Chandrababu : మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆసుపత్రిలో చేరారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం, బీపీ పెరగడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన చికిత్స కొనసాగుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉందని.. కొద్దిరోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. అయితే తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోవడంతోనే ఆయన ఆరోగ్యం క్షీణించిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బండారు సత్యనారాయణమూర్తి తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ వచ్చారు. గతంలో పరవాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో తప్పకుండా టికెట్ దక్కుతుందని ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయించారు. జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేయనున్నారు. అయితే చివరివరకు పెందుర్తి సీటును దక్కించుకునేందుకు బండారు సత్యనారాయణమూర్తి ఆరాటపడ్డారు. అల్లుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో పావులు కదిపారు. కానీ వర్క్ అవుట్ కాలేదు. టికెట్ దక్కకపోవడంతో కలత చెందారు. తన సీనియారిటీకి, సిన్సియార్టీకి సరైన గౌరవం లభించకపోవడంతో అవమానంగా భావిస్తున్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలను చెప్పినా చంద్రబాబు వి నక పోవడాన్ని తప్పుపడుతున్నారు. అందుకే అదే పనిగా తలుచుకొని అనారోగ్యానికి గురైనట్లు టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.
వైసిపి ప్రభుత్వ హయాంలో కేసులు ఎదుర్కొన్న నేతల్లో బండారు సత్యనారాయణమూర్తి కూడా ఒకరు. తెలుగుదేశం వాయిస్ వినిపించడంలో ముందుంటారు. ఆ మధ్యన మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో ప్రభుత్వం ఆయనపై ఉక్కు పాదం మోపాలని చూసింది. విశాఖలో అరెస్టు చేసి గుంటూరు తీసుకెళ్లింది. చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సత్యనారాయణమూర్తి బెయిల్ దక్కించుకున్నారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం వద్ద కూడా ఆయన పలుకుబడి పెరిగింది. ఎన్నికల్లో తప్పకుండా టికెట్ అన్న విశ్లేషణలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే జనసేన కోసం తనను పక్కన పెట్టడాన్ని బండారు సత్యనారాయణమూర్తి జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం మీదకు తెచ్చుకున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం నాయకత్వం బండారు సత్యనారాయణమూర్తి విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.