Shankar Meena : పుట్ట గొడుగుల వ్యాపారం అనేక మంది జీవితాలను మలుపు తిప్పుతోంది. ఎంతో మంది పుట్టగొడుగులు సాగుచేసి జీవితంలో సక్సెస్ అయ్యారు. వీరి బాటలోనే పయనిస్తున్నాడు రాజస్థాన్‌కు చెందిన శంకర్ మీనా. తన గ్యారేజీలో మష్రూమ్స్ పండిస్తూ నెలకు రూ.13 లక్షలు సంపాదిస్తున్నాడు.
రైతు కుటుంబంలో పుట్టి..
రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో జన్మించిన శంకర్ మీనా తన బాల్యాన్ని గోధుమలు, ఆవాల పంటల మధ్య ఆడుకుంటూ పెరిగాడు. అయితే పెరిగేకొద్దీ ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటల సాగు కష్టంగా మారింది. తన తండ్రి ఇందుకు పడుతున్న కష్టాన్ని గమనించాడు. పెద్దయ్యాక తక్కువ పెట్టుబడితో స్థిరమైన ఆదాయం పొందే వ్యవసాయం చేయాలనుకున్నాడు. ఇందుకోసం కామర్స్‌లో డిగ్రీ చదివాడు. ఆర్థిక రంగంలో వృత్తిని కొనసాగించేందుకు ఆర్‌ఏ పోడార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏలో చేరాడు. 2012లో మొదటి సెమిస్టర్ పూర్తయిన వెంటనే డ్రాప్ అయ్యాడు.
వ్యవసాయం, వ్యాపారాన్ని అనుసంధానించేలా..
ఎప్పుడూ వ్యవసాయం, వ్యాపారం గురించి ఆలోచించే శంకర్ మీనా ఈ రెండింటిని అనుసంధానించడంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో పుట్టగొడుగుల యూనిట్ స్థాపించాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో 2015లో శంకర్ పుట్టగొడుగులను పండించడంలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు సోలన్‌లోని ICAR – డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్‌కి వెళ్లాడు. తిరిగి వచ్చాక తన ఇంట్లోని చిన్న గదిని ఖాళీ చేసి పుట్టగొడుగుల సాగుకు స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. ‘జీవన్ మష్రూమ్’ సంస్థను ప్రారంభించారు. దీనిద్వారా తన కలను నెరవేర్చుకున్నాడు. అక్కడ అతను బటన్, ఓస్టెర్, లయన్స్ మేన్, వరి గడ్డి, షియాటేక్, గానోడెర్మా, పోర్టోబెల్లో వంటి అనేక రకాల పుట్టగొడుగులను పెంచడంతోపాటు విక్రయించడం ప్రారంభించాడు.
విదేశాలకు ఎగుమతి..
రోజురోజుకూ శంకర్ మీనా వ్యాపారం అభివృద్ధి చెందింది. దీంతో ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా రూ.9 లక్షల రుణం తీసుకుని మష్రూమ్ సాగు విస్తీర్ణం పెంచాడు. 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ప్రతేయకమైన ల్యాబ్‌ను స్థాపించాడు. ఇందులో మెరుగైన ఉత్పాదకత కోసం శుభ్రమైన పని వాతావరణాన్ని అందించడానికి విత్తనాల అంకురోత్పత్తి గదులు, నిలువు ఆటోక్లేవ్‌లు, లామినార్ ఎయిర్‌ఫ్లో క్యాబినెట్ వంటి అధునాతన యంత్రాలను సమకూర్చుకున్నాడు. ఇలా పండించిన పుట్ట గొడుగులను దేశంలోనే కాకుండా విదేశాలకూ ఎగుమతి చేసేస్థాయికి ఎదిగాడు. తన ఉత్పత్తులను భూటాన్, నేపాల్, యూఏఈతోపాటు పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. ప్రస్తుతం అతని నెలవారీ ఆదాయం రూ.13 లక్షలు.