https://oktelugu.com/

ABN RK – Sharmila : జగన్ కు పోటీగా షర్మిల.. కాంగ్రెస్ ప్లాన్ బయటపెట్టిన ఆర్కే

జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పాదాలకు బలపం కట్టుకొని తిరిగిన షర్మిలకు.. జగన్ పెద్దగా చేసింది ఏమీ లేదని రాధాకృష్ణ రాసుకొచ్చారు.

Written By:
  • Rocky
  • , Updated On : August 13, 2023 / 12:06 PM IST
    Follow us on

    ABN RK – Sharmila : మొత్తానికి రాధాకృష్ణ చెప్పేశాడు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియమితురాలు అయిపోతుందని ఆయన స్పష్టం చేశాడు. తన అన్న జగన్ తో విభేదించిన తర్వాత, ఆయన తన గన్ మెన్లను తొలగించిన తర్వాత, తన వ్యాపారాల మీద దెబ్బకొట్టిన తర్వాత.. షర్మిల కోపంతో రగిలిపోతున్నారు. తను పార్టీ పెట్టుకున్నప్పటికీ ఫండ్స్ రానీయకపోవడంతో జగన్ మీద ఫైర్ అవుతున్నారు. అందుకే తాను స్థాపించిన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారు. త్వరలో ఆ పార్టీకి అధ్యక్షురాలు కాబోతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురిగా తనను తాను ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారు.. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఇక కష్ట కాలమే.. ఇదీ ఈరోజు రాసిన కొత్త పలుకులో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ రాసిన మాటలు.

    వాస్తవానికి ఇందులో కొత్తదనం ఏదీ లేకపోయినప్పటికీ గతంలో జగన్మోహన్ రెడ్డి తనతో చెప్పిన కొన్ని కీలక రహస్యాల గుట్టు మట్లు మొత్తం షర్మిల బయటి సమాజానికి చెబుతారని రాధాకృష్ణ రాసుకొచ్చారు. నిజానికి జగన్ మోహన్ రెడ్డికి సొంత కార్యవర్గం లేదని, గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనతో ఉన్నారని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. వారిని గనుక షర్మిల తన వైపు తిప్పుకుంటే ఇక వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం దాదాపు అసాధ్యమని తేల్చి పడేశారు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే ఒక్కసారిగా పరిస్థితి మారిపోతుందని, రేపటి నాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే తన కేసుల విషయంలో బిజెపి ప్రభుత్వం కూడా కాపాడలేదని రాధాకృష్ణ సూత్రీకరించారు.

    జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పాదాలకు బలపం కట్టుకొని తిరిగిన షర్మిలకు.. జగన్ పెద్దగా చేసింది ఏమీ లేదని రాధాకృష్ణ రాసుకొచ్చారు. రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి మెడపట్టి బయటికి గెంటేసారని రాధాకృష్ణ కొత్త విషయాన్ని చెప్పారు. వాస్తవానికి షర్మిలకు రాజ్యసభ సీటు జగన్మోహన్ రెడ్డి ఆఫర్ చేసినట్టు ఇంతవరకు తెలియదు. బహుశా షర్మిలకు రాధాకృష్ణ వ్యక్తిగత సలహాదారుగా ఉన్నారేమో.. ఎందుకంటే జగన్ షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయని బయట సమాజానికి చెప్పింది రాధాకృష్ణనే. తన ఏబీఎన్ ఛానల్ ద్వారా షర్మిలను ఇంటర్వ్యూ చేసిన రాధాకృష్ణ.. తర్వాత ఆమె పార్టీ పెట్ట బోతున్నారని చెప్పేశారు. తన పత్రికలో విశేషమైన ప్రయారిటీని షర్మిలకు ఇచ్చేలా చేశారు. చెప్పుకుంటూ పోతే షర్మిలకు సంబంధించి రాధాకృష్ణ చెప్పిన ప్రతి విషయం నిజమవుకుంటూ వస్తోంది. అయితే ఇన్ని విషయాలు చెప్పిన రాధాకృష్ణ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షర్మిల ఉపయోగపడదని చెప్పడం విశేషం. అంటే 2024 ఎన్నికల్లో మా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేస్తాం.. 2029 ఎన్నికల్లో మీరు తేల్చుకోండి అని ఇండైరెక్టుగా చెప్తున్నాడా?! ఏంటో రాధాకృష్ణ వ్యాఖ్యలకు అస్సలు అర్థం ఉండదు