగాణలోని ట్రాన్స్‌కో, జెన్‌కోతోపాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్‌ సంస్థలకు సింగరేణి బొగ్గు సరఫరా అవుతోంది. విద్యుత్‌ సంస్థల్లో బొగ్గును మండించి, నీటి ఆవిరిని ఉత్పత్తి చేసి.. దాని నుంచి కరెంటు పుట్టిస్తున్నారు. ఇలా పుట్టిన కరెంటు పవర్‌ గ్రిడ్‌కు అనుసంధానం చేసి సంస్థలు, ఫ్యాక్టరీలు, ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. సింగరేణి కార్మికులు వెలికి తీసిన బొగ్గుతో.. ఇళ్లలో బుగ్గలు వెలుగుతుండడంతో బొగ్గును నల్ల బంగారంగా, సింగరేణి కార్మికులను నల్ల సూర్యులుగా పిలుస్తున్నారు.