https://oktelugu.com/

CM Revanth Reddy: రేవంత్ సంచలన నిర్ణయం.. తెలంగాణ నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు

CM Revanth Reddy ప్రభుత్వానికి సంబంధించిన కీలక శాఖలో పాతుకుపోయిన అధికారుల వివరాలతో పాటు.. పదవి విరమణ చేసినప్పటికీ ఎక్స్టెన్షన్ లో కొనసాగుతున్న వారి జాబితాను తనకు ఇవ్వాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 18, 2024 / 01:14 PM IST

    CM Revanth Reddy

    Follow us on

    CM Revanth Reddy: కొన్ని సంవత్సరాల క్రితం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం అధ్యక్షురాలు వంకాయలపాటి మమత భర్త ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ చేశారు. అయితే కొద్ది రోజులకే ఆయన సర్వీస్ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. విద్యుత్ శాఖలో రిటైర్డ్ అయిన ఓ వ్యక్తిని అప్పటికప్పుడు ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఆయన పని చేయలేను అని చెప్పినప్పటికీ సర్వీస్ సంవత్సరాల పాటు పొడిగించింది. ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ లోనూ అధికారి సర్వీస్ కూడా ఇలానే పొడిగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వ హయాంలో కీలక శాఖల్లో చాలామంది ఉద్యోగులకు ఇలానే ప్రభుత్వం పొడగింపు ఆఫర్ ఇచ్చింది.. కీలక శాఖలకు సంబంధించిన సమాచారం వారి ద్వారా తెప్పించుకొని అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే పొడగింపు ఆఫర్ అందుకున్నారో.. వారందరిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

    ప్రభుత్వానికి సంబంధించిన కీలక శాఖలో పాతుకుపోయిన అధికారుల వివరాలతో పాటు.. పదవి విరమణ చేసినప్పటికీ ఎక్స్టెన్షన్ లో కొనసాగుతున్న వారి జాబితాను తనకు ఇవ్వాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో ఆగమేఘాల మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఏ ఏ శాఖల్లో.. ఎవరెవరు ఎక్స్టెన్షన్ లో కొనసాగుతున్నారో.. వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.. గత ప్రభుత్వం వారికి ఎందుకు ఎక్స్టెన్షన్ అవకాశమిచ్చింది? వారిని ఏ విధులకు ఉపయోగించింది? వారి వల్ల ప్రభుత్వానికి ఎటువంటి లాభం చేకూరింది? అనే విషయాల మీద సిఎస్ శాంతి కుమారి ఆరా తీస్తున్నారు. అంతేకాదు వారి వల్ల గత ప్రభుత్వ పెద్దలు ఏమైనా మేళ్ళు పొందారా అనే విషయాలపై కూడా కూపీ లాగుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, విద్య, పురపాలక, హోం, నీటిపారుదల, ఎక్సైజ్ వంటి శాఖలలో కొంతమంది ఉద్యోగులు తమ సర్వీస్ పూర్తయినప్పటికీ ఎక్స్టెన్షన్ విధానంలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం కూడా ఈ శాఖలకు సంబంధించి భారీగా కేటాయింపులు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఆ కేటాయింపుల్లో అప్పటి అధికార పార్టీ అనుకూలమైన వ్యక్తులకు ఆ అధికారులు అనుకూలంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

    అయితే రేవంత్ ఎక్స్టెన్షన్ లో కొనసాగుతున్న అధికారులను రెండవ మాటకు తావు లేకుండా బయటికి పంపేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వారిని సాగనంపే ప్రయత్నంలో సిఎస్ శాంతి కుమారి ఉన్నారు. వారిని తొలగించి ఆ స్థానంలో సీనియర్లకు అవకాశం ఇచ్చి.. సీనియర్ల స్థానంలో ఏర్పడిన ఖాళీలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను లోపాల మయంగా మార్చేసిందని.. దానివల్ల తమకు ఉద్యోగాలు రాలేదని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్స్టెన్షన్ పొందిన ఉద్యోగులను తొలగించడం ద్వారా ఏర్పడే ఖాళీల్లో తమకు అవకాశాలు లభిస్తాయని నిరుద్యోగులు అంటున్నారు. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం ఎక్స్టెన్షన్ పొందిన ఉద్యోగులను బయటకు పంపే ప్రయత్నాలు జోరందుకుంటాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి రేవంత్ తీసుకున్న నిర్ణయంతో మొన్నటి దాకా అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఇరుకున పడ్డట్టయింది. ఇదే సమయంలో గత ప్రభుత్వం చేసిన తప్పును ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లినట్టయింది.